Advertisement


Home > Politics - Gossip
అన్నయ్య మీద కన్నేశారా?

రాజకీయాల్లో ఉన్నంత చంచలం, సంచలనం మరే రంగంలోనూ ఉండవు. ఇక్కడ శాశ్వతమైన ఆలోచనలు, అంచనాలు ఉండవు. ఏదైనా రాజకీయ పార్టీ ఈ రోజు ఓ ఆలోచన చేసిందంటే రేటికల్లా అది మారిపోవచ్చు. ఇప్పుడో నిర్ణయం తీసుకుంటే కొన్ని గంటల్లోనే రూపాంతరం చెందొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఆలోచనలు అలా రూపాంతరం చెందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కనిపించే దృశ్యం టీడీపీతో పొత్తు. కాని వచ్చే ఎన్నికల నాటికి ఈ స్నేహం ఉంటుందా? పెటాకులవుతుందా? అనే సందేహమూ ఉంది.

పొత్తు ఉంటుందని, ఉండదని... రెండు రకాల వాదనలు రెండు పార్టీల్లో వినబడుతున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వమే పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో నాయకులు తోచినట్లు మాట్లా డుతున్నారు. పొత్తు విషయంలో రెండు పార్టీల్లో అనుమానాలు కొనసాగుతుండగానే, బీజేపీ, వైకాపా దగ్గరవు తున్నాయనే ప్రచారమూ జరుగుతోంది. ఇది టీడీపీకి భయం కలిగిస్తోంది.

ఇక మరో అంశం.. పవర్‌ స్టార్‌ కమ్‌ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏం చేయబోతున్నారు? టీడీపీ నాయకులు గత ఎన్నికల్లో మాదిరిగానే తమ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తుందని, తమతో పవన్‌ కళ్యాణ్‌ కూడా చేతులు కలుపుతారని అనుకుంటున్నారు. అంటే టీడీపీ- బీజేపీ-జనసేన కూటమిగా ఉంటాయని అంచనా. కాని పవన్‌ మొన్నటివరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాడు. ప్రత్యేక హోదాకు మంగళం పాడి, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని మండి పడ్డాడు. 

ఆయన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? బీజేపీ 'పచ్చ' పార్టీతో మిత్రత్వం వదులుకుంటే దానికి మద్దతు ఇస్తుందా? లేదా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి టీడీపీ, బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తుందా? అంచానాలకు అందడంలేదు. ఇప్పటివరకు పవన్‌ జనంలోకి రాలేదు. జనసేన పార్టీకి అస్తిత్వం లేదు. వ్యవస్థ లేదు. అక్టోబరు నుంచి జనంలోకి వస్తానని పవన్‌ ప్రకటించాడు కాబట్టి అప్పటినుంచి కదలిక వస్తుం దేమో...!

ఆయన చాలా నిదానం కాబట్టి చెప్పిన సమయానికి జనంలోకి వస్తాడో రాడో తెలియదు. టీడీపీతో తెగదెం పులు చేసుకోవల్సివస్తే పవన్‌ను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ ఇన్నాళ్లూ ఆలోచన చేసింది. ఆయనతో టచ్‌లో ఉంటూ బీజేపీకి ఫేవర్‌గా ఉండేలా చూడాలని కమలం పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులకు చెప్పింది. ఇందుకు కారణం కాపు సామాజికవర్గం ఓట్లు. ఈ ప్రయ త్నాలు ఎంతవరకు వచ్చాయో తెలియదుగాని ఈలోగా మరో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏమిటది?

పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్య, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని లాగే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం కాపుల ఓటు బ్యాంకే. మరి చిరంజీవి మీద ఎందుకు కన్నుపడింది? ఇందుకు కొన్ని కారణాలున్నాయని తెలుస్తోంది.

ఆయన రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏడాది (2018) మార్చితో ముగుస్తుంది. ఆయన్ని ఏపీ నుంచి రాజ్యసభకు మళ్లీ పంపేందుకు కాంగ్రెసుకు అవకాశం లేదు. చిరం జీవిని లాక్కుంటే రాజ్యసభకు పంపేందుకు టీడీపీ సహకరిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచీ అవకాశం ఉంది. అసలు ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేయించి గెలిపించే సత్తా ఉందని బీజేపీ నాయకులంటున్నారు. స్థిరమైన అభిప్రాయాలు, నిలకడైన మనస్తత్వం లేని పవన్‌ కంటే అన్నయ్య బెటరని కమలం పార్టీ అభిప్రాయం.

చిరంజీవికి ఇప్పటికీ ప్రజాదరణ ఉందని, ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే గ్లామర్‌ ఉన్ననాయకుడు లభించినట్లవుతుందని అనుకుంటున్నారట...! చిరంజీవి నిరాశతో కాంగ్రెసు ప్రలోభాలకు లొంగిపోయి ప్రజారాజ్యం పార్టీని దాంట్లో విలీనం చేశారని, వాస్తవానికి 2009 ఎన్నికల్లో పిఆర్‌పికి వచ్చిన సీట్లు, ఓట్లు మరీ తీసిపారేయదగినవిగా లేవని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఆ ఎన్నికల్లో పిఆర్‌పి 18 శాతం ఓట్లతో 18 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఈ గణాంకాలు చూస్తే చిరంజీవి పనితీరు బాగానే ఉందని భావిస్తోంది.

కాపులు పవన్‌ కళ్యాణ్‌ కంటే చిరంజీవిని ఎక్కువ అభిమానించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏ కోణం నుంచి చూసినా చిరంజీవి 'ఆపద్బాంధవుడు'లా ఉంటాడని, 'అందరి వాడు' అయ్యే అవకాశం ఉందని బీజేపీ కేంద్ర నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఇక చిరు ప్రస్తుతానికి కాంగ్రెసులో యాక్టివ్‌గా లేరనేది వాస్తవం.

రాజకీయాల్లోకి రావడం ద్వారా కోల్పోయిన సినిమా వైభవాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. 'ఖైదీ నెం.150' విజయవంతం కావడంతో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఆయన రాజకీయ జీవితం పట్ల కుటుంబ సభ్యులు కూడా సుముఖంగా లేరు. తాను కాంగ్రెసులోనే ఉంటానని చిరు గతంలో చెప్పినా నామమాత్రంగా ఉండటవల్ల ప్రయోజనం ఉండదు. ఒకవేళ చిరును లాక్కోవాలని బీజేపీ నాయకత్వం సీరియస్‌గా ప్రయత్నిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో....!

-నాగ్‌ మేడేపల్లి