ఏపీ రాజకీయాల్లో మంగళవారం ఓ కీలక మలుపు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, ఆ పార్టీ మరో ముఖ్య నాయకుడు కామినేని శ్రీనివాస్‌తో రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ నెల 13న రహస్య భేటీకి సంబంధించి సీసీ పుటేజీ నిన్న బయట పడింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మగడ్డ అత్యంత వివాదాస్పద వ్యక్తిగా వార్తలకెక్కాడు.
ఇప్పుడు ఆయన భవిష్యత్ సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కేసులో ఇంప్లీడ్ అయిన బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో పాటు సుజనాచౌదరితో నిమ్మగడ్డ రహస్య చర్చలు జరపడం సహజంగానే సంచలనం రేకెత్తించింది. ఈ విషయమై అన్ని టీవీ చానళ్లలో సీసీ పుటేజ్ దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. డిబేట్లు నిర్వహించాయి. ఏపీ రాజకీయాలను కుదుపుతున్న రహస్య భేటీకి సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో మాత్రం స్థానం దక్కలేదు.
కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనాచౌదరి, కామినేని వివరణలకు మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి అగ్రస్థానం కల్పించాయి. ఈ రహస్య భేటీపై ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కున్నట్టు సత్యాన్ని సమాధి చేశాయి. ఈ ఒక్క ఘటన చాలు…గత కొన్నేళ్లుగా ఈ రెండు పత్రికలు ఎన్ని అరాచకాలను సృష్టించాయో చెప్పడానికి. వైశ్రాయ్ హోటల్ ఉదంతాన్ని పార్క్ హయత్ హోటల్‌లో ఈ ముగ్గురి రహస్య భేటీని పోల్చి చెబుతున్నారు.
ఇక పత్రికలు, మీడియా స్వేచ్ఛ గురించి ఆంధ్రజ్యోతి, ఆ పత్రిక ఎండీ ఆర్‌కే రాతలు చాగంటి కోటేశ్వరరావు ,గరికపాటి లాంటి వారి ప్రవచనాలను మించిపోతాయి. గత ఆదివారం ‘కొత్త పలుకు’లో మీడియా వార్తలపై ఆర్‌కే ఏం రాశాడో తెలుసుకుని తరిద్దాం పదండి.
‘రాజకీయ పరమైన అంశాలలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పరిణామాలకు, సంఘటనలకు కేసీఆర్ మీడియాలో చోటు ఉండకపోవడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేక వార్తలకు కేసీఆర్ మీడియాలో అధిక ప్రాధాన్యం లభించేది’
ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు (బుధవారం) ‘నోరు తెరిస్తే అంతే!’ శీర్షికతో బ్యానర్ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ‘భావ ప్రకటన స్వేచ్ఛపై రాష్ట్రంలో ఉక్కు పాదం’ అనే ఉప శీర్షిక ఇవ్వడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పరిణామాలకు, సంఘటనలకు కేసీఆర్ మీడియాలో చోటు ఉండక పోవడం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్పష్టమైన అవగాహనకు నిదర్శనమని రాసుకొచ్చిన ఆర్‌కే…మరి పార్క్ హయత్ హోటల్‌లో రహస్య సమావేశంపై ఆంధ్రజ్యోతిలో చోటు ఉండకపోవడంపై ఏమంటారు? చంద్రబాబుతో ఉన్న అవగాహన ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఆర్‌కేకు లేదా? జగన్ అధికారంలో ఉండడం వల్లే కదా ఆయనకు సంబంధించి ఫస్ట్ పేజీ మొదలుకుని, చివరి పేజీ వరకు వ్యతిరేక వార్తలను నిత్యం ప్రచురిస్తుండడం నిజం కాదా? జగన్, కేసీఆర్ రాజకీయ నేతలు. వాళ్లిద్దరి మధ్య రాజకీయ ప్రయోజనాలు తప్పక ఉంటాయి. మరి ఓ మీడియా అధిపతిగా రాజకీయాలతో ఆర్‌కేకు పనేంటి? ప‌్రతి అక్షరంలో అవకాశం వాదం ప్రతిబింబించే ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్‌కే రాతలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉంది.
ప్రస్తుతానికి వస్తే పార్క్ హయత్ రహస్య భేటీపై వార్త ఇవ్వడం పత్రికా ధర్మం. ఆ తర్వాత దాని గురించి కథనాలు ఆ మీడియా ఇష్టాయిష్టంపై ఆధార పడి ఉంటాయి. దీన్ని ఎవరూ ప్రశ్నించలేరు. కానీ ఆంధ్రజ్యోతిలో రహస్య భేటీపై వార్త మచ్చుకైనా కనిపించలేదు. ఆ సంఘటపై నలుగురు మంత్రుల అభిప్రాయాల్ని ‘నిమ్మగడ్డ రహస్య భేటీ వెనుక కుట్ర ’ అంటూ సింగిల్ కాలమ్‌తో ముగించారు.
ఇదే విషయమై ‘సుజనా, కామినేని అసాంఘిక శక్తులా?’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడిన దానికి సంబంధించి డబుల్ కాలమ్ వార్తను, అలాగే సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ స్పందనలను ‘అదేమీ రహస్యం కాదు!’ అనే శీర్షికతో ప్రచురించి ఆర్‌కే తన స్వామి భక్తిని ప్రదర్శించాడు.
ఇక ఈనాడు విషయానికి వస్తే ఆంధ్రజ్యోతికి మించిన స్వామి భక్తి. ‘వారిది బురద రాజకీయం’ శీర్షికతో సుజనా చౌదరి స్పంద నను ప్రధానంగా ప్రచురించారు. ఇందులోనే కామినేని అభిప్రాయానికి కూడా చోటు కల్పించారు.
ఆంధ్రజ్యోతిలో ఈ రోజు బ్యానర్ కథనంలో పేర్కొన్నట్టు ‘భావ ప్రకటన స్వేచ్ఛపై రాష్ట్రంలో ఉక్కు పాదం’ మోపారు. అయితే ఈ ఉక్కుపాదం మోపింది ఎవరనేదే ప్రధాన ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టంగా భావించే ఈ రహస్య భేటీ వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి రహస్యంగా ఉంచాలని ఎందుకు పరితపిస్తున్నాయ్? ఎవరి కోసం, ఎందుకోసం? ఇదేమీ దాస్తే దాగడానికి వైశ్రాయ్ ఘటన నాటి రోజులు కావే! నిజాలపై రామోజీ, ఆర్‌కే ఉక్కుపాదం మోపే కాలాలకు గ్రహణం పట్టిందనే విషయం ఇప్పటికైనా ఇరువురు పత్రికాధిపతులు తెలుసుకుంటే మంచిది.
కానీ ఒక్కటైతే నిజం. పార్క్ హయత్‌లో నిమ్మగడ్డ రహస్య భేటీ సీసీ పుటేజీ మాత్రమే కాదు బయట పడింది. ఇంత కాలం చంద్రబాబుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులు రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ రహస్య సంబంధాలు కూడా నగ్నంగా బట్టబయలయ్యాయి.
ఏపీలో భావ ప్రకటనా స్వేచ్ఛ జర్నలిస్టులకా? ఎల్లో మీడియా యజమానులకా? నిజంగా జర్నలిస్టులకే స్వేచ్ఛ ఉంటే ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో నిమ్మగడ్డ రహస్య భేటీపై ఎందుకు స్థానం కల్పించలేదు? సత్యానికి, నిజానికి సమాధి చేయడానికి భావ ప్రకటనా స్వేచ్ఛ కావాలా? ఈ స్వేచ్ఛ కోసమేనా ఈనాడు, ఆంధ్రజ్యోతి అరుపులు, పెడబొబ్బలు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఎలాగైతే అడ్డుకోలేమో…ఒక నిజాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి అనే పత్రికలతో అడ్డుకోలేరు. సత్యానికి సమాధి కట్టాలనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇదే నివాళి.
-సొదుం