రాజకీయాల్లోకి వచ్చి పవన్ కల్యాణ్ లేనిపోని అహంభావాలు తలకెత్తుకున్నారా? రాజకీయాలు వదిలేసి చిరంజీవి వాస్తవాలు గ్రహించారా..? ప్రస్తుతం వీరిద్దరి ప్రవర్తన చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది.
రాజకీయాల నుంచి బైటకొచ్చిన తర్వాత చిరంజీవి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. అందరివాడు అనిపించుకోడానికి ఆయన తాపత్రయపడుతున్నారు. పొలిటీషియన్ గా ఉన్నప్పుడు ఉన్న భేషజాలు పక్కనపెట్టారు, ఇండస్ట్రీకి పెద్దగా తన మార్కు చూపిస్తున్నారు.
ఇక తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లేనిపోని ఇగోలు ఎక్కువైపోయాయి. కుల రాజకీయాలు చేయడం అలవాటైంది. నిజమైన అభివృద్ధిని పొగడలేని పరిస్థితి, బిల్డప్ లు ఎక్కువయ్యాయి. సింగిల్ సీటుకి పార్టీ పరిమితమై పోటీ చేసిన రెండు చోట్లా తాను ఓడిపోయినా కూడా ఇంకా భ్రమల్లోనే ఉన్నారు పవన్ కల్యాణ్.ఎంతగా అంటే ముఖ్యమంత్రిని కనీసం సీఎం అని కానీ, పూర్తిపేరుతో కానీ సంబోధించలేనంత.
జగన్ రెడ్డి, వైసీపీ నేత జగన్ రెడ్డి..ఇవీ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసే సంబోధనలు. కనీసం నోటితో ఆ పేరు పలకడానికి కూడా ఆయనకి ఎందుకో ఇష్టం ఉండదు. చంద్రబాబుని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం ఎక్కడలేని గౌరవం ఇస్తారు. గారు గీరు అంటూ భలే వినయం నటిస్తారు. నాగబాబు కూడా అంతే. కానీ తమ్ముళ్లిద్దరికీ పూర్తి విరుద్ధం చిరంజీవి.
“మా డైరీ” ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాట్లాడారు చిరంజీవి. విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి గురించి పరుచూరి వారు మాట్లాడినప్పుడు.. చిరంజీవి మైక్ అందుకుని సమాధానమిచ్చారు. సైరా రిలీజ్ సందర్భంలో ముఖ్యమంత్రితో జరిగిన భేటీ వివరాలు వెల్లడించారు.
“అన్నా మీరు చెప్పండి, మీరు ఏం చెబితే అది” అంటూ చాలా మర్యాదగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తనతో మాట్లాడారని, మీరంతా ఓ మాట అనుకుని రండి అని చెప్పారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సినీ ఇండస్ట్రీపై ఇంతే అభిమానం చూపిస్తారని అన్నారు.
ముఖ్యమంత్రిని గౌరవించడంలో చిరంజీవికి ఉన్న ఇంగితం,పవన్ కి లేకుండా పోయిందే అని చాలామంది అనుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులే కావొచ్చు కానీ, పేరుని కూడా అంత కించపరిచేలా మాట్లాడాలా అంటూ చాలామంది ఇప్పటికే పవన్ ని అసహ్యించుకుంటున్నారు. చిరంజీవి వ్యాఖ్యలతో పవన్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. అన్నదమ్ముల మధ్య ఉన్న అంతరం కొట్టొచ్చినట్టు కనిపించింది.