కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండే సరికి ప్రభుత్వాలు లాక్ డౌన్ శరణ్యమనే పరిస్థితుల్లోకి వస్తున్నాయి. మొదటి నుంచి కరోనా ప్రభావం పెద్దగా లేని కర్ణాటక రాజధాని బెంగళూరులో జూలై మొదటి నుంచి కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. రోజు వారీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండటంతో.. ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించింది. వారం రోజుల పాటు అని ఇప్పటికే ప్రకటించారు.
అయితే కొందరు నిపుణులు ప్రస్తుతం బెంగళూరు ఉన్న పరిస్థితులు నియంత్రణలోకి రావాలంటే కనీసం మూడు వారాల లాక్ డౌన్ తప్పనిసరి అని చెబుతున్నారు. వారం రోజులు అని ప్రభుత్వం ప్రకటించగా, మూడు వారాల తప్పనిసరి లాక్ డౌన్ మేలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం వారం రోజులే అని స్పష్టం చేస్తున్నారు. వారం రోజులకు ఈ లాక్ డౌన్ ను పరిమితం చేస్తారా? లేక పొడిగిస్తారా? అనేది ఈ వారం గడిస్తే కానీ తెలియకపోవచ్చు.
ఇక మరో వైపు చాలా మంది బెంగళూరును ఖాళీ చేసి వెళ్లిపోయారు. లాక్ డౌన్ ప్రాంరంభం గురించి ప్రభుత్వం ముందే ప్రకటించడంతో.. నిన్న బెంగళూరులో హడావుడి కనిపించింది. సరుకులు కొనుగోలు చేసే వాళ్ల తాకిడితో షాపుల్లో ఎక్కువ మంది కనిపించారు. ఇక మరి కొందరు సిటీ విడిచి సొంతూళ్ల బాట పట్టారు. లాక్ డౌన్ పరిమితుల తర్వాత చాలా మంది తెలుగు వాళ్లు ఎలాగోలా బెంగళూరు చేరుకున్నారు. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ నేపథ్యంలో కొందరు ఇళ్లను కూడా ఖాళీ చేసి వెళ్లిపోవడం గమనార్హం!
ఇప్పుడప్పుడే మళ్లీ బెంగళూరుకు రావాల్సిన అవసరం లేని వాళ్లు చాలా మంది ఇదే అదనుగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఐటీ వాళ్లు ఈ ఏడాదంతా ఆఫీసులు మూతే అనే అంచనాకు వచ్చారు. ఇక చిన్న చిన్న పనులు, వ్యాపారాలు చేసుకునే వాళ్లకూ వస్తున్న ఆదాయానికి, ఖర్చులకూ పొంతన లేని పరిస్థితి. అందుకే చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి సొంతూళ్ల బాట పట్టారు. నగరంలో భారీ రెంట్లను కట్టే శక్తి తగ్గిపోతుండటంతో.. ఇళ్లను ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం అవుతోంది. ఇలాంటి వాళ్లు ఇప్పుడు సొంతూళ్ల బాట పట్టారు.