cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆంధ్రప్రదేశ్‌లో 'కమలం' కథ ముగిసినట్టేనా.?

ఆంధ్రప్రదేశ్‌లో 'కమలం' కథ ముగిసినట్టేనా.?

'ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారట.. మరో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జనసేన పార్టీ వైపు చూస్తున్నారట.. ఇంకొంతమంది బీజేపీ నేతలూ పార్టీ మారేందుకు సిద్ధంగా వున్నారట..' అంటూ ఎప్పటినుంచో గాసిప్స్‌ విన్పిస్తున్న సంగతి తెల్సిందే. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడ్తుండడంతో, ఆయా నేతలు బీజేపీని వీడి తమదారి తాము చూసుకోవడానికి తొందరపడితే అందులో తప్పేముంది.?

2014 ఎన్నికల సమయంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌కి చాలా హామీలు ఇచ్చింది. ఇవన్నీ, విభజన చట్టానికి అదనం. ప్రత్యేకహోదా కావొచ్చు, మరొకటి కావొచ్చు.. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ఏమేం కావాలో, అంతకు మించి చేస్తామంటూ సాక్షాత్తూ నరేంద్రమోడీ సెలవిచ్చారు. కానీ, ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత బీజేపీ ఏం చేసిందో అందరం చూశాం. బీజేపీ నేతలకు, అవన్నీ కన్పించకుండా ఎలా వుంటాయ్‌.? కానీ, జాతీయ స్థాయిలో మోడీకి వున్న 'పలుకుబడి' నేపథ్యంలో ఏపీ కమలనాథులు ఇంకోమాట మాట్లాడలేకపోయారు.

రోజులు మారాయి, ఒకరొకరుగా బీజేపీని వీడుతున్నారు ఏపీకి చెందిన ముఖ్యనేతలు. జనసేనలో ఇప్పటికే చేరిన అద్దేపల్లి శ్రీధర్‌ ఒకప్పుడు బీజపీనేత. విష్ణుకుమార్‌రాజు మొదటి నుంచీ చంద్రబాబు మద్దతుదారుడు. కామనేని శ్రీనివాస్‌ కూడా అంతే. ఏపీ బీజేపీలో కొందరు చంద్రబాబు వ్యతిరేకులు వున్నారు. వారిలో కొందరు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు, చాలామంది మాత్రం జనసేనను ఎంచుకుంటున్నారు. సరే, వాళ్ళలో ఎంతమందికి 'ప్రజాబలం' వుందన్నది వేరే విషయం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, నరేంద్ర మోడీ ఇమేజ్‌ పట్ల తెలంగాణ బీజేపీ నేతలకే కాదు, ఏపీ బీజేపీ నేతలకూ నమ్మకాలు పోయాయి. దాని ఫలితమే, ఏపీ బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు అని కుండబద్దలుగొట్టి మరీ చెప్పేయొచ్చు. మీడియా ముందుకొచ్చి, బీజేపీ భావజాలాన్ని బలంగా ఇప్పటికీ విన్పిస్తోన్న కొందరు నేతలు సైతం, టీడీపీతోపాటు వైసీపీ, జనసేనలతో టచ్‌లోకి వస్తుండడం గమనార్హం.

ఇంకొద్ది నెలల్లోనే, మొత్తంగా ఏపీ బీజేపీ ఖాళీ అయిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు. కేంద్రం, రైల్వేజోన్‌ పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోవడం, కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయమై కొర్రీలు పెట్టడం, అమరావతికి సంబంధించి మాట నిలబెట్టుకోకపోవడం, దుగరాజపట్నం పోర్టుపై పెదవి విప్పకపోవడం.. ఇలాంటివన్నీ ఏపీలో బీజేపీని ముంచేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.  

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్