cloudfront

Advertisement


Home > Politics - Gossip

తెలంగాణలో పవన్ కి అంత సీన్ ఉందా?

తెలంగాణలో పవన్ కి అంత సీన్ ఉందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నాడో లేక, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడో తెలియదు కానీ పవన్ కల్యాణ్ తెలంగాణ లోక్ సభ నియోజక వర్గాలకు వరసబెట్టి కమిటీలను ప్రకటిస్తున్నారు. ఏపీలో పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టలేదు కానీ తెలంగాణలో మాత్రం యమా స్పీడ్ గా ఉన్నారు.

మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 12 నియోజక వర్గాలకు కమిటీలు వేశారు. ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 30 మందిని సభ్యులుగా ప్రకటించారు. ఆమధ్య ఏపీలో వీరమహిళ కమిటీలు, నియోజకవర్గ కమిటీలంటూ హడావిడి చేసిన పవన్ విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా, సొమ్ములున్నవారికే పదవులిచ్చారంటూ చాలామంది సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఐదు నియోజక వర్గాలకు కమిటీలు వేసిన పవన్, ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు ఆయన దృష్టి అంతా తెలంగాణపై పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమికి గట్టిగా బుద్ధిచెప్పిన కేసీఆర్, పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేశారు. బీజేపీ కూడా కేసీఆర్ దెబ్బకు భయపడిపోయింది. 17 స్థానాల్లో ఒకటి ఎంఐఎంకు, 16 టీఆర్ఎస్ కు అని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. దాదాపుగా ఫలితాలు అలాగే ఉంటాయని, మహా అయితే ఖమ్మం చేజారుతుందని సర్వేల్లో తేలుతోంది. ఇలాంటి సమయంలో పవన్ ఏం సాధిద్దామని తెలంగాణ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారో అర్థంకావడం లేదు.

పార్టీ క్యాడర్ బలంగా ఉన్న వైసీపీనే తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంది. ఏపీపైనే తన దృష్టి అంతా అని చెబుతున్న జగన్, కావాలనే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరి పవన్ ఎందుకు అక్కడికి పరిగెడుతున్నారో అర్థంకాని పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే పవన్ ని కేసీఆర్ ఆహ్వానించారా? ఆ మధ్య గవర్నర్ గెట్ టు గెదర్ లో పవన్, కేసీఆర్ ఈ విషయంపైనే ముచ్చటించుకున్నారా?

ఏదేమైనా ఈసారి జనసేనాని తెలంగాణ ఎన్నికల రణరంగంలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే తెలంగాణలో కమిటీలు ప్రకటించడంపై ఉన్న శ్రద్ధ, ఏపీ పార్టీ నిర్మాణంపై పెడితే బాగుంటుందని జనసైనికులు అంటున్నారు.

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు