cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆ మూడు లోక్‌సభ స్థానాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌!

ఆ మూడు లోక్‌సభ స్థానాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌!

సాధారణంగా రాయలసీమ ప్రాంతంలో క్రాస్‌ ఓటింగ్‌ రాజకీయాలు ఉండవు! తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశం గురించి అక్కడి ప్రజలు ఫుల్‌క్లారిటీతో ఉంటారు. ఒక ఓటు ఒకవైపుకు మరోఓటు మరోవైపుకు వేసే సందర్భాలు బాగా తక్కువ. తాము ఏ పార్టీకి అండగా ఉండాలని అనుకుంటే.. అదే పార్టీకి అతుక్కుపోతారు. క్రాస్‌ ఓటింగ్‌ రాజకీయాలు అక్కడి జనాలకు పెద్దగా తెలియవు కూడా!

అలాంటి రాయలసీమలో ఈసారి మాత్రం పరిస్థితిలో చాలామార్పు కనిపిస్తూ ఉంది. ఎవరిని ముంచుతుందో అనేది ఎవరికివారు డిసైడ్‌ చేసుకోవాలి కానీ.. సీమలో ఈసారి భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా కేవలం మూడు ఎంపీ సీట్ల విషయంలో మాత్రమే క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. మిగతా నియోజకవర్గాల విషయంలో పాత రాజకీయమే పునరావృతం కాగా.. మూడు సీట్లలో క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. అవేవంటే..

హిందూపురంలో.. తెలుగుదేశానికి పోటు?
టికెట్ల పంపిణీలో జగన్‌ తీసుకున్న కొన్ని ఆసక్తిదాయకమైన నిర్ణయాల్లో హిందూపురం ఎంపీ క్యాండిడేట్‌ను ఖరారు చేయడం ఒకటి. అక్కడ నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని భావించిన జగన్‌మోహన్‌ రెడ్డి అనూహ్యంగా గోరంట్ల మాధవ్‌ను అభ్యర్థిగా దించారు. సీఐగా పనిచేస్తున్న ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకుని మరీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. కురుబ సామాజికవర్గానికి చెందిన మాధవ్‌ వాస్తవానికి కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే చదువులు, ఉద్యోగం, పెళ్లి అంతా అనంతపురం జిల్లాలోనేనట. ఇక అప్పటికే పోలీసాఫీసర్‌గా తరచూ జిల్లా స్పెషల్‌ వార్తల్లో కనిపిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. పోలీసుగా ఫేమ్‌ పొందాడు. మరి పోలీసులు రాజకీయాల్లోకి వస్తే సక్సెస్‌ అవుతారా? అనేది ఒక సందేహమే. ఆ సందేహాన్ని ఎన్నికల ఫలితాలే తీర్చాలి.

అయితే భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని మాత్రం చెప్పవచ్చు. ప్రత్యేకించి తెలుగుదేశంకు మాధవ్‌ భారీగా చిల్లుపెట్టారు అని అంచనా. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కులాల వారీగా జనాభాను తీసుకుంటే.. బీసీలే ఎక్కువ. బీసీల్లో కురుబ, బోయ, నేత సామాజికవర్గాలు గణనీయంగా ఉన్నాయి. వీరితోపాటు రెడ్డి ఓటు బ్యాంకు ఉంటుంది. ఇన్నేళ్ల రాజకీయంలో మెజారిటీ బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుచూపారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. 2004లో టీడీపీ వ్యతిరేక గాలిలో మాత్రమే ఈ స్థానంలో ఆ పార్టీ ఓడింది. మళ్లీ ఓడలేదు. అయితే ఈసారి జగన్‌ వ్యూహాత్మకంగా కురుబ సామాజికవర్గం అభ్యర్థికి టికెట్‌ కేటాయించారు. దీంతో తెలుగుదేశానికి పడే ఆ సామాజికవర్గం ఓట్లలో భారీగా చీలిక కనిపిస్తూ ఉంది.

టీడీపీకే అంకితం అనదగ్గ ప్రతి వంద ఓట్లలోనూ కనీసం యాభై ఓట్లు ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పడి ఉండవచ్చు అని అంచనా. తమ సామాజికవర్గానికి చెందినవ్యక్తి పోటీలో ఉండటంతో.. తెలుగుదేశానికే అంకితమైన కురుబల్లో చాలావరకూ మార్పు వచ్చిందని స్పష్టం అవుతోంది. ఇది తెలుగుదేశం పార్టీకి ముప్పుతిప్పలు పెట్టే అంశంగా మారింది. ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత, హిందూపురం ఎంపీగా ఉండిన నిమ్మలకిష్టప్ప ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండటం వంటి కారణాలకు తోడు, జగన్‌ వేవ్‌లో కురుబల ఓట్లు కూడా ఇలా అభ్యర్థి వల్ల వైఎస్సార్సీపీ వైపు బదిలీ కావడంతో కంచుకోట లాంటి ఆ సీటు విషయంలో టీడీపీ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

అనంతపురంలోనూ అదే పరిస్థితి!
హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి ట్రెడిషనల్‌గా అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన కురుబల ఓట్లు చీలితే.. అనంతపురం ఎంపీ సీటు పరిధిలో తెలుగుదేశానికే అంకితం అయిన బోయల విషయంలో తేడా వచ్చిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. అనంతపురం ఎంపీ సీటు పరిధిలో బోయల జనాభా గణనీయంగా ఉంటుంది. ప్రత్యేకించి రాయదుర్గం, కల్యాణదుర్గం వంటి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వారి జనాభా భారీగా ఉంటుంది. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనూ ఫర్వాలేదనిపించే స్థాయిలో బోయల జనాభా ఉంది. అనంతపురం ఎంపీ సీటు నుంచి ఇదివరకూ బోయ సామాజికవర్గానికే చెందిన కాలువ శ్రీనివాసులు కూడా నెగ్గారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఒకసారి నెగ్గారు. సామాజికవర్గం పరంగా వారి సంఖ్య అలా కాలువకు కూడా కలిసి వచ్చిందప్పుడు.

ఈసారి అదే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సీట్లో తలారి రంగయ్యను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీలో పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో బోయల్లో భారీ మార్పు వచ్చిందని.. తెలుగుదేశం పార్టీకే అంకితం అయిపోయిన వారిలో చాలామంది ఓటింగ్‌ నాటికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గారనే అంచనాలున్నాయి. తమ సామాజికవర్గానికి చెందినవ్యక్తి ఎంపీ కావడాన్ని బోయలు ఆహ్వానించారని, తెలుగుదేశం పార్టీ ఎలాగూ బోయలకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి.. బరిలో నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి అది కలిసివచ్చే పరిణామం అని విశ్లేషకులు చెబుతున్నారు.

కురుబలు, బోయలు.. స్థూలంగా తెలుగుదేశం పార్టీ సొత్తు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. పోల్‌ అయ్యే నూటికి ఎనభై ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడేవి ఈ సామాజికవర్గాల నుంచి. అయితే ఈసారి ఈ ఓట్లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశంతో పంచుకుందని, తన ట్రెడిషనల్‌ ఓటు బ్యాంకుకు తోడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, బోయలు- కురుబల మద్ధతు అధికంగా లభించిందని, ఎంపీ అభ్యర్థులు ఆ సామాజికవర్గం వాళ్లు కావడంతో.. ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఆ కులాల ఓట్లు కొద్దోగొప్పో పడ్డాయని క్షేత్రస్థాయి పరిశీలకులు చెబుతూ ఉన్నారు. క్రాస్‌ ఓటింగ్‌ అయితే భారీగా జరిగిందని.. ఫలితంగా ఈ సీట్లలో సంచలన ఫలితాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు!

కర్నూలు లోక్‌సభ సీట్లోనూ అదే పరిస్థితి?
కర్నూలు ఎంపీ సీటు ఎన్నికలోనూ ఓట్లు అటూ ఇటూ అయ్యాయనే అంచనాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు కొంతవరకూ తెలుగుదేశం వైపు మళ్లిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అది పరిమిత స్థాయిలోనే కావడం గమనార్హం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు ఎంపీ టికెట్‌ను చేనేత సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చింది. అలా ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకుంది. ఇక ఎలాగూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కర్నూలు ఎంపీ సీటు పరిధిలో ట్రెడిషనల్‌ ఓటు బ్యాంకు ఉండనే ఉంది. దీంతో ఆ సీట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరేస్తుందనే అంచనాలున్నాయి.

అయితే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రెడిషినల్‌ ఓటు బ్యాంకు కొద్దోగొప్పో కోట్ల వైపు మొగ్గుచూపిందనే అంచనాలున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే వేసి, ఎంపీ ఓటు కోట్లకు వేసిన వారున్నారని అంటున్నారు. ప్రత్యేకించి పత్తికొండ, డోన్‌ వంటి సెగ్మెంట్లలో ఈ పరిస్థితి ఉందంటున్నారు. అయితే అది పెద్ద ప్రభావం ఏమీలేదని, కోట్లకు సొంతగుంపు ఉందని, దాంట్లోనే ఆయన టీడీపీలోకి వెళ్లడంపై అసంతృప్తి పెరిగి చీలిక వచ్చిందని.. అలాంటిది ఆయన కోసం ట్రెడిషినల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు కొంతవెళ్లినా ఆ ప్రభావం మరీ ఫలితాన్ని మార్చేసేది కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరి ఆసక్తి రేపుతున్న ఈ క్రాస్‌ ఓటింగ్‌ వ్యవహారాల కథ పలితాలు వచ్చాకా చేపట్టే విశ్లేషణల్లో కానీ తెలియదు!

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి