cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?

ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?

తెలంగాణ ఎన్నికల అంకం పూర్తయిపోయింది. ఫలితాలు వచ్చేసాయి. ఆ వ్యవహారం అంతా  ముగిసిపోయింది. ఇక కొన్నాళ్ల పాటు కాంగ్రెస్ నేతలు గప్ చుప్ అవ్వక తప్పదు. గెలిచిన రెండు పదుల మందిలో ఎవరు వుంటారో? ఎవరు గోడ గెంతుతారో? తరువాత సంగతి. మొత్తానికి తెలంగాణలో ప్రతిపక్షం అనేది చాలా నామమాత్రం అయిపోయింది. అది వాస్తవం. 

తెలుగుదేశం పార్టీ తన గొంతు మరోసారి ఇక్కడ వినిపించే పరిస్థితి లేదు. జాతీయ పార్టీ అని చెప్పుకోవడం తప్ప, ప్రాతినిధ్యం వుండకపోయినా ఆశ్చర్యపడనక్కరలేదు. కాంగ్రెస్ మాత్రమే గొంతు ఎత్తే పరిస్థితిలో వున్నా, బలమైన నాయకులంతా ఓటమి పాలయ్యారు. అందువల్ల ఆ పార్టీ గొంతు కూడా పెద్దగా వినిపించదు. ఇలాంటి టైమ్ లో తెలంగాణ వ్యవహారాలు ఎలా వుంటాయన్నది ముందు ముందు చూడొచ్చు. 

కానీ ఆది నుంచీ కూడా తెలంగాణ ఎన్నికలు దేశ రాజకీయాలను, ఆంధ్ర రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాయని అనుకుంటూ వస్తున్నారు అంతా. అది వాస్తవం కూడా. 
తెలంగాణలో దాదాపుగా సిట్టింగ్ అభ్యర్థులు అందరికీ సీట్లు ఇచ్చిన తరువాత, జనాల్లో వ్యతిరేకత చాలా మంది పట్ల వుందని, కేసిఆర్ చేసింది తప్పు అని విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి చాలా సంగతులు. దాంతో చంద్రబాబు సర్వేల మీద సర్వేలు చేయించారు ఆంధ్రలో. సిట్టింగ్ ల్లో చాలా మందిని పక్కన పెడతారని అక్కడ కథనాలు వచ్చాయి.

కానీ ఇప్పుడు తెలంగాణలో ఫలితాలు వేరుగా వున్నాయి. ప్రభుత్వం మీద ప్రేమ వుంటే, తమ స్థానిక నేత ఎవరు అన్నది కూడా జనం పట్టించుకోరు అన్నది ఇప్పుడు అక్కడ తేలిన విషయం. మరి ఆంధ్రలో కూడా జనం ఇలాగే ఆలోచిస్తారా? లేక చంద్రబాబు అభ్యర్థులను మార్చే విషయంలో బాబు పునరాలోచనలో పడతారా?

సంక్షేమ పథకాలు ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని తెలంగాణలో రుజువు అయింది. ఇప్పటికే ఆంధ్రలో బోలెడు పథకాలు వున్నాయి. ఫ్రీగా పండగ సరకులు, చౌకగా రేషన్ సరుకులు, ప్రభుత్వం కోట్ల ఖర్చు భరించి తక్కువకు భోజనం, టిఫిన్ అందిస్తున్నారు. అందువల్ల ఈ పథకాల డోస్ ను మరింత పెంచుతారేమో చూడాలి.

తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందా? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వ్యతిరేకత వస్తే, ఇంత బూమ్ రాదు. వచ్చిన వ్యతిరేకత కాస్తా, చంద్రబాబు పుణ్యమా అని, ఆత్మగౌరవ కార్యక్రమంగా మారిపోయి టీఆర్ఎస్ ను గెలిపించిందా? ఈ ప్రశ్నకు మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనక్కరలేదు. టీఆర్ఎస్ విజయంలో అది కూడా ఒక ఫ్యాక్టర్ మాత్రమే కానీ, అదే కీలకం కాదు. ప్రభుత్వం అందించిన పథకాలే కీలకం.

ఈ లెక్కన బాబుకు కాస్త భరోసా వుంటుంది. కానీ అదే సమయంలో తెలంగాణలో తెలుగుదేశం ఎంట్రీ పట్ల క్షత్రియులు, కాపులు, బ్రాహ్మణులు పూర్తి వ్యతిరేకత కనబర్చారని కొంత వరకు రెడ్లు కూడా వ్యతిరేకించారని స్పష్టమైన విశ్లేషణలు వున్నాయి. ఇదే వ్యతిరేకత ఆంధ్రలో కూడా వుంటే తెలుగుదేశం పరిస్థితి ఏమిటి? పైగా వెలమలకు అందిన అధికారాన్ని లాగేయాలని చంధ్రబాబు తెలంగాణలో గట్టి ప్రయత్నం చేసారు. 

దక్షిణ, ఉత్తర కోస్తాల్లో క్షత్రియులు, కాపులు, వెలమలు, బ్రాహ్మణులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వున్నారు. అదే సమయంలో మజ్లిస్ నాయకులు కనుక ఆంధ్రలో ఎంటర్ అయ్యి, బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే పరిస్థితి ఏమిటి? వీటన్నింటికి తోడు తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రలో ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి ఎక్కువ స్థాయిలో వుంది. అవినీతి, ఇసుక వ్యాపారాలు భయంకరంగా వున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఇదిలా వుంటే కాంగ్రెస్ తో పొత్తు అన్నది ఇప్పుడు చంద్రబాబు ముందు వున్న ప్రశ్న. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ, కాంగ్రెస్ తో భుజం కలిపి తిరుగుతూ, ఆంధ్రలో దూరం పెడతాం అంటే ఎలా వుంటుంది? లేదా కలిసి వెళ్తాం అంటే ఎలా వుంటుంది? కాంగ్రెస్ తో కలియడం వల్ల మైనస్ నే కానీ ప్లస్ కాదని భావిస్తే చంద్రబాబు దానికి దూరంగా వుంటారు. అలా వుండాలి అంటే కొన్నాళ్లు జాతీయ రాజకీయాలకు కూడా దూరంగా వుండాల్సి వస్తుందేమో?

తెలంగాణలో టీఆర్ఎస్ కు భాజపా కు రంకు కట్టే ప్రయత్నం తెలుగుదేశం చేసింది. ఆంధ్రలో జగన్ కు, పవన్ కూడా ఇదే విధంగా భాజపాతో లింకులను ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. కానీ అక్కడ జనం నమ్మలేదు. మరి ఇక్కడ జనం నమ్ముతారా? నమ్మకపోతే, బాబు అను'కుల'మీడియా ప్రచారం వృధా అవుతుంది.

ఇక బాబు అను'కుల' మీడియా తెలంగాణలో కుక్కిన  పేనుల్లా వుండకతప్పదు. పనిలో పనిగా కెసిఆర్ తలచుకుంటే, ఆంధ్రలో కూడా వాటిని న్యూట్రల్ చేయగలరు. అలా చేస్తే బాబు పరిస్థితి కష్టం అవుతుంది. మీడియా దన్ను లేకుండా బాబు చేసిన తప్పిదాలు అన్నీ కప్పడం కష్టం అవుతుంది. జనాలను పక్కదారి పట్టించడం కష్టం అవుతుంది. 

ఇప్పటికే ఓ లీడింగ్ చానెల్, మరో తెలంగాణ లీడింగ్ చానెల్ కేసిఆర్ చెప్పినట్లు వినే పరిస్థితి. అలాగే మరో ఒక చానెల్ కూడా జగన్ వైపు వుంటుంది. ఇక మిగిలింది బాబు బాకా ఊదే ఒకటి రెండు మాధ్యమాలు మాత్రమే. 

ఇవన్నీ ఇలా వుంటే భాజపా సంగతి ఎలా వున్నా, దాని అనుబంధ సంస్థలు అయిన విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ బాబు కు వ్యతిరేకంగా చాపకింద నీరులా పని చేస్తాయి. ఎందుకంటే తెలంగాణలో ఎంపీల బలం భాజపాకు అనుకూలంగా వుంటుందన్న ధీమా వుంటుంది. ఆంధ్రలో కూడా ఆ పరిస్థితి రావాలంటే బాబుకు ఎంపీలు వుండకూడదు. 

దీనికి తోడు అసలు ఓటుకు నోటు కేసు ఏమవుతుంది? జగన్ పై మర్డర్ అటెంప్ట్ కేసు ఏమవుతుంది? ఇవేమైనా బాబును ఇరుకున పెడతాయా? ఆ దిశగా పావులు కదులుతాయా? అన్నది కూడా ఆసక్తి కరమే. 

ఎప్పుడైతే తెలంగాణలో తెరాస ప్రభుత్వం వచ్చిందో జగన్ కు కాస్త అన్ని విధాలైన సహాయ సహకారాలు అందుతాయి. ఇలా అన్ని విధాలా బాబుకు ఇబ్బంది కరమైన పరిస్థితులు వుంటాయి. కానీ ఒక్కటే ఆయన భరోసా, అండ. దండ. ఆయన అను'కుల' మీడియా. జనాలను ఎటు అదిలించమంటే అటు అదిలించే ప్రయత్నం ఆ మీడియా చేస్తూనే వుంటుంది. దాన్ని కనుక కాస్త బ్రేక్ వేయగలిగితే, బాబుగారకి కష్టకాలమే.