cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఎన్నికల వేళ నారాయణ కాలేజ్ ఎపిసోడ్?

ఎన్నికల వేళ నారాయణ కాలేజ్ ఎపిసోడ్?

గత ఎన్నికల సమయంలో నారాయణ కాలేజ్ ఎంత కీలకపాత్ర పోషించిందో అందరం చూశాం. కాలేజీ భవనాలు, బస్సులతో పాటు స్టాఫ్ ను కూడా టీడీపీ కోసం విచ్చలవిడిగా వాడిన దాఖలాలున్నాయి. ప్రజల్ని బహిరంగ సభలకు తరలించడానికి, అక్రమంగా డబ్బు, మద్యం పంచడానికి నారాయణ కాలేజీ బస్సుల్ని యధేచ్ఛగా వాడారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మరోసారి అదే కార్యక్రమానికి నారాయణ విద్యాసంస్థలు సిద్ధమవుతున్నాయట.

ఏపీలో ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నారాయణ నెట్ ను మరోసారి వాడబోతున్నారట. కేవలం భవనాలు, బస్సులు మాత్రమే కాకుండా.. విద్యార్థుల్ని కూడా ఎలా వాడుకోవాలనే అంశంపై ఇప్పటికే కార్యాచరణ సిద్ధంచేశారట. ఏదో పథకం పేరిట విద్యార్థులకు డబ్బులిచ్చి ఊళ్లల్లో పంచిపెట్టే కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారట. విద్యార్థుల్ని చుట్టుపక్కల ఊళ్లకు కాలేజీ బస్సుల్లో తరలించి, అవే బస్సుల్లో తిరిగి తీసుకొస్తారట. ఈమేరకు స్టూడెంట్స్ కు కూడా అలవెన్స్ పేరిట కొంత ముట్టజెబుతారట.

ఇవన్నీ ఒకెత్తయితే.. రాష్ట్రవ్యాప్తంగా నారాయణ బస్సుల వాడకం మరోఎత్తు. అన్ని ఏరియాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ స్కూల్ బస్సుల్ని అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా కేవలం జనాల్ని తరలించడమే కాకుండా.. కోట్లలో డబ్బు పంచిపెట్టబోతున్నారట. అంటే ఓటుకు నోటు అన్నమాట. గతంలో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష, ఇంకేవో నిరసన దీక్షలు చేసినప్పుడు నారాయణ కాలేజ్ ఎంత ఓవరాక్షన్ చేసిందో అందరం చూశాం. అలాంటిది ఇప్పుడు ఎన్నికల టైమ్ కాబట్టి ఓ రేంజ్ లో విజృంభించబోతోంది నారాయణ.

అటు నెల్లూరులో ఈసారి స్వయంగా నారాయణ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న మొత్తం బలగాన్ని, బలాన్ని మొహరించారు. ఇలా ఓవైపు నెల్లూరులో "గ్రౌండ్ వర్క్" చేస్తూనే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి అండదండలు అందించేందుకు నారాయణ విద్యాసంస్థలు సర్వసన్నద్ధమయ్యాయి. ఏపీ రాజకీయాల్లో వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ కు ఎంత ప్రాముఖ్యత ఉందో, రాబోయే కాలంలో నారాయణ కాలేజ్ ఎపిసోడ్ కూడా అంత ప్రాధాన్యం సంతరించుకుంటుందేమో? 

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?