Advertisement


Home > Politics - Gossip
కార్యక్షేత్రం.. కురుక్షేత్రం...!

'ధర్మక్షేత్రం...ఇది కురుక్షేత్రం..కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం'...అనే కురుక్షేత్రం సినిమాలోని పాట ప్రస్తుత ఏపీ రాజకీయాలకు సరిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినా రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు చేయవచ్చని, పార్టీలను  విజయవంతంగా నడపవచ్చని అధినేతలు అనుకున్నారు. ఆనాడు ఒక్క సీపీఎం మినహా టీడీపీ, వైకాపా సహా అన్ని పార్టీలూ విభజనకు అభ్యంతరం లేదని లేఖలు ఇచ్చాయి.

విభజన జరిగిపోయాక రెండు రాష్ట్రాల్లో రాజకీయం కుదరదని అర్థమైంది. అందుకే టీడీపీ, వైకాపా, విభజన తర్వాత పుట్టిన జనసేన ఆంధ్రప్రదేశ్‌నే తమ ప్రధాన కార్యక్షేత్రంగా మార్చుకున్నాయి. అధికారంలోకి వస్తే గిస్తే అక్కడే రావాలి. ఈ మూడు పార్టీలకు కురుక్షేత్రం ఆంధ్రాయే కాబట్టి యుద్ధం అక్కడే చేయాలి. కాంగ్రెసు, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు జాతీయ పార్టీలు కాబట్టి వాటి రాజకీయాలు రెండు రాష్ట్రాల్లోనూ నడుస్తుంటాయి.

ప్రస్తుత రాజకీయాల్లో ఏపీలో ఈ మూడు జాతీయ పార్టీల్లో ఏదీ అధికారంలోకి రాలేదు కాబట్టి వాటిగురించి పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షాలైన వైకాపా. జనసేన పార్టీల ప్రధాన కార్యక్షేత్రమే కాదు, పర్మినెంటు రాజకీయ కేంద్రం కూడా ఆంధ్రాయే కాబట్టి అధినేతలు అనివార్యంగా తరలిరావల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటివరకు ఈ పార్టీల అధినేతలు హైదరాబాదులో ఉంటూ ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనను ఆంధ్రాకు తరలించారు కాబట్టి అమరావతిలో ప్రభుత్వ నివాసం ఉంది. సొంత ఇల్లు నిర్మించుకుంటారని నేతలు చెబుతున్నారు.  కొంతకాలం క్రితం హైదరాబాదులో పాత నివాసాన్ని కూలగొట్టి కోట్లు ఖర్చు చేసి కొత్త ఇల్లు నిర్మించారు.

ఈయన ముఖ్యమంత్రి, కుమారుడు మంత్రి కాబట్టి అమరావతిలో ఉంటున్నారు. కాని కుటుంబం, వ్యాపారం హైదరాబాదులో ఉన్నాయి కదా. ప్రస్తుతం లోకేష్‌ హైదరాబాద్‌-అమరావతి మధ్య తిరుగుతున్నారు. బాబు పార్టీ కార్యాలయానికి, ఇంటికి అప్పుడప్పుడు వెళ్లివస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలం ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయలేదు. దీంతో హైదరాబాదులోని ఆయన నివాసం లోటస్‌పాండ్‌ రెండు రాష్ట్రాలకూ ప్రధాన కార్యాలయమైంది. ఏపీ నేతలంతా హైదరాబాదులోనే నివాసముంటూ రాజకీయాలు చేయడంతో టీడీపీ నేతలతో పాటు మీడియా కూడా విమర్శించింది. పార్టీ నేతలకూ ఇబ్డందికరంగా మారింది.

ఇదంతా ముదురుపాకాన పడేసరికి విజయవాడలో తాత్కాలిక ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పుడే అమరావతిలో సొంత ఇల్లు, ప్రధాన కార్యాయలం నిర్మించాలని నిర్ణయించారు. మంగళగిరి మండలంలోని తాడేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో నివాసం, కార్యాలయం నిర్మిస్తున్నారు. నాలుగైదు నెలల్లో ఈ రెండూ నిర్మాణాలు పూర్తవుతాయని నేతలు చెబుతున్నారు.

తన పాదయాత్ర పూర్తయ్యేలోగా నిర్మాణాలు పూర్తికావాలని జగన్‌ టార్గెట్‌ పెట్టారు. కుటుంబాన్ని అమరావతికి తరలిస్తారని చెబుతున్నారుగాని అది జరిగేది అనుమానమే. ఆయన వ్యాపారం కేంద్రం హైదరాబాద్‌. మీడియా సంస్థల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. అందులోనూ వాటి బాధ్యతలన్నీ భార్య భారతి చూసుకుంటున్నారు.

ఇక పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ రాజధాని ప్రాంతంలో రెండెకరాలు కొనుగోలు చేసి నివాసం, కార్యాలయం నిర్మిస్తున్నారు. హైదరాబాదుతో ఈ నేతల అనుబంధం తెగిపోదుగాని అమరావతి కేంద్రంగా రాజకీయాలు సాగుతాయి. ఎన్నికలయ్యేదాకా అక్కడ నుంచి కదలరు. టీడీపీని మినహాయిస్తే వైకాపా, జనసేన తెలంగాణలో కనబడటంలేదు. ఎన్నికలు ఏడాదిలో పడినా ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు లేవు. ఏది ఏమైనా చంద్రబాబు, జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ పూర్తిస్థాయి కార్యక్షేత్రం ఆంధ్రాయే.