cloudfront

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్ కోరిక ఖరీదు 3000 కోట్లు!

కేసీఆర్ కోరిక ఖరీదు 3000 కోట్లు!

తెలంగాణలో ఇప్పుడంతా.. ఎన్నికల రంధిలో పడిపోయారు! ఎవరికి వారు ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడం ఎలాగనే వ్యూహరచనలోనే నిమగ్నమై ఉన్నారు. అయితే ఇంతకూ కేసీఆర్ ఏడు నెలల ముందుగానే ఎందుకు ముందస్తు ఎన్నికలను తీసుకువచ్చినట్లు? ఇదికాస్త లోతుగా ఆలోచించినప్పుడు మనలో తలెత్తే ప్రశ్న.

అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత.. ప్రెస్ మీట్ లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అధికారికంగా ప్రకటించిన మాటలను బట్టి.. ‘‘తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. అయితే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ... ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వారిదెబ్బకు తెలంగాణలో అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే.. మరింత సుస్థిరంగా ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. అందుకే మా ప్రభుత్వం దివ్యంగా పనిచేస్తున్నప్పటికీ, మాకు అనన్యమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ.. ఏడునెలల ముందుగానే ఎన్నికలకు సిద్ధపడుతున్నాం’’ అని మనం తెలుసుకున్నాం.

కేవలం అభివృద్ధి ఆగిపోతుందనే ఆవేదనతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారంటే నమ్మేంత వెర్రివాళ్లెవ్వరూ తెలంగాణలో లేరు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కేంద్రంలోని భాజపాతో ఓ తెరవెనుక అవగాహన గానీ, కేసీఆర్ స్వయంగా జాతీయ రాజకీయాలకు వెళ్లాలనే అభిలాష గానీ.. ఇతరత్రా హిడెన్ అజెండా అంశాలు గానీ ఉన్నాయనే ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ చెప్పిందే నిజం అనుకున్నా కూడా.. అభివృద్ధి ఆగకుండా ఉండేందుకు ముందుగా వస్తున్న ఈ ఎన్నికలకు అనవసరంగా అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా.. అక్షరాలా (సుమారు) మూడువేల కోట్ల రూపాయలు!

నిజానికి ముందస్తు ప్రతిపాదనను గతంలో ఈసీ వ్యతిరేకించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో డెక్కన్ క్రానికల్ లో ప్రచురించిన ఓ కథనాన్ని బట్టి.. ముందస్తు వలన మూడువేలకోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుంది గనుక.. వద్దని ఈసీ చెప్పినట్లు అప్పట్లో అనుకున్నారు. అంటే.. కేసీఆర్ ప్రభుత్వ ఖజానా మీద ఇంత భారం మోపి మరీ.. తన ముందస్తు ముచ్చట తీర్చుకుంటున్నారన్నమాట. కేవలం ఆయన సొంత ఎజెండా కోసం ఇంత భారీ మొత్తాన్ని తగలేస్తున్నారనే వాస్తవం ప్రజలకు కడుపు మండుతుంది కదా?