Advertisement


Home > Politics - Gossip
40 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. 'దమ్ము' ఇంతేనా.!

'నరేంద్రమోడీ ప్రభుత్వంపై మేమే అవిశ్వాస తీర్మానం పెట్టాం.. దేశంలోని బీజేపీయేతర రాజకీయ పార్టీల్ని ఒక్కతాటిపైకి తెచ్చాం..' అంటూ ఘనంగా చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ, అవిశ్వాస తీర్మానం వేళ ఎంత గొప్పగా చతికిల పడిందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇచ్చారో, ఆ ఎంపీ.. అదేనండీ, కేశినేని నాని.. ప్రధాని నరేంద్రమోడీ మీద ఉపయోగించిన పదజాలం ఎంత హాస్యాస్పదమయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడలేకపోయారంటే, అంతకు ముందు బెంగళూరులో కుమారస్వామి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు 'కరచాలనం, కౌగలింత' ఎపిసోడ్‌కి అర్థమేముంది.? కాంగ్రెస్‌తో టీడీపీ అంటకాగుతోందన్నది నిర్వివాదాంశం. అయితే, ఇక్కడ కాంగ్రెస్‌, తన అవసరార్థం, టీడీపీకి కొన్ని విషయాల్లో మద్దతిస్తోందంతే. అంతకుమించి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో టీడీపీని, కాంగ్రెస్‌ 'ఎంటర్‌టైన్‌' చేసే పరిస్థితిలేదు.

తాజాగా, రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌ ఎంపిక విషయంలో టీడీపీకి కాంగ్రెస్‌ పెద్ద షాకే ఇచ్చింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించుదామని చెప్పి, తృణమూల్‌ నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తామని లీకులు ఇచ్చి.. చివరికి కాంగ్రెస్‌ పార్టీనే సొంత అభ్యర్థిని నిలబెట్టింది. టీడీపీ సహా, ఇతర రాజకీయ పార్టీలకు (బీజేపీయేతర) ఇంకో ఆప్షన్‌ లేకుండాపోయింది. ఇక్కడ, వైసీపీ తెలివిగా గేమ్‌ ఛేంజ్‌ చేసింది. టీడీపీ తనమాటని వెనక్కి తీసుకోలేకపోయింది. 40ఏళ్ళ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే చంద్రబాబు, పరిస్థితిని ముందే అంచనా వేయలేకపోవడం హాస్యాస్పదం.

ఆరుగురు సభ్యులున్న టీఆర్‌ఎస్‌, ముందుగానే బీజేపీకి మద్దతు పలికేసింది. జాతీయ స్థాయిలో బీజేపీ - టీఆర్‌ఎస్‌ మధ్య 'అండర్‌స్టాండింగ్‌' వుంది. అదెంత గొప్ప అండర్‌స్టాండింగ్‌ అంటే, తెలంగాణలో బీజేపీ నేతల ఆలోచనలకు భిన్నంగా, తెలంగాణలో బీజేపీని పణంగా పెట్టేలా.. బీజేపీ జాతీయ నాయకత్వం వ్యవహరిస్తోంది. ఇక్కడ బీజేపీకి, టీఆర్‌ఎస్‌తో అవసరం వుంది. అదే సమయంలో, టీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి 'ఏదో' ఆశిస్తోందని అర్థం చేసుకోవాలేమో.

2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. నిన్న మొన్నటిదాకా మిత్రపక్షాలుగా మెలిగాయి. కానీ, కేసీఆర్‌లో నరేంద్రమోడీకి కన్పించిన మెచ్యూరిటీ, చంద్రబాబులో కన్పించకపోవడమే ఆశ్చర్యకరం. మోడీ అవసరార్ధమే కేసీఆర్‌ని పొగిడినా, చంద్రబాబు అసమర్థతని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. సాటి తెలుగు రాష్ట్రం నుంచి చంద్రబాబు, ప్రత్యేకహోదా విషయమై మద్దతు కూడగట్టలేకపోవడమే చంద్రబాబు అసమర్థతకి నిలువెత్తు నిదర్శనం. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక విషయంలో అయినా చంద్రబాబు, విపక్షాల తరఫున టీఆర్‌ఎస్‌ని ఒప్పించి వుంటే, ఈక్వేషన్‌ ఇంకోలా వుండేదేమో.!

2019లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలని చంద్రబాబు ఆలోచిస్తోంటే.. అంతకన్నా రాజకీయ దిగజారుడుతనం ఇంకోటుండదు.. తెలుగుదేశం పార్టీకి అది ‘ఆత్మహత్య’ లాంటిదే. చంద్రబాబు సైతం తన రాజకీయ జీవితానికి తనంతట తానే చరమగీతం పాడుకున్నట్లవుతుంది. కానీ, తప్పదేమో.. చంద్రబాబుకి ఇంకో ఆప్షన్ కన్పించడంలేదు. 40 ఇయర్స్ రాజకీయంలో.. ఇంతటి దయనీయ స్థితి చంద్రబాబుకి ఇంతకుముందెన్నడూ రాలేదని అనుకోవాల్సి వుంటుంది.