Advertisement


Home > Politics - Gossip
'అమ్మ'ల ఆధిపత్యం ముగిసి... ఇక 'అయ్య'ల పెత్తనమా?

తమిళనాడులో అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలు జాతీయ స్థాయిలో ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అన్నాడీఎంలోని శశికళ వర్గం, పన్నీరుశెల్వం వర్గం ఒక్కటైపోయి, మన్నారుగుడి మాఫియాను బయటకు గెంటేసి, ఏకశిల మాదిరిగా మళ్లీ ఒకే అన్నాడీఎంకేగా ఏర్పడితే  'అమ్మ'ల శకం ముగిసి 'అయ్య'ల పెత్తనం ప్రారంభమైనట్లు భావించాలి. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ తరువాత దశాబ్దాల పాటు జయలలిత ఆధిపత్యం కొనసాగింది. పార్టీలో, ప్రభుత్వంలో ఆమె కొనసాగించిన ఆధిపత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలినా ప్రజల్లో, పార్టీలో  దేవతే. ఆమె మరణం తరువాత మరో దేవతగా అవతారమెత్తిన మన్నారుగుడి మాఫియా నాయకురాలు శశికళ అలియాస్‌ చిన్నమ్మ కథ చాలా త్వరగా ముగిసిపోయింది. ఇందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు కారణం అవునా? కాదా? అనేది పక్కకు పెడితే రాజకీయంగా ఆమె మరణ శాసనం తయారైపోతోంది. 

చిన్నమ్మ అక్క కొడుకు కమ్‌ ఆమె వర్గం ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ రాజకీయ జీవితం ముగింపునకు వచ్చినట్లు ప్రస్తుత పరిణామాలనుబట్టి అర్థమవుతోంది. రెండాకుల గుర్తు సంపాదించుకోవడం కోసం దినకరన్‌ ఎన్నికల కమిషన్‌కు సభ్యులకు లంచం ఇవ్వచూపాడా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. కాని ఈలోగా ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడే అవకాశాలు కనబడుతున్నాయి. జయలలిత చనిపోగానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని శశికళ ప్లాన్‌ వేసింది. కాని జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చినా ఆమెకు అవకాశం లేదు. తాను ముఖ్యమంత్రి కాలేకపోయినా దినకరన్‌ ముఖ్యమంత్రి కావాలనేది ఆమె కోరిక. అతని ఆకాంక్ష కూడా ఇదే. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించగానే పళనిసామిని పక్కకు పెట్టి తాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని కలల కన్నాడు. కాని ఉప ఎన్నిక రద్దుతో మొదటి దెబ్బ పడగా, ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపాడనే ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేయడంతో రెండో దెబ్బ పడింది.

దీంతో పూర్వపు అన్నాడీఎంకే రూపుదాల్చాలంటే విడిపోయిన రెండు వర్గాలు ఒక్కటి కావడమే మార్గమని మంత్రులు, ఎమ్మెల్యేలు సంకల్పించడం శుభపరిణామమనే చెప్పుకోవాలి. రెండు వర్గాల మధ్య చర్చలు ఫలవంతమైతే పార్టీకి మన్నార్‌గుడి మాఫియా పీడ వదిలిపోయినట్లే. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే శశికళ వర్గంలోనూ మాజీ సీఎం పన్నీరు శెల్వంకు మద్దతు పెరుగుతోంది. పార్టీని పన్నీరు చేతుల్లో పెట్టాలని ఎక్కువమంది కోరుతున్నారు. అంటే ఆయన్ని ప్రధాన కార్యదర్శిని చేస్తారన్నమాట. ఈ మాజీ ముఖ్యమంత్రికి జనంలోనూ ఆదరణ, అభిమానం ఉన్నాయి. ఆయన పార్టీ అధినేతగా ఉంటే ఓట్లు పడతాయని నాయకులు నమ్ముతున్నారు.  తన వర్గం విలీనానికి పన్నీరు రెండు షరతులు పెట్టినట్లు సమాచారం. మొదటిది శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి బయటకు పంపాలి. అసలు మన్నార్‌గుడి మాఫియాను కనబడకుండా చేయాలి. రెండోది తన వర్గానికి ఆర్థిక శాఖ కేటాయించాలి. విలీనానికి ముందే ఈ రెండు షరతులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లుతుందా? లేదా? అనే విషయంలో ఎన్నికల కమిషన్‌ త్వరలోనే తీర్పు చెప్పబోతోంది. 

జయలలిత చనిపోగానే శశికళను 'దేవత'ను చేసి ఆరాధించిన నాయకులంతా ఇప్పుడు వదిలించుకోవడానికి సిద్ధమయ్యారు. 'అమ్మ' పోయినా చిన్నమ్మ అమ్మలా దొరికిందని సంతోషించిన నాయకులు చిన్నమ్మలో అమ్మను చూసుకున్నారు. భవిష్యత్తులో అమ్మను మించిన అమ్మ అవుతుందని ఆశిస్తూ ఆమెకు పార్టీ అధినేత్రిగా పట్టాభిషేకం చేశారు. శశికళ అమ్మ జయలలితను కాపీ కొడుతూ, ఆమెలా వస్త్రధారణ చేసుకుంటూ, ఆమెలా పార్టీ నాయకులను ఆశీర్వదిస్తూ, అభినందనలు తెలుపుతూ, అభివాదం చేస్తూ, పెత్తనం చెలాయిస్తూ, ఆమెను తలపించేలా వ్యవహరించింది. శశికళను నెత్తిన పెట్టుకున్నవారిలో పన్నీరు శెల్వం కూడా ఉన్నారు. శశికళ ప్రధాన కార్యదర్శి అయినా తన ముఖ్యమంత్రి పదవికి ముప్పు రాదని అనుకున్నారు. కాని చిన్నమ్మే ముఖ్యమంత్రి కావాలనుకుంది. ఆమె అత్యాశ, అహంకారం కొంప ముంచాయి.