అదృష్టం ఒకసారే తలుపుతడుతుంది తీసినవాడు అదృష్టవంతుడు, తీయని వాడు దురదృష్టవంతుడు అంటారు. దుబ్బాక ఉపఎన్నిక రూపంలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తలుపును అదృష్టం అలాగే తట్టింది.
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి రమ్మనమని పిలుపు వచ్చింది. వస్తారని వార్తలు కనిపించాయి. కానీ మనదంతా మేకపోతుగాంభీర్యం టైపు కదా? పొరపాటున కూడా తెలంగాణలో తెరాసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని భ్రమపడడానికి లేదు.
మన ప్రతాపం అంతా ఆంధ్రలోనే కదా. అందుకే సింపుల్ గా ఓ ప్రెస్ నోట్ ఇచ్చి ఊరుకున్నారు. సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు తీరా అక్కడ భాజపా విజయం సాధించేసింది.
ఇదే కనుక తను వెళ్లి వుంటే ఈ విజయంలో తన వాటా తాను తీసుకుని వుండేవాడిని అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫీలవుతున్నట్లు బోగట్టా. కచ్చితంగా జనసేన ఖాతాలో ఓ పాజిటివ్ పాయింట్ పడి వుండేదని ఆయన తెగ సతమతమవుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా వుంటే గెలిచిన భాజపాను అభినందించడానికి కూడా పవన్ కాస్త పదాలు చాలా జాగ్రత్తగా వెదుక్కుని మరీ పేర్చినట్లు కనిపిస్తోంది. పొరపాటున కూడా తెరాస, కేసిఆర్ లాంటి పదాలు లేకుండా జాగ్రత్త పడ్డారు.
ఇదే ఆంధ్రలో అయితే వైకాపాకు బుద్ది చెప్పారు. జగన్ కు గుణపాఠం నేర్పారు లాంటి పదాలు వాడి వుండేవారు. కానీ ఇక్కడున్నది కేసిఆర్ కదా? అందుకే అస్సలు అలాంటి పదాలు రాకుండా జాగ్రత్త పడ్డారు.
అస్సలు ఆ మాటకు వస్తే భాజపా దుబ్బాకలో ఏ పార్టీమీద విజయం సాధించింది అన్నది కూడా తనకు తెలియనట్లు వుండిపోయారు. ఇదిలా వుంటే ఇప్పుడు ఈ ఎన్నిక ఇచ్చిన ధైర్యం చూసి హైదరాబాద్ నగర ఎన్నిక విషయంలో పవన్ రంగంలోకి దిగుతారా? అని ఆలోచించాల్సి వుంది.
కానీ అదీ అనుమానమే. ఎందుకంటే ఇటీవలే కేసిఆర్ ప్రభుత్వానికి ప్రోగ్రెసివ్ అండ్ కన్ స్ట్రక్టివ్ ప్రభుత్వం అని పవన్ కితాబు ఇచ్చారు. అందుకే తాను విరాళం ఇచ్చా అన్నారు.
మరి ఇప్పుడు జిహెచ్ ఎమ్ సి ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ అండ్ కన్ స్ట్రక్టివ్ కాదని ఎలా అంటారు? అందుకే మళ్లీ మరో గోల్డెన్ చాన్స్ వదులుకుంటారేమో?