కరోనా కల్లోలం నుంచి యూరప్ దేశాలు పూర్తిగా కోలుకుంటున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. లాక్ డౌన్ ను పూర్తిగా మినహాయించేలా ముందుకు సాగుతున్నాయి యూరోపియన్ దేశాలు. కోవిడ్ 19 విజృంభణతో తీవ్ర ఇబ్బందులు పడిన జాబితాలో యూరప్ దేశాలే ముందు నిలిచిన సంగతి తెలిసిందే. కరోనా నివారణకు ఎలాంటి నిఖార్సైన వ్యాక్సిన్ రాకపోయినా.. యూరప్ దేశాలు మాత్రం ఆ వైరస్ ను నియంత్రించిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. కోవిడ్ 19 అత్యంత తీవ్ర ప్రభావం చూపిన దేశాల్లోనే ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ క్రమంలో.. యూరప్ దేశాలు ధైర్యంగా ముందడుగులు వేస్తున్నాయి.
ఇప్పటికే ఆఫీసులు చాలా వరకూ తెరుచుకున్నాయి కొన్ని యూరప్ దేశాల్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ లు ముగించి, ఆఫీసులకు ఉద్యోగులు వెళ్తున్నారు. అలాగే మాల్స్, షాపులు కూడా తెరుచుకున్నాయి. రోడ్లు సందడిగా మారాయి, పార్కులు, పిక్నిక్ లు కూడా మొదలయ్యాయి కొన్ని దేశాల్లో. ఈ క్రమంలో దేశాల మధ్యన సరిహద్దులను కూడా తెరవడానికి యూరోపియన్ యూనియన్ లో భాగమైన దేశాలు పరస్పర అంగీకారం తెలపడం గమనార్హం.
కొన్ని దేశాల నుంచి వచ్చే వారికి కూడా ఈయూ దేశాలు వెల్కమ్ చెబుతున్నాయి. కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉన్న కెనెడా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి ప్రయాణికులకు ఎలాంటి షరతులు లేకుండా అనుమతిని ఇవ్వడానికి ఈయూ దేశాలు ఓకే చెప్పాయట. అలాగే పక్కపక్క దేశాల బోర్డర్లు కూడా తెరుచుకుంటున్నట్టుగా ఉన్నాయి. అయితే చైనా మీద ఒక కన్నేసి ఉంచాలని ఈయూ నిర్ణయించిందట. కరోనా ప్రభావం ఇంకా ఎక్కువ స్థాయిలోనే కొనసాగుతున్న అమెరికా కు మాత్రం ఈయూ దేశాలు సరిహద్దులను తెరవకపోవడం గమనార్హం.
మొత్తానికి ప్రపంచంలోని ఎంతో కొంత ప్రాంతం అయినా కోవిడ్ 19 ను జయిస్తూ ముందుకు సాగుతూ ఉండటం మిగతా దేశాలకు కూడా కరోనా పై విజయం సాధించగల విశ్వాసాన్ని ఇచ్చే అంశం.