Advertisement


Home > Politics - Gossip
అలర్ట్ పవన్! ఇక ఎదురుదాడి చేస్తారట!!

ఇన్నాళ్లూ బేరాలాడుతూ ఉండిపోయారో ఏమోమరి.. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం పట్ల.. పవన్ కల్యాణ్ నాలుగు నెలలుగా గట్టి ప్రతిపక్ష పాత్రనే పోషిస్తూ వచ్చినప్పటికీ.. ఆయన విమర్శల పట్ల చాలా మొహమాటంగా స్పందిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ.. ఇక ఈ ఉపేక్ష ధోరణిని విడనాడుతుందట. తాము మౌనంగా ఉండే కొద్దీ.. పవన్ కల్యాణ్ దయాభిక్ష కోసం తాము ఎదురుచూస్తున్నట్లుగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుందన్న భయంతో..  చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఏ తరహా విమర్శలతో విరుచుకుపడుతున్నామో.. అదే స్థాయిలో పవన్ మాటల్లోని లోపాలు, ఆయన తీరు, ఇతర వ్యవహారాలపై విమర్శల దాడులతో ఉక్కిరిబిక్కిరి చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందట. ఆ మేరకు పార్టీ నాయకులందరికీ అధిష్టానం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయిట. ‘‘పవన్ మనకిక బద్ధ శత్రువే, ఆయన విమర్శల పట్ల ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. తీవ్రంగా తిప్పికొట్టాల్సిందే’’ అని తెలుగుదేశం అధిష్టానం మార్గదర్శనం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇన్నాళ్లూ ఏదో తాము చూసీచూడనట్లు పోయాం అని బిల్డప్ ఇవ్వడానికి ఈ రకంగా మాటలు వండుతున్నట్లు ఉన్నదే తప్ప.. ఇన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు ఉపేక్షించిందేమీ లేదు. పవన్ కల్యాణ్ మీద ఎలాంటి విమర్శలు చేయగలరో అన్ని విమర్శలూ చేస్తూనే ఉన్నారు. సాక్షాత్తూ చంద్రబాబు, లోకేష్ లు కూడా పవన్ కల్యాణ్ వెటకారం చేస్తూ వ్యాఖ్యలు చేయడం, ఆయన రిటార్టులకు బలికావడం జరుగుతూనే ఉంది.

పవన్ కల్యాణ్ కేంద్రంలోని భాజపాతో కుమ్మక్కు అయ్యాడని, కేంద్రాన్నేమీ అనకుండా.. అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ఆడిపోసుకుంటున్నాడని అనేక విమర్శలు చేస్తూనే ఉన్నారు. పవన్ జేఎఫ్‌సీ గురించి కూడా విమర్శిస్తూనే ఉన్నారు. పవన్ మీద ఆయన సామాజిక వర్గానికే చెందిన మంత్రుల ద్వారా విమర్శలు చేయించడం లాంటి వ్యూహాలను కూడా తెలుగుదేశం చాలాకాలం ముందునుంచే అమల్లో పెట్టింది.

కాకపోతే.. పవన్ చేస్తున్న మాటలదాడి వలన వారిలో చురుకుపుట్టే కొద్దీ.. ఉన్నవీ లేనివీ కలిపి ఎదురుదాడి చేయడానికి తగ్గట్లుగా... ఇప్పుడే విమర్శలను తిప్పికొట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.