వైసీపీ నేతలపై అవాకులు, చవాకులు పేలుతున్న పవన్ కల్యాణ్ కి ఎట్టకేలకు మద్దతు దొరికింది. టీడీపీ పూర్తిగా ఈ వ్యవహారాన్ని పక్కనపడేయగా.. బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహారావు ఒక్కరే పవన్ కి బాసటగా నిలిచారు.
సహనం, సమాధానం చెప్పే బాధ్యత వైసీపీ నాయకులకు లేదన్నారు జీవీఎల్. పోనీ పవన్ కి అవి ఉన్నాయో లేదో జీవీఎల్ కే తెలియాలి.
జనసేన, బీజేపీ పొత్తు వ్యవహారంలో కూడా జీవీఎల్ నరసింహారావు కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా మిగతా నాయకుల కంటే ఆయనే పవన్ తో కాస్త సఖ్యతగా ఉన్నారు. తీరా ఇప్పుడు వైసీపీ ఫుల్ కోటింగ్ తర్వాత ఎవరూ ముందుకు రాని పక్షంలో జీవీఎల్ మాత్రమే ఆయనకు మద్దతుగా స్పందించారు.
తిట్ల తుఫాన్ నుంచి గులాబ్ తుఫాన్ వరకు..
పవన్ కి మద్దతుగా మాట్లాడుతూ పనిలో పనిగా వైసీపీకి సుద్దులు చెప్పారు జీవీఎల్. తిట్ల తుఫాన్ పై శ్రద్ధ తగ్గించి, గులాబ్ తుఫాన్ పై దృష్టిపెట్టాలన్నారు. అయితే ఈ మాట ఆయన ప్రధాని నరేంద్రమోదీకి చెబితే బాగుంటుందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
తుఫాన్ సాయం కావాలని సీఎం ఫోన్ చేస్తే.. నేనున్నానంటూ భరోసా ఇచ్చి, తీరా సాయం సంగతి పక్కనపెట్టి తెలుగులో ఓ ట్వీట్ వేసి చేతులు దులుపుకున్నారు మోదీ. పన్నుల రూపంలో రాష్ట్రాల నుంచి పిండుకోవడం మినహా.. విపత్తుల వేళ సాయం చేయడం కూడా ఆయన మరిచిపోయినట్టున్నారు.
పతనం అయిపోతారు జాగ్రత్త..
నువ్వు ఒకటంటే, నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచిక అని అన్నారు జీవీఎల్. పోనీ వైసీపీ నేతలు వంద అన్నారు సరే.. ఆ తర్వాత పవన్ మళ్లీ కౌంటర్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి. గ్రామసింగాలంటూ ట్వీట్ వేసి మరీ రెచ్చగొట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
ఇక్కడ రాజకీయంగా పతనం అయింది ఎవరు. వైసీపీ నేతలది పతనం అనుకుంటే.. పవన్ ది పతనానికి పరాకాష్ట కాదా?
మొత్తమ్మీద జనసైనికులు సంతోషించదగ్గ విషయం ఏంటంటే.. రాజకీయ, సినీ ఇండస్ట్రీల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా పవన్ కి మద్దతివ్వని సందర్భంలో జీవీఎల్ మాత్రమే ఆయనకు వంతపాడారు, తనపై సెటైర్లు వేయించుకున్నారు.