cloudfront

Advertisement


Home > Politics - Gossip

జనసేనలోకి సినీనటుడు ఆలీ!

జనసేనలోకి సినీనటుడు ఆలీ!

ప్రముఖ కమెడియన్ ఆలీ జనసేన పార్టీలో చేరబోతున్నారా? తాజా పరిణామాలు గమనిస్తోంటే అవుననే అనిపిస్తోంది. జనసేన పార్టీ కార్యక్రమంగా నెల్లూరుజిల్లా బారా షహీద్ దర్గా వద్ద ప్రార్థనలు చేసి, రొట్టెలు విడవడానికి పవన్ కల్యాణ్ వెళ్తోంటే.. ఆయన వెంబడి ఆలీ కూడా అక్కడకు వెళ్తుండడం.. ఆయనతో పాటు పాల్గొనడం అనే పరిణామాలను గమనిస్తోంటే ఆలీ జనసేనలో చేరడం త్వరలోనే జరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

నిజానికి కమెడియన్ ఆలీకి ఎప్పటినుంచో రాజకీయ ఆసక్తి ఉంది. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికలబరిలోకి వస్తారనే ప్రచారం కూడా విస్తృతంగానే జరిగింది. 2014 ఎన్నికల సమయంలోనే ఆలీ, తెలుగుదేశం పార్టీ తరఫున.. రాజమండ్రి నుంచి గానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గానీ ఎన్నికల్లో పోటీచేస్తారని ముమ్మరంగా పుకార్లు వచ్చాయి. ఆ సందర్భంలోనే.. ఓసారి ఆలీ మీడియాతో మాట్లాడుతూ.. సినీరంగంలో తనకు బాగా మిత్రుడైన పవన్ కల్యాణ్ పార్టీ పెడితే తాను కూడా అందులో చేరుతానని ప్రకటించారు కూడా.

అప్పట్లోనే పవన్ కల్యాణ్ పార్టీపెట్టినప్పటికీ.. మొన్న మొన్నటిదాకా దానిని క్రియాశీలంగా నిర్వహించలేదు. గత కొన్నినెలలుగా మాత్రమే పార్టీని యాక్టివేట్ చేసి.. ముమ్మరంగా పార్టీని నడుపుతున్నారు. ఇప్పడు పవన్ కల్యాణ్ తో కలిసి ఆలీ నెల్లూరు యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆలీ రాజకీయ రంగ ప్రవేశంపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఆయన రాబోయే ఎన్నికల్లో జనసేన తరఫున ఖచ్చితంగా పోటీలో ఉంటారని అనుకుంటున్నారు.