Advertisement


Home > Politics - Gossip
‘ఆ నలుగురు’ కొద్దిగా గెలిచారు!

సుప్రీం కోర్టు వ్యవహారాల మీద తిరుగుబాటు స్వరం వినిపించి.. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నంగా.. అక్కడి పరిపాలన, నిర్వహణలోని లోపాలను బయటపెట్టి సంచలనం సృష్టినంచిన నలుగురు సుప్రీం న్యాయమూర్తులు పాక్షికంగా చిన్న విజయం సాధించారు. న్యాయవ్యవస్థలోనే ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పద వ్యవహారంగా తయారైన జస్టిస్ లోయా మృతి కేసు విచారణ నుంచి సుప్రీం న్యాయమూర్తి అరుణ్ మిశ్రాను తప్పించడానికి వారు కారణభూతులయ్యారు. 

కేంద్రం ప్రభుత్వంతోను, భాజపా, మరియు నరేంద్రమోడీతోను ఎంతకాలం ముందునుంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి అయిన అరుణ్ మిశ్రా చేతికి.. జస్టిస్ లోయా మృతి కేసును అప్పగించడంలోని ఔచిత్యాన్ని ‘ఆ నలుగురు’ ప్రశ్నించారు. దాంతో తాజాగా ఆయనను పక్కకు తప్పించడం గమనార్హం.

జస్టిస్ లోయా మృతి కేసు విచారణ అనేది దేశంలో కేవలం న్యాయవ్యవస్థకు సంబంధించినది మాత్రమే కాదు.. రాజకీయ వ్యవస్థ పునాదులను కూడా పెళ్లగించగల వ్యవహారాలు ఇందులో ఉన్నాయనేది చాలా మంది సందేహిస్తున్న విషయం. జస్టిస్ లోయా అంటే సోహ్రాబుద్దీన్ హత్య కేసును విచారించిన న్యాయమూర్తి.

తీర్పు వెలువరించడానికి నాలుగురోజుల ముందు ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ కేసును భాజపాతో సంబంధాలు ఉన్న అరుణ్ మిశ్రా కు అప్పగించడం ఏ రకంగా సబబు అంటూ ‘ఆ నలుగురు’ న్యాయమూర్తులు ఇటీవలి ప్రెస మీట్ లో ప్రశ్నించారు.

మొత్తానికి సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యవహారంలో మార్పువచ్చినట్లుంది. లోయా మృతికేసు విచారణకు తాజాగా ముగ్గురు న్యాయమూర్తులతో ఓ బెంచ్ ను ఏర్పాటుచేశారు. అందులోంచి అరుణ్ మిశ్రాను తప్పించారు. ఆ బెంచ్ కు స్వయంగా చీఫ్ జస్టిసే సారథ్యం వహిస్తారు. అరుణ్ మిశ్రాను తప్పించడం వరకు ‘ఆ నలుగురు’ సాధించిన విజయమే కానీ.. వారిలో ఒకరికి కొత్త బెంచ్ లో స్థానం కల్పించి ఉంటే.. పూర్తి పారదర్శకంగా ఉండేదనే అభిప్రాయాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.