Advertisement


Home > Politics - Gossip
బాబు తీరుకు అమిత్ షా టిట్ ఫర్ టాట్

‘చంద్రబాబునాయుడు ఆగ్రహంగా ఉన్నారు.. సంబందం తెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు..’ అని సమాచారం వచ్చిందే అనుకుందాం.. దానికి అమిత్ షా స్పందించారు. ఆయనకు ఫోను చేశారు.. ‘బాబు గారూ అలకలు ఎందుకు? మీరు రండి.. మనం మాట్లాడుకుందాం’ అన్నారు.

కానీ చంద్రబాబు కాస్త టెక్కు ప్రదర్శించారు. భేటీకి స్వయంగా తాను వెళితే.. ఒకవేళ బెడిసి కొడితే.. దానికి ఫాలో అప్ భేటీ ఉండే అవకాశం పోతుందనే భయంతో.. ఆయన తాను కాకుండా, తన టీమ్ వస్తారంటూ అమిత్ షాకు చెప్పారు. ఆ టీంలో యనమల, సుజనా, కింజరాపు, కుటుంబరావులను ఎంపిక చేశారు.

అయితే ఇక్కడ విభజన హామీల సంగతి తేల్చడానికి తానంతటి వాడు భేటీకి రావాలా? ఇది నా స్థాయిది కాదు.. నా ప్రతినిధులు వస్తే చాలు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఆయన చెప్పిన సమయానికి అమిత్ షా ‘సరే’ అన్నారు. కానీ ఫోను పెట్టేసిన తర్వాత.. ‘నీ స్థాయి కాదని .. నువ్వు టీంను పంపిస్తే.. వారితో భేటీ నా స్థాయి కాదు..’ అని అర్థం వచ్చేలాగా.. వారిని రమ్మన్న ముహూర్త సమయానికి ఆయన వేరే కార్యక్రమాలు పెట్టుకుని వెళ్లిపోయారు. ఆ రకంగా వారికి హ్యాండ్ ఇచ్చారు.

దీనినే ఢిల్లీలోని రాజకీయ వర్గాలు మాత్రం.. చంద్రబాబుకు అమిత్ షా బుద్ధిచెప్పిన టిట్ ఫర్ టాట్ వ్యవహారంగా అభివర్ణిస్తున్నారు. ఏపీ ప్రతినిధులతో అరుణ్ జైట్లీ మాత్రమే సమావేశం అయ్యారు.

అరుణ్ జైట్లీ వ్యవహార సరళి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సంగతీ తేల్చరు. ‘వీళ్లెలా చస్తే నాకేంటి’ అనే తరహాలోనే ఎడ్మినిస్ట్రేషన్ యాంగిల్ లోనే వ్యవహారాలను చూస్తారు తప్ప.. కనీసం రాజకీయ కోణంలోంచి వ్యవహారాలను బేరీజు వేసి నిర్ణయం తీసుకోవడం కూడా ఆయనకు అలవాటు లేదు.. చేతకాదు అని కూడా చెప్పొచ్చు.

గతంలో పార్లమెంటులో.. వెంకయ్యనాయుడు సమక్షంలో అరుణ్ జైట్లీతో ఓ విడత చర్చలు అయిన తర్వాత.. రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏపీ అంశాల ప్రస్తావన సమయంలో.. సుజనాచౌదరి ఆయన దగ్గరకు వెళ్లి.. లోపల భేటీ తేల్చిన ఒక అంశం గురించి చెప్పాల్సిందిగా అడిగారట.. ‘వెళ్లి అమిత్ షా దగ్గర చీటీ రాయించుకుని వస్తే తప్ప.. తాను చెప్పనంటూ అరుణ్ జైట్లీ తిప్పికొట్టారుట..’ అప్పట్లో అలా వార్తలు వచ్చాయి.

అలాంటి అరుణ్ జైట్లీ ఈ సమావేశంలో మాత్రం ఏం తేలుస్తారు. ఆయన ఏమీ తేల్చకుండానే.. సురేష్ ప్రభుతో మాట్లాడి చెప్తా అంటూ ప్రస్తుతానికి రోకలి నానేశారు. అది ఎప్పటికి నానుతుందో.. ఎప్పటికి ఉడుకుతుందో చూడాలి.