Advertisement


Home > Politics - Gossip
అన్యాయం చేస్తున్నారు.. కాని ఏమనొద్దు!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను దేశంలోనే అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుడినని చెప్పుకుంటారు. తాను ఎవరెవరిని ప్రధానులను చేశారో, రాష్ట్రపతులను చేశారో చెబుతారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని, ఇతర ముఖ్యమంత్రుల పాత్ర అసలు లేదన్నట్లుగా మాట్లాడతారు.

ఇలా ఎన్నెన్నో 'కతలు' చెబుతూ తనను తాను దైవాంశసంభూతుడిగా అభివర్ణించుకుంటున్న ఈయన కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారు? ఇది ఎవ్వరికీ అర్థంకాని విషయం. పొత్తు పెట్టుకొని, అధికారంలో భాగం పంచుకున్నంత మాత్రాన 'జీ హుజూర్‌' అనాల్సిందేనా? దేశంలోని ఏ బీజేపీయేతర ముఖ్యమంత్రీ కేంద్రం అడుగులకు మడుగులొత్తడంలేదు. అంతమాత్రాన ఆ రాష్ట్రాలకు నిధులు ఆగిపోతున్నాయా? చట్టప్రకారం వాళ్లకు రావల్సినవన్నీ తొక్కిపెడుతున్నారా?

ఏపీకీ ఏం సాయం చేయడంలేదని అసెంబ్లీలోనూ, మీడియా సమావేశంలోనూ ఆక్రోశించిన ముఖ్యమంత్రి 'బీజేపీ మీద, కేంద్రంపైనా విమర్శలు చేయొద్దు. లేనిపోని విషయాలు మాట్లాడొద్దు' అని టీడీఎల్పీ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇలా చెప్పడం కొత్తకాదు. గతంలో కొందరు తమ్ముళ్లు కాస్త గొంతుపెంచి మాట్లాడినప్పుడు బాబు వారిని కట్టడి చేశారు. అసెంబ్లీలో, మీడియా సమావేశాల్లోనే కాకుండా పార్లమెంటులో సైతం మాట్లాడవద్దని ఆదేశించారు. ఈ విషయం స్వయంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డే చెప్పారు.

కేవలం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటానికే 62సార్లు ఢిల్లీ వెళ్లానన్నారు. మళ్లీ వెళ్లి ప్రధానిని కలుస్తానన్నారు. ఇలా ఎన్నిసార్లయినా తిరుగుతానంటారుగాని ఎంపీలను మాట్లాడవద్దంటారు. నిన్న బాబు ఆక్రోశించాక జేసీ దివాకర్‌ రెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావు కమలంపై కొద్దిగా ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో బాబు ఆంక్షలు విధించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కావొచ్చు మంత్రి చంద్రమోహన్‌ రెడ్డి 'సన్నాయి నొక్కులు' నొక్కుతూ మాట్లాడారు.

రాష్ట్రానికి కేంద్రం సాయం చేయకపోతే తాము దశలవారీగా పోరాడతామన్నారు. ఇదేం పోరాటమో...! ఈలోగా ఎన్నికలొచ్చి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. తమ పోరాటం ఎలా ఉంటుందో సోమిరెడ్డి సెలవిచ్చారు. 'తండ్రిపై కుమారుడు, అన్నపై తమ్ముడు చేసే ఒత్తిడిలా ఉంటుంది'.. అన్నారు. దీని అర్థమేంటో ఆయనకే తెలియాలి. ఒత్తిడి చేయడమంటే ఢిల్లీకి వెళ్లి బతిమాలుకోవడం, వాళ్లనూ వీళ్లనూ పట్టుకొని లాబీయింగ్‌ నడపడం కావొచ్చు.

ప్రధానమంత్రి తన జేబులోని సొంతడబ్బు ఇవ్వడంలేదనే విషయం గుర్తుంచుకోవాలి. పార్లమెంటు చేసిన విభజన చట్టాన్ని అమలు చేయండని అడగడానికి బాబు ఎందుకు భయపడుతున్నారో తెలియడంలేదు. ఆయన వ్యతిరేకులు చెబుతున్నట్లుగా ఓటుకు నోటు కేసులో కేంద్రం ఇరికిస్తుందనే భయం ఉందా? హెరిటేజ్‌ మీద ఆదాయపు పన్ను దాడులు చేయిస్తుందని భయపడుతున్నారా? చట్టబద్ధంగా రాష్ట్రానికి రావల్సినవి అడగలేకపోవడానికి ఏదో కారణం ఉంటుంది.

అదేమిటనేది ఏనాటికైనా బయటపడుతుందా? ఏపీ, తెలంగాణతోపాటు మరో రెండు చిన్న రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగొచ్చని తాజాగా ఓ సమాచారం. ఇప్పటివరకు సీట్లు పెరగవని చెబుతున్న కేంద్రం మళ్లీ కసరత్తు చేస్తోందట. ఒకవేళ సీట్లు పెంచితే బాబు బీజేపీతోనే కొనసాగాలనే ఆలోచనకు వస్తారేమో. ఇతర సాయాలు అందకపోయినా సీట్లు పెరిగితే ఆయనకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది. మోదీ ఈ వరమిచ్చి నోరు మూయిస్తారా?