ఏడ్చే మగాడ్ని నమ్మరు బాబూ

ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు అన్నది సామెత. మహిళ కంట తడిపెడితే సింపతీ వస్తుందేమో కానీ, మగాడు కన్నీరు పెడితే వున్న పరువు కాస్తా పోయి, మీమ్ లకు, వెటకారాలకు అవకాశం కలిగిస్తుంది. నలభైయేళ్ల రాజకీయ జీవితంలో…

ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు అన్నది సామెత. మహిళ కంట తడిపెడితే సింపతీ వస్తుందేమో కానీ, మగాడు కన్నీరు పెడితే వున్న పరువు కాస్తా పోయి, మీమ్ లకు, వెటకారాలకు అవకాశం కలిగిస్తుంది. నలభైయేళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి చంద్రబాబు కంట నీరు పెట్టారు. కంట నీరు పెట్డడం అన్నది చిన్న మాట. వెక్కి వెక్కి ఏడ్చారు అన్నది సరిగ్గా సరిపోతుంది. 

నిజానికి చంద్రబాబు ఏడ్వడం అంటే ధర్మరాజు అలిగిన చందం కాదు. అందువల్ల సాగరములు ఏకమైపోవు, భూకంపాలు రావు. కానీ అసలు చంద్రబాబు ఎందుకు కన్నీరు పెట్టారు అన్నది క్వశ్చను. ఇప్పటి వరకు ఇనేళ్లలో చంద్రబాబు కంట తడి పెట్టిన సందర్భంఅన్నది లేదు.  అయినవారు ఎవరైనా పోయినపుడయినా ఆయన కంట వెంట నీటి చుక్క జారిన దాఖలా లేదు. గూగుల్ లో వెదికినా ఆయన కంటతడి పెట్టిన ఫోటొ దొరకడం కాస్త కష్టమే.

పిల్లనిచ్చి, అనంతమైన ఐశ్వర్యాన్ని, అధికారాన్ని సంపాదించడానికి అవకాశం ఇచ్చిన మామ ఎన్టీఆర్ చనిపోయినపుడు కూడా బాబు బాధపడిన జ్ఞాపకం అయితే లేదు. మరెందుకు ఇంతలా కన్నీరు పెట్టారు. ఆయనకు అంత బాధ ఏం కలిగింది?  ఇదంతా పొలిటికల్ డ్రామా అయితే కేవలం సింపతీ తెచ్చుకోవడం కోసం అనుకోవాలి. ఆయన అభిమాన జనం అయ్యో అనుకుంటే ఫరవాలేదు. సింపతీ వర్కవుట్ అయినట్లే.

అలా కాకుండా చంద్రబాబు వల్లే కాలేదు. కన్నీరు పెట్టుకున్నారు. ఇక మనమేం చేస్తాం అని చేతులెత్తేస్తే ఇక అంతే సంగతులు. అలా కాకుండా ఆయన నిజంగానే కన్నీరు పెట్టుకుని వుంటే ఎందుయి వుంటుంది? జగన్ అండ్ కో అసెంబ్లీలో ర్యాగింగ్ చేసినందుకా? ఎంత మాత్రం కాకపోవచ్చు.

తను పెంచి పెద్ద చేసిన పార్టీ.  ఎన్టీఆర్ స్థాపించినా దాన్ని బలోపేతం చేసింది చంద్రబాబే. అందులో సందేహం లేదు. పార్టీలో తనకు అడ్డం పడతారు అనిపించిన వారందరినీ మెల్లగా బయటకు సాగనంపి, తనే కర్త, కర్మ, క్రియ గా మారారు. అలాంటి పార్టీని వారసత్వంగా కొడక్కు అప్పగించాలి. కొడుకును సిఎమ్ చేయాలి అనుకున్నారు. 

ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి చేతిలో పెట్టారు. ఆ తరువాత ఎమ్మెల్యేను చేయాలని అధికారం అందగానే ముఖ్య మంత్రిని చేయాలని ఆశించారు. కానీ ఏమయింది 2019లో ప్లేటు, ఫేటు రెండూ తిరగబడ్డాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 2024 కు అధికారం అందుతుందా అన్నది అనుమానంగా వుంది. 

అప్పటికీ పార్టీ కోసం సమస్త పణంగా ఒడ్డి పోరాడే మీడియా వుంది. వివిధ్య వ్యవస్థల్లో బాబుగారు నాటిన విత్తనాలు మానులై అండగా వున్నాయి. అయినా ఇంకా అనుమానమే. పార్టీ లో వృద్దతరం మాత్రం మిగిలింది. నవతరం అన్ని పార్టీల్లోకి సర్దుకుంది. తనయుడిని తను వుండగా సిఎమ్ చేస్తే సరేసరి. లేదూ అంటే పార్టీ జనాలు ఇట్టే తీసి పక్కన పెట్టి  జూనియర్ ఎన్టీఆర్ ను స్వాగితించడానికి రెడీగా వున్నారు. అంటే ఎన్టీఆర్ నుంచి లాక్కున్న పార్టీ మళ్లీ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్తుందన్నమాట. 

ఇవన్నీ కళ్ల ముందు సినిమా రీళ్లలా గిర్రున తిరిగి వుంటాయి. అందుకే కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. పనిలో పనిగా సింపతీ కూడా వర్కవుట్ అవుతుంది అని అనుకుని వుంటారు.

కానీ ఒకటే సమస్య. మనవాళ్లందరికీ తెలిసిన మాటే అది. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని.