మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికార రాజకీయాల్లో ఉంటే దూకుడు గా ఉంటారు. అలాగే విపక్షానికి చేరిన వేళ ఆయన అంతే సైలెంట్ గా కూడా ఉండగలరు. దానికి గత ఏడాదిన్నర కాలం ఒక ఉదాహరణ.
ఇక గంటా మౌన దీక్షకు భగ్నం కలిగిస్తున్న సూచనలు అయితే చాలానే విశాఖలో జరుగుతున్నాయి. ఈ మధ్యనే గంటాకు చెందిన భూములంటూ ఆనందపురం దగ్గర వాటిలోని కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చారు. అయితే దాని మీద కోర్ట్ స్టే ఇచ్చింది.
ఇక తాజాగా గంటాకు అతి ముఖ్య అనుచరుడుగా ఉన్న రియల్టర్ కాశీవిశ్వనాధ్ విశాఖ బీచ్ రోడ్డులో ఒక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చేశారంటూ తాజాగా జీవీఎంసీ అధికారులు కూలగొట్టడం స్టార్ట్ చేశారు.
విశాఖ భీమిలీ రోడ్డు మంగమారిపేట వద్ద గో కార్టింగ్ ఆక్రమణ చేశారని అధికారుల ఆరోపణ. అయితే అది ప్రైవేట్ స్థలమని, పైగా వైజాగ్ ప్రొఫైల్స్ నుంచి పదేళ్ళ పాటు తాను లీజుకు తీసుకున్నానని కాశీ అంటున్నారు.
ఇక తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూలగొడుతున్నారని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి తనకూ, తన అనుచరులకు ఇలా వరస దెబ్బలు పడుతున్న వేళ గంటా పెదవి విప్పే రోజు దగ్గరలోనే ఉందని అంటున్నారు. మరి ఆయన సైలెంట్ వీడితే అది ఎవరికు చేటు అన్నది కూడా చూడాలిక్కడ అంటున్నారు.