చాపకింద నీరులా పని చక్కబెట్టేస్తున్నారు!

కొంచెం కష్టపడి పనిచేస్తే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ మరోసారి ప్రధానిగా గద్దె ఎక్కే అవకాశం లేకుండా చేయగలమనే నమ్మకం ప్రస్తుతం చాలా మంది నాయకుల్లోనే ఉంది. దానికి తగ్గట్టుగానే భాజపా వ్యతిరేక శక్తులు…

కొంచెం కష్టపడి పనిచేస్తే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ మరోసారి ప్రధానిగా గద్దె ఎక్కే అవకాశం లేకుండా చేయగలమనే నమ్మకం ప్రస్తుతం చాలా మంది నాయకుల్లోనే ఉంది. దానికి తగ్గట్టుగానే భాజపా వ్యతిరేక శక్తులు అందరినీ కూడగట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తమాషా ఏంటంటే.. ఈ పార్టీలను ఒక్క తాటిమీదకు తీసుకురావడం అనే పని.. తమ సారథ్యంలోనే జరగాలని దాదాపుగా అందరూ ఉబలాటపడుతున్నారు. తద్వారా. ఏర్పడబోయే కొత్త కూటమికి తామే కీలకం అని చాటుకోవాలనుకుంటున్నారు. తద్వారా.. ఆ కూటమి అధికారంలోకి వస్తే గనుక.. ప్రధానమంత్రి ప్రాబబుల్స్ గా తమను తాము చాటుకోవాలని ఆశిస్తున్నారు.

అయితే.. కీలక నాయకులు ఇలాంటి ఆశలతో ముందడుగు వేస్తుండగా.. ఒకరు మాత్రం చాపకింద నీరులా పని చక్కబెట్టుకుంటూ వెళుతున్నారు. ఆయనే.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్!

మోడీ వ్యతిరేక కూటమిని తయారు చేయడానికి కొత్తగా రంగంలోకి దిగిన వ్యక్తి నితీశ్ కుమార్. ఆయన చాలా వ్యూహాత్మకంగా తాను ప్రధాని పదవికి రేసులో లేనని, ప్రధాని పదవిని ఆశించడం లేదని ఒక మాట చెప్పి.. తన ఎంట్రీ ఇచ్చారు.

నిజానికి అప్పటిదాకా ఒకవైపు మమతా బెనర్జీ, మరోవైపు కేసీఆర్.. దేశంలోని పార్టీలను కూడగట్టడానికి నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. అయితే వారందరూ కూడా ప్రధాని పదవి మీద ఉన్న ఆశను దాచుకోవడం లేదు.

దీదీ తనను తానే ప్రధాని అభ్యర్థిగా ఊహించుకుంటుండగా.. కేసీఆర్, ఒక్క అయిదేళ్లు దేశానికి ప్రధాని అయితే దేశ స్వరూపం మొత్తం మారిపోతుందంటూ.. తన పార్టీ నాయకులతో చెప్పించుకుంటూ.. తాను రేసులో ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.

ఇంకోవైపు, శరద్ పవార్ అనుచరులు ఆయనే ప్రధాని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. శరద్ పవార్ లేకుండా మూడో కూటమి సాధ్యం కాదని.. అందరూ ఆయన నాయకత్వంకోసమే వచ్చి ఆశ్రయిస్తున్నారని.. ఆయన అనుచరులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

ఇలా ఆలూ చూలూ లేకుండానే.. వీళ్లంతా తమను తాము ప్రధాని పదవి రేసులో ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు. అయితే.. కొత్తగా ఎంట్రీ  ఇచ్చిన నితీశ్ కుమార్ మాత్రం.. చాపకింద నీరులా పని చక్కబెట్టేస్తున్నారు. తనకు ఆ పదవిపై ఆశ లేదంటూనే.. ఆ పదవిని చేరుకునేలా పావులు కదుపుతున్నారు.

ఒకప్పుడు తన పార్టీలో పనిచేసి, తర్వాత తనను తిట్టడమే పనిగా పెట్టుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ప్రత్యేకంగా పిలిపించి భేటీ కావడం ఇందుకు నిదర్శనం. దేశంలో అనేక భాజపా వ్యతిరేక పార్టీలతో పీకేకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని రేసులో తనకు మద్దతుగా ఉండేందుకు పీకేతో మళ్లీ స్నేహాన్ని పునరుద్ధరించుకుంటున్నట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు. 

మోడీ వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు గాక.. సమష్టిగా కలసి పోరాడదాం అనే ఆలోచన పక్కన పెట్టి.. ఎవరు ప్రధాని అవుతారా? అనే మీమాంసతోనే కాలం గడుపుతోంటే.. ఈ కూటమి ఎలా ముందడుగు వేస్తుందో అర్థం కావడం లేదు.