Advertisement


Home > Politics - Gossip
125 కోట్ల మంది గెలిచినట్లేనా.. మోడీగారు!

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఒక ప్రచార ప్రకటనను గమనించారా? నోట్ల రద్దు సందర్భంగా నల్లధనానికి వ్యతిరేకంగా జరిగిన యుద్దంలో 125కోట్ల మంది ప్రజలు విజయం సాధించారట. నిజంగానే దేశ ప్రజలంతా విజయం సాదిస్తే మరి నల్లధనం ఎవరి దగ్గర ఉన్నట్లు? తాను తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలందరి మద్దతు ఉందని అనుకోవాలని ఆయన ఆకాంక్షే. కాని నిజంగానే ప్రజలంతా దానికి మద్దతు ఇస్తున్నారా?అన్నది పెద్ద ప్రశ్నే.

మోడీ పెద్ద నోట్లను రద్దుచేసి ఏడాది కాలం పూర్తి అయింది. గత ఏడాది నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి ఆయన చేసిన ప్రకటన దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం షృష్టించింది. అన్ని రాజకీయ పార్టీలు దీనిపై ఎలా స్పందిచాలా అన్నదానిపై కొంత ఇబ్బంది పడ్డాయి. నోట్ల రద్దును వ్యతిరేకిస్తే ఏమవుతుందో అని భయపడ్డారు. కొందరు అయితే ఈ సంగతి తాము ఎప్పుడో చెప్పాం అని క్రెడిట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంత సంక్షేభం తాము చూడలేదని జారుకున్నారు.

ప్రజలు ముఖ్యంగా సామాన్యులు అంతా ఏదో పెద్ద మార్పు జరిగిపోతుందని, దేశంలో నల్లధనం లేకుండా పోతుందని, తమ బ్యాంకు ఖాతాలలోకి వేలో, లక్షలో వస్తాయని, ధనవంతులంతా ఇబ్బంది పడతారని భావించారు.ప్రధాని కూడా తనకున్న ప్రసంగ శైలితో ఉచ్చస్వరంతో నల్లధనంపై యుద్దంలో భాగంగా నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆయన జపాన్ వెళ్లారు. తిరిగి గోవాకు వచ్చి తాను చేస్తున్న సంస్కరణలకు గాను తనపై హత్యాయత్నం జరగవచ్చని కూడా ఆయన అనుమానించారు.

అంతేకాదు. నోట్ల రద్దు గడువు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ఏదైనా తేడా వస్తే తనను రోడ్డుపై నిలదీయవచ్చని కూడా ఆయన సవాల్ చేశారు. అయితే ఆయన ఊహించినట్లుగానే అంతా జరిగిందా? ఈ ఏడాది కాలంలో నోట్ల రద్దు వల్ల ఎవరు నష్టపోయారు. ఎవరు లాభపడ్డారంటే ప్రభుత్వమే ఏమీ చెప్పలేని నిస్సహాయ స్తితిలో పడింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ దీనిపై వివరణ ఇస్తూ దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. మోడీకాని, అరుణ్ జైట్లి కాని కొన్నిసార్లు నోట్ల రద్దు వల్ల నష్టం జరిగిందన్న వాదనను తోసిపుచ్చేవారు.

ఈ లోగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాదించడంతో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇబ్బందిగా మారే పరిస్తితి తయారైంది. అదే సమయంలో పంజాబ్ లో కాంగ్రెస్ గెలిచింది. గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు వచ్చినా, బిజెపినే అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. కారణాలు ఏమైనా అంతిమంగా ఎన్నికల ఫలితాలే కొలమానంగా తీసుకునే రోజులుగా ఉన్నాయి. దాంతో మోడీ కాని, బిజెపి అద్యక్షుడు అమిత్ షా కాని కాలర్ ఎగురవేసుకుని తిరగగలుగుతున్నారు.

అంతమాత్రాన అంతా సజావుగా ఉన్నట్లే అవుతుందా? ఆర్దిక వ్యవస్థ చూస్తే వృద్ది రేటు పడిపోయింది. లక్షల ఉపాది అవకాశాలు పోయాయని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం తదితర రంగాలు కుదేలు అయ్యాయి. ముఖ్యంగా మూడు విషయాలు మోడీ చెప్పారు. ఒకటి అవినీతి పోతుందని, రెండు నల్లధనం పోతుందని, మూడు ఉగ్రవాదం పోతుందని మోడీ చెప్పేవారు. కాని అవినీతి పోయిందన్న వాదనలకు పెద్దగా బలం చేకూరడం లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలోనే బిజెపితో సహా ఆయా పార్టీలు వందల కోట్ల రూపాయలు అనధికారికంగా ఖర్చు చేశాయి.

ఆర్.కె.నగర్ ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేయాల్సి వచ్చింది. బిజెపిమిత్ర పక్షమైన టిడిపి నంద్యాలలో నల్లధనం వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కమిటీ చైర్మన్ చంద్రబాబు ఆద్వర్యంలోనే టిడిపి పెద్ద ఎత్తున నల్లధనం పంపిణీ చేసింది. అయినా కేంద్రం కాని, సంబందిత అదికారులు కాని కిమ్మనలేదు. ఇదంతా అవినీతికి కిందకు వస్తుందా? రాదా అన్నది మోడీ చెప్పాలి. నల్లధనం పోతుందన్నది కూడా భ్రమ గానే ఉంది. టిటిడి మాజీ సబ్యుడు శేఖర్ రెడ్డి వందకు వందల కోట్ల రూపాయలు నేరుగానే వెళ్లిపోయాయని నిర్దారణ అయింది.

ఇలా ఎంత మంది ధనికుల వద్దకు వెళ్లిందో ఎవరు చెప్పగలరు. ఉగ్రవాదం పోతుందనుకుంటే కశ్మీర్ లో అది పెచ్చుమీరి, చివరకు ఎలా అరికట్టాలో తెలియని నిస్సహాయ స్థితిలోకి వెళుతున్నామా అన్న అనుమానం కలుగుతుంది. నకిలీ నోట్లు పోతాయని కూడా అన్నారు. అది ఎంతవరకు ఆగిందో తెలియదు కాని 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు అయి రెండువేల రూపాయల నోట్లను విడుదల చేశాక, వరంగల్ లోనే ఒకరు నకిలీ నోట్లు తయారుచేస్తూ పట్టుబడ్డారట. ఇక డిజిటల్ గ్రామాలు అంటూ పెద్ద ఎత్తున హడావుడిచేసినా, ఇప్పుడు ఆ గ్రామాలలో డబ్బే పెద్ద ఎత్తున చలామణి అవుతోందని ఆయా మీడియా లలో కధనాలు వస్తున్నాయి.

ఏతా వాతా ఆ రెండు, మూడు నెలలు సామాన్యులు మాత్రం డబ్బుకోసం ఎటిఎమ్ లు, బ్యాకుల చుట్టూ తిరగలేక నానా పాట్లు పడ్డారు.వంద మందికి పైగా క్యూలలో నిలబడి మరణించారని విపక్షాలు లెక్కలు చెబుతుంటాయి.ఈ విషయంలో మోడీ చిత్తశుద్దిని ఎవరూ పెద్దగా శంకించలేదు. కాకపోతే ఆయన ఆర్ధిక వేత్త కాకపోవడం, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఇవి జరగుతున్నాయనిపిస్తుంది. బిజెపి ఎమ్.పి శత్రుఘ్న సిన్హా అన్నట్లు మోడీ ఒన్ మాన్ షో చేస్తుంటే, బిజెపి మోడీ, షాల టు మెన్ ఆర్మిగా కనిపిస్తోందన్న అబిప్రాయం కలుగుతుంది.

ఇది తాత్కాలికంగా బిజెపికి ఉపయోగం కలగవచ్చేమో కాని, దీర్ఘకాలంలో నష్టం చేసే అవకాశం ఉంది. ఇవన్ని ఎందుకు నోట్ల రద్దు వ్యవహారంలో ఇంతవరకు మోడీ సరైన వివరణ ఇవ్వలేకపోయారు.ఆర్బిఐ రద్దు అయిన నోట్లలో 99శాతం బ్యాంకులలో చేరాయని ప్రకటించడంతో కేంద్రం పూర్తిగా ఇరకాటంలో పడింది. దాంతో కొత్త పల్లవి అందుకున్నారు. బ్యాంకులోకి వచ్చిన డబ్బు ప్రజలకుఉపయోగపడుతుందని కొన్నాళ్లు చెప్పారు. కాని అది అయ్యేది కాదని తెలిసిన తర్వాత బ్యాంకులకు ఎదురు రెండు లక్షల కోట్లు ఇస్తామని కేంద్రంప్రకటించవలసి వచ్చింది.

నాలుగు లక్షల కోట్ల నల్లధనం తమకు వచ్చి పడుతుందని, దానిని తాము వివిధ పకాలకు ఖర్చు చేస్తామని చెప్పినకేంద్రం కొత్తనోట్ల ముద్రణకు, డిజిటల్ ప్రచారానికి ఇతరత్రా వేల కోట్ల వ్యయం చేయవలసి వచ్చింది. నోట్ల రద్దును ప్రణాళికబద్దంగా చేసి ఉంటే మోడీకి మంచి పేరు వచ్చేది. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపేణా కూడా డబ్బుపెద్ద ఎత్తున సమకూఏరది.ఇంతకుముందు ఉన్న స్వచ్చంద వెల్లడి పధకకాని కొనసాగించి, నిర్దిష్ట శాతాలతో పన్ను రేట్లు పెట్టి, అంతా డబ్బులు బ్యాంకులలో జమ చేసుకోవాలని కేంద్రం చెప్పి ఉంటే అన్ని విధాలుగాఉపయోగం ఉండేది. 

నోట్ల రద్దు విఫలం కాలేదని, బిజెపి, పూర్తిగా విఫలం అయిందని విపక్షం వాదించుకుంటున్నాయి. ఈ ఏడాది మొదట్లో వివిధ సభలలో మోడీ, షాలు ప్రసంగించేటప్పుడు ఏభై నాలుగు సార్లు నోట్ల రద్దు గురించి ప్రస్తావిస్తే, ఈ ఆగస్టు తర్వాత ఇంతవరకు కేవలం ఐదుసార్లే వారు ఈ అంశం గురించి మాట్లాడారట. దీనిని బట్టే నోట్ల రద్దు విఫలమా? సఫలమా అన్నది అర్దం కావడం లేదూ! మోడీగారు చెప్పినట్లు 125కోట్ల మంది ప్రజలు ఈ నోట్ల రద్దును సమర్ధిస్తున్నారని అనుకోవచ్చా!