cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

క‌న్నాగుట్టును ర‌ట్టు చేసిన సొంత పార్టీ నేత‌!

క‌న్నాగుట్టును ర‌ట్టు చేసిన సొంత పార్టీ నేత‌!

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ మ‌ధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల వ్య‌వ‌హారం...చివ‌రికి బీజేపీలో అంత‌ర్గ‌త విభేదాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది. బీజేపీలో క‌న్నా, జీవీఎల్ వ‌ర్గాలుండ‌టం బహిరంగ ర‌హ‌స్య‌మే. క‌న్నా వ‌ర్గంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ సుజ‌నాచౌద‌రి, పురంధేశ్వ‌రి, చిన్నాచిత‌కా నాయ‌కులు;  బీజేపీ జాతీయ నాయ‌కుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు వ‌ర్గంలో సోము వీర్రాజు, విష్ణుకుమార్‌రాజు, క‌న్నా వ‌ర్గాన్ని వ్య‌తిరేకించే వాళ్లంతా ఉన్నారు.

తాజాగా క‌న్నా-విజ‌య‌సాయి మ‌ధ్య వివాదంలో కూడా సొంత పార్టీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడికి పెద్ద‌గా మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా క‌న్నాపై విజ‌య‌సాయి తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు చేసినా...రాష్ట్రానికి చెందిన జీవీఎల్ మాట మాత్రం కూడా ఖండించ‌లేదు. జీవీఎల్ మౌనం పాటించ‌డం వెనుక వ్యూహం ఉందంటున్నారు. అయితే జీవీఎల్ మౌనం పాటించ‌డం ద్వారా విజ‌య‌సాయి ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థించిన‌ట్టే క‌దా అని క‌న్నా వ‌ర్గీయులు ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు, త‌మ నాయ‌కుడిపై విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు కాణిపాకం వినాయ‌కుడి ఎదుట సాష్టాంగ‌ప‌డ‌తాన‌ని ధీమ‌గా ప్ర‌క‌టించ‌డం వెనుక, బీజేపీలోనే "న‌మ్మ‌క‌మైన సోర్స్‌"పై ధీమాతోనే అని చెబుతున్నారు. ఆ న‌మ్మ‌క‌మైన మ‌నిషి జీవీఎల్ మాత్ర‌మేన‌ని క‌న్నా వ‌ర్గం ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతోంది. క‌న్నా గుట్టును ప‌రోక్షంగా జీవీఎల్ ర‌ట్టు చేశార‌ని క‌న్నా వ‌ర్గం న‌మ్ముతోంది. అంతేకాదు, బుధ‌వారం బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్ ఏపీ నాయ‌కుల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో విజ‌య‌సాయిరెడ్డిపై కంటే పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను లీక్ చేస్తున్న ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ముందుగా విజ‌య‌సాయిరెడ్డి బుధ‌వారం చేసిన ట్వీట్‌ను గ‌మ‌నిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలున్నాయి.

" కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశాడ‌ని ఎల‌క్ష‌న్ల త‌ర్వాత క‌న్నాపై అధిష్టానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు అప్ప‌ట్లో ప‌త్రిక‌లు రాశాయి. స్థానికంగా సేక‌రించిన విరాళాలు దారి మ‌ళ్లాయ‌ని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. క‌న్నాతో కొత్త‌గా చేరిన నేత‌లు ఈ నిధులు పంచుకున్న‌ట్టు పెద్ద‌ల‌కు తెలుసు" ...ఈ ట్వీట్ త‌గ‌లాల్సిన వాళ్ల‌కే సూటిగా బుల్లెట్‌లా దిగింది.

ఎందుకంటే ఈ ట్వీట్ విడుద‌లైన త‌ర్వాత ఏపీ బీజేపీ నేత‌లు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, పురంధేశ్వ‌రి, సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధ‌వ్‌తో  బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్ మ‌ధుక‌ర్‌జీ, మ‌రో ఇద్ద‌రు నేత‌లు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఏపీ బీజేపీ నేత‌లు ఏమ‌న్నారంటే...

" పార్టీలోని ఒక‌రిద్ద‌రి వ‌ల్లే సాయిరెడ్డి బీజేపీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పై మాట్లాడేందుకు సాహ‌సించ‌గ‌లిగారు. క‌రోనా విష‌యంలో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ‌రుస‌గా ప్ర‌శ్నిస్తున్న బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నాను అందుకే ల‌క్ష్యంగా చేసుకున్నారు. త‌మ‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన వ్య‌క్తుల ప‌ద‌వులు ఉండ‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కొంద‌రు బీజేపీ నేత‌ల‌ను త‌న చెప్పు చేతుల్లోకి తీసుకునేందుకు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు" అని రాష్ట్ర బీజేపీ నేత‌లు అన్నారు.

విజ‌య‌సాయి త‌న ట్వీట్‌లో కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశాడ‌నడం, స్థానికంగా సేక‌రించిన విరాళాలు దారి మ‌ళ్లాయ‌ని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయ‌డ‌నం, క‌న్నాతో కొత్త‌గా చేరిన నేత‌లు ఈ నిధులు పంచుకున్న‌ట్టు పెద్ద‌ల‌కు తెలుసు అని చెప్ప‌డం, ఢిల్లీ పెద్ద‌లు మంద‌లించార‌ని ట్వీట్ చేయ‌డం వెనుక‌...ఈ కీల‌క స‌మాచారాన్ని కేవ‌లం జీవీఎల్ మాత్ర‌మే ఉప్పందించార‌ని క‌న్నా , పురంధేశ్వ‌రి అనుమానిస్తున్నారు. అంతే త‌ప్ప విజ‌య‌సాయి ఆరోప‌ణ‌ల్లో త‌ప్పు ఉంద‌ని వాళ్లు గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోతున్నారు. అంతేకాదు క‌న్నాను బీజేపీ నేత‌లు వెనకేసుకుని రాక‌పోవ‌డానికి కార‌ణం...అవ‌న్నీ నిజ‌మేన‌ని న‌మ్మ‌డం వ‌ల్లే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విజ‌య‌సాయిరెడ్డిపై కంటే కూడా ఆ స‌మాచారాన్ని ఇచ్చిన జీవీఎల్‌పైనే క‌న్నా తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలిసింది. అందుకే జీవీఎల్‌తో పాటు ఆయ‌న అనుచ‌రులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌న్నా వ‌ర్గం డిమాండ్ చేస్తోంది.

-సొదుం

కన్నా బీజేపీకి మాత్రం కన్నం వెయ్యకు