ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 10న ఎన్నికలు జరిగాయి. 56.86% పోలింగ్ నమోదైంది. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
వీరి పిటిషన్లపై హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చని డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు మరో మూడు రోజుల్లో కౌంటింగ్ చేపట్టేందుకు ఎస్ఈసీ ఆదేశాలిచ్చారు. నాలుగు నెలల తర్వాత ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండడం సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.