cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆమె అటువైపు.. ఈయన ఇటువైపు.!

ఆమె అటువైపు.. ఈయన ఇటువైపు.!

రాజకీయం కుటుంబంలో చిచ్చు పెడ్తుందో లేదోగానీ, ఓ కుటుంబంలో ఎన్ని పార్టీలయినా వుండొచ్చని.. చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది. భర్త ఓ రాజకీయ పార్టీలో, భార్య ఇంకో రాజకీయ పార్టీలో వుండాల్సి రావడం మాత్రం అరుదైన సందర్భమే. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, బీజేపీలో ముఖ్యనేత. కానీ, ఆమె భర్త పరకాల ప్రభాకర్‌.. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు. పైగా, ఒకప్పుడు ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు కూడా.

బీజేపీ - టీడీపీ మధ్య స్నేహం చెడిపోయాక కూడా టీడీపీతో పరకాల అనుబంధం కొనసాగింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక, ఆ మధ్య బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి మద్దతు పలికారు. జనసేనలో ఆమె చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది కూడా.

'అభిమానం వేరు, రాజకీయం వేరు.. ఆమె జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటుందని నేను అనుకోను.. పవన్‌కళ్యాణ్‌ని సినీ నటుడిగా ఆమె మాత్రమేకాదు, నేనూ అభిమానిస్తాను..' అని చెప్పుకున్నారు ఆకుల సత్యనారాయణ. అప్పటికి బీజేపీ - జనసేన మధ్య స్నేహం చెడి, రెండుపార్టీలూ బద్ద శతృవుల్లా మారిన సందర్భమది.

తాజాగా, తెలంగాణలో మరో ఆసక్తికరమైన కుటుంబ రాజకీయం తెరపైకొచ్చింది. కాంగ్రెస్‌ ముఖ్యనేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె మెదక్‌ జిల్లా సంగారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారట. ఈ విషయం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్ని షాక్‌కి గురిచేసింది.

తన భార్య, బీజేపీలో చేరడంపై దామోదర రాజనర్సింహ ఇంకా స్పందించాల్సి వుంది. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో దామోదర రాజనర్సింహ, కీలకమైన బాధ్యతల్ని కాంగ్రెస్‌ తరఫున నిర్వహిస్తోన్న విషయం విదితమే. కుటుంబ సంబంధాలు వేరు, రాజకీయాలు వేరని అనలేం.

ఆకుల సత్యనారాయణ, బీజేపీని వీడి.. జనసేనలో చేరాలనే ఆలోచనతో ముందుగా తన భార్యను, జనసేన వైపుకు పంపించారన్న ప్రచారం వుంది. పరకాల విషయంలో ఇలాంటివేమీ లేవు. ఎందుకంటే, ఆయన చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేస్తుంటారు.

ఆయన తీరే వేరు. దామోదర రాజనర్సింహ మాత్రం, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని ఊహించే, తన భార్యను ముందు జాగ్రత్తగా బీజేపీలోకి పంపి వుండొచ్చేమో.!