తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక దళిత బంధు చుట్టూ తిరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని ఆ నియోజక వర్గంలోనే ప్రారంభించడంతో సహజంగానే రాజకీయ రంగు పులుముకుంది. తమది రాజకీయ పార్టీ అని, ఏది చేసినా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
ఈ నేపథ్యంలో దళితబంధు పథకాన్ని ఆపివేయాలంటూ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఈ పథకాన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయని, దళితుల అభివృద్ధిని ఓర్వలేకపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దళితుల ప్రయోజనాల్ని బీజేపీ దెబ్బ తీస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ అధికార పార్టీ విమర్శలను బీజేపీ సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగింది. దళితబంధు పథకాన్ని నిలిపి వేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను కేంద్ర ఎన్ని కల సంఘం ఎప్పుడూ నిలిపివేయదని పేర్కొన్నారు. కానీ సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ను పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడం వల్లే నిలిపేసే అవకాశాన్ని ఈసీకి కల్పించారని ఆయన విమర్శించారు.
పథకం ఆగేలా వ్యవహరించి, దళితుల్ని కేసీఆర్ మరోసారి మోసం చేశారని ధ్వజమెత్తారు తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని బండి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుట్ర బుద్ధితోనే ఇప్పటివరకు దళితబంధు నిధులు విడుదల కాకుండా ఆపారని ఆయన విమర్శించారు.
లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డ డబ్బును బ్యాంకులు ఫ్రీజ్ చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు ఆ డబ్బుల్ని డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం ఇచ్చినట్టు బండి తెలిపారు.