అదృష్ట వంతుడు..అవకాశవాది-చంద్రబాబు

రాజకీయాల్లో ఎదగాలంటే కష్టం మాత్రమే సరిపోదు. అదృష్టం కలిసిరావాలి. అలాగే ఎప్పుడు పట్టుకోవాలో, ఎప్పుడు వదిలేయాలో తెలిసి వుండాలి. దాన్ని అవకాశవాదం అంటే అనుకోవచ్చు. ఈ రెండు విషయాలు పెనవేసుకున్న రాజకీయ వేత్త నారా…

రాజకీయాల్లో ఎదగాలంటే కష్టం మాత్రమే సరిపోదు. అదృష్టం కలిసిరావాలి. అలాగే ఎప్పుడు పట్టుకోవాలో, ఎప్పుడు వదిలేయాలో తెలిసి వుండాలి. దాన్ని అవకాశవాదం అంటే అనుకోవచ్చు. ఈ రెండు విషయాలు పెనవేసుకున్న రాజకీయ వేత్త నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఆయన చాలా అదృష్ట వంతుడు. చిన్న వయసులో మంత్రి పదవి వరించింది. అదృష్టం కాదా? అప్పటికి ఆయన పడిపోయిన కష్టం అంతగా ఏమీ లేదు. అది తొలి అదృష్టం. 

పిల్లనిచ్చిన మామగారే స్వంతగా పార్టీ పెట్టారు. అందరికీ ఆ అదృష్టం దొరుకుతుందా? కాంగ్రెస్ పార్టీలో వుంటూ ఓటమి పాలు కాగానే మామగారి పార్టీలో చేరి పగ్గాలు అందిపుచ్చుకున్నారు. అల్లుడి సామర్థ్యం తెలుసు కనుక పగ్గాలు అందించారు. అదీ అదృష్టమే.అక్కడి నుంచి నికార్సయిన కష్టం పడడం ప్రారంభించారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే వుంటే పార్టీ చంద్రబాబు చేతికి అంత త్వరగా వచ్చి వుండేది కాదు. మళ్లీ అదృష్టం లక్ష్మీపార్వతి రూపంలో వచ్చింది. పార్టీ లాక్కోవడానికి కారణం దొరికింది.

తిరుపతిలో నక్సల్స్ పేల్చిన మందుపాతర నుంచి బతికి బయటపడడం అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? చంద్రబాబు జీవితంలో అతి పెద్ద అదృష్టం అది. ఆ తరువాత వైఎస్ గద్దె నెక్కారు. మొదటి సారి సరే, రెండోసారి వైఎస్ వచ్చాక ఇక తెలుగుదేశం పరిస్థితి అంతే అనుకున్నారు అంతా. కానీ వైఎస్ ను దురదృష్టం వెంటాడింది. భగవంతుడు తీసుకుపోయాడు. తెలంగాణ విభజన వచ్చింది. జనం అనుభవం వున్న చంద్రబాబు కావాలనుకున్నారు. మళ్లీ అదృష్టం వరించింది.

ఇలా అన్ని సార్లు అదృష్టం కలిసి వచ్చిన రాజకీయ నాయకులు అరుదుగా వుంటారు.

ఇక చంద్రబాబు అవకాశ వాదం సంగతి చూద్దాం.

చిన్న వయసులో మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఓడిపోగానే, ఇక ఆ పార్టీ అక్కరలేదు అని చటుక్కున కాంగ్రెస్ లోకి జంప్ చేసారు.

పిల్లనిచ్చిన మామ, ఆయన స్వంత పార్టీ. దాన్ని తాను కాపాడాల్సిన తరుణం అంటూ తాను తీసేసుకుని మామను పార్టీ నుంచి బయటకు నెట్టారు.

హెరిటేజ్ లో బాలయ్య, మోహన్ బాబు కూడా భాగస్వాములు అంటారు అప్పటి విషయాలు తెలిసినవారు. కానీ హెరిటేజ్ నిలదొక్కుకున్నాక ఏమయిందో మరి మోహన్ బాబు పక్కకు వెళ్లిపోయారు. అలాగే బాలయ్య ఆ మధ్యన తనంతట తానే తన షేర్లు అన్నీ చంద్రబాబు మనవడైన తన మనుమడికి రాసి ఇచ్చేసారు. మరో మనవడు వున్నా ఇవ్వలేదు. ఆ విధంగా హెరిటేజ్ బాబుగారి సింగిల్ హ్యాండ్ కిందకు వచ్చింది.

భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. గెలిచారు. అంతా అయింది. తరువాత దాన్ని కాదు పొమ్మన్నారు. ఠాట్ మోడీ అన్నారు. కానీ ఉత్తరోత్తరా మళ్లీ భాజపానే కావాలనుకున్నారు. ఆపై మళ్లీ ఠాట్ మోడీ అన్నారు.

భాజపా తో బంధాలు లేనపుడల్లా కమ్యూనిస్టులను దగ్గరకు తీసారు. అవసరం లేనపుడల్లా దూరం పెట్టారు. అవసరం అయినపుడు కేసిఆర్ ను ఆయన పార్టీని దగ్గరకు తీసుకున్నారు. కానీ మళ్లీ ఆ పార్టీతో కస్సు బుస్సు లాడారు. అంతెందుకు కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడిని తెలుగుదేశం అధినేతగా వుంటూ, ఆ కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుకు సై అన్నారు. 

కేంద్ర కిరసనాయలు కోటా తగ్గించడానికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తే, దాన్ని దీపం పథకం కింద, ఎన్నికల హామీకింద వాడుకుని తన అవకాశ వినియోగ చాతుర్యం చూపించినది ఆయనే. ఇలాంటి చిన్న చిన్న అవకాశ వినియోగ సంఘటనలు చాలా అంటే చాలా వున్నాయి.

ఉపేంద్ర, జయప్రద, రేణుక చౌదరి ఇలా చాలా అంటే చాలా మంది నాయకులను మెలమెల్లగా వదిలించుకోవడం చంద్రబాబు యూజ్ అండ్ థ్రో పాలసీకి నిదర్శనం అంటారు రాజకీయ పరిశీలకులు. అంతెందుకు 2019 ఎన్నికల వేళ మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడాని కిందా మీదా అయిపోయారు.

ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ లో ఎన్నికలు జరుగుతుంటే మోడీ వ్యతిరేక పక్షాలకు కనీసపు నైతిక మద్దతు కూడా ప్రకటించడం లేదు. ఇదంతా మళ్లీ మోడీ చెంతన చేరాలనే అవకాశ వాదం కాక మరేమిటి?

ఇలా వరిస్తున్న అదృష్టానికి అనుగుణంగా తన అవకాశవాద తెలివితేటలు వాడుకుంటూ ఎదిగిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఆయన పుట్టిన రోజు ఈ రోజు…హ్యపీ బర్త్ డే సిబిఎన్ గారూ.