కరోనా వైరస్. అతి పెద్ద మహమ్మారి. మానవజాతి ఆవిర్భవించిన తరువాత ఇంతటి విలయం ఎక్కడా చూడలేదని అంటున్నారు. ఏకంగా గ్లోబ్ కే మాస్క్ కట్టేసుకున్న దుర్భరమైన వాతారణం ఇపుడు ఉంది. అగ్ర రాజ్యం, అడుగు రాజ్యం అన్న తేడా లేకుండా అన్నింటినీ ఒక్కసారిగా కబలించేసి తన సత్తా చాటుతోంది కరోనా.
అటువంటి కరోనా కూడా కొన్ని చోట్లకు వెళ్లలేని పరిస్థితి అసలు ఉంటుందా. ఊహకైనా అనుకోగలమా. కానీ ఉత్తరాంధ్రా జిల్లాల్లోని అత్యంత వెనకబడిన శ్రీకాకుళం గిరిజన ప్రాంతంలో మాత్రం కరోనా మచ్చుకైనా జాడ లేదని అంటున్నారు. కరోనా వైరస్ తో శ్రీకాకుళం జిల్లా అంతటా అల్లల్లాడుతోంది. రెండు వేల పై చిలుకు కేసులు ఉన్నాయి. అలాగే మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదు అవుతున్న వేళ జిల్లా అంతా మరో మారు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.
ఈ నేపధ్యంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కరోనా అనవాళ్ళు కనిపించకపోవడం పట్ల అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాదపు డెబ్బయి వేల పైచిలుకు గిరిజనులు ఇక్కడ జీవిస్తారు. వీరంతా కొండల్లో కోనల్లో పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు.
మామూలుగానే వీరి ఆహారపు అలవాట్లు, జీవన విధానం వంటికి కరోనాని కలలో కూడా రానివ్వవు అంటారు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వల్ల ప్రతీ ఒక్కరిలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. అదే విధంగా వీరంతా ఎపుడూ ఒకరికి ఒకరు దూరంగానే ఉంటారు. వారి నివాసాలు అన్నీ కూడా విసిరేసినట్లుగా ఉంటాయి.
ఇక వీరు తలకు తువ్వాలు కట్టుకుంటారు, ముక్కూ, మూతులకు కూడా గుడ్డ కట్టుకునే తన వ్యవసాయ పనులు తాము చేసుకుంటారు. అందువల్ల కరోనా నియంత్రణ పద్ధతులు సమాజం కంటే ముందే వారు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. ఈ కారణాల వల్ల కరోనా అన్న మాటే ఇక్కడ వినిపించడంలేదు. ప్రపంచాన్ని గుప్పిట పట్టిన కరోనాకి ఇక్కడ చోటు లేదు అనిపించిన ఈ మన్యం జనాన్ని స్పూర్తిగా తీసుకుంటే దేశంలో కూడా కరోనా మహమ్మారి లేకుండా పారదోలగలమని వైద్య నిపుణులు అంటున్నారు.