డ‌బ్బు కోసం కారు అమ్మ‌కానికి పెట్టిన‌ స్టార్ అథ్లెట్‌

క‌రోనా దుష్ప‌రిణామాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మార్చి చివ‌రి వారం నుంచి లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు ఎక్క‌డిక‌క్క‌డ…

క‌రోనా దుష్ప‌రిణామాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మార్చి చివ‌రి వారం నుంచి లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు ఎక్క‌డిక‌క్క‌డ స్తంభించాయి. లావాదేవీలు ఆగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్న‌మ‌వుతోంది. రోజురోజుకూ దాని తీవ్ర‌త తెలిసొస్తోంది.

తాజాగా ఓ స్టార్ అథ్లెట్ ద‌య‌నీయ స్థితి ప్ర‌పంచానికి త‌న‌కు తానే చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ఒలింపిక్స్ స‌న్నాహకాల‌కు డ‌బ్బు లేక‌పోవ‌డంతో చివ‌రికి త‌న బీఎండ‌బ్ల్యూ కారు అమ్మ‌కానికి పెట్టింది. ఇంత కంటే ఓ క్రీడాకారిణి జీవితంలో విషాదం ఏముంటుంది. ఆ బాధిత స్టార్ అథ్లెట్ ద్యూతీచంద్‌. క్రీడా లోకాన్ని నివ్వెర‌ప‌రిచేలా…కారు ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి…అమ్మాకానికి పెట్టిందామె. ఈ సంద‌ర్భంగా ఆమె పెట్టిన కామెంట్స్ మ‌న‌సుల‌ను క‌దిలించేలా ఉన్నాయి.

‘ఒలింపిక్స్‌కు సిద్ధ‌మ‌య్యేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు చేశా. ఇక ఖ‌ర్చు పెట్ట‌డానికి నా వద్ద ఏమీ లేదు. నా కోచ్‌, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్‌కు జీతాలు ఇవ్వడానికి నెలకు రూ.5 లక్షలు ఖ‌ర్చు వ‌స్తుంది. కరోనా మహమ్మారి కారణంగా స్పాన్సర్లు చేతులెత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే కష్టకాలంలో ఉన్నట్లు అధికారుల నుంచి జవాబు వచ్చింది.  చేసేదేమీక బీఎండబ్ల్యూను అమ్మకానికి పెట్టా. ఆ కారు మెయింటెనెన్స్‌ కూడా నాకు భారంగా మారింది’ అని ద్యూతీ ఆవేదన వ్యక్తం చేసింది.

ఆట‌పై ఇష్టాన్ని చంపుకోలేక‌, ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చివ‌రికి ఆస్తుల‌ను కూడా అమ్ముకోవాల్సి రావ‌డం మ‌న దేశ క్రీడా దౌర్భాగ్యం. దేశం త‌ర‌పున ఆడ‌డం చివ‌రికి వ్య‌క్తిగ‌త అంశంగా మార‌డం విషాదం.అందులోనూ స‌ద‌రు క్రీడాకారిణి ఏ ప‌రిస్థితుల్లో ఆ కారు కొన్నారో తెలుసుకుంటే మ‌న‌సు మ‌రింత కుంగిపోతుంది.

2015 ఆసియా క్రీడల్లో పతకం సాధించిన‌ప్పుడు ఒడిశా ప్రభుత్వం ద్యూతీకి రూ. 3 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఆ సొమ్ములో కొంత మొత్తాన్ని వెచ్చించి కారు కొనుగోలు చేసింది.  ఇప్పుడా కారును వేలానికి పెట్టాల్సి వ‌చ్చింది. కాగా  ద్యూతీ త‌న ద‌య‌నీయ స్థితిని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం… వైరల్ అయింది. ఈ నేప‌థ్యంలో ఒడిశా ప్రభుత్వం దిగి వ‌చ్చింది. ఒలింపిక్స్‌కు సిద్ధ‌మ‌య్యేందుకు సాయం చేస్తామంటూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుకొచ్చిన‌ట్టు తెలిసింది.  

మామా కోడలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్