తుపాను ప్రభావంతో మరోసారి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా తిరుపతిలో కుంభవృష్టి పడుతోంది. ఆకాశానికి చిల్లు పడుతున్నట్టు ఎడతెరిపి లేని వర్షాలతో తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు మరోసారి జలమయం అవుతున్నాయి. రోడ్లపై నీళ్లు పారుతుండడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడానికి వీల్లేని పరిస్థితి. ఇదిలా ఉండగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను అప్రమత్తం చేశారు.
నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ వర్షం వల్ల ప్రజానీకానికి ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
రెవెన్యూ, పోలీసుశాఖలు ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, ఇతర నీటినరుల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా తగిన చర్యలు తీసుకో వాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.