వైకాపా అధినేత, ఆంధ్ర సిఎమ్ వ్యవహారశైలి మీద ఎంత హడావుడి జరగాలో అంతా జరుగుతోంది. ఇంకేం లేదు జగన్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. భారతి సిఎమ్ కావడానికి అవకాశాలు తక్కువ. పెద్దిరెడ్డిని భాజపా చేరదీస్తోంది. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చారు. బుగ్గన కు కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పటికే హింట్ ఇచ్చారు.
ఇలా రకరకాల వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో అసలు జనాల స్పందన ఎలా వుంటుంది? ఫేస్ బుక్ లు, ట్విట్టర్ లు, వెబ్ సైట్ ల కామెంట్లు, జనాల మనోభిప్రాయం, వివిధ ఈక్వేషన్లు అసలు ఎలా వున్నాయి. వుండి వుంటాయి అన్నది కాస్త ఆలోచిస్తే.. అంతకన్నా ముందు దేశంలో వున్న రాజకీయ సన్నివేశం చూడాల్సి వుంది.
ఒకప్పుడు జాతీయ పార్టీల హవా నడిచేది. ఈలోగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకువచ్చాయి. వీటిని అణగదక్కకుండా, వాటిని దగ్గరకు చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ వాటి సాయంతో అధికారం అందుకుంటూ వచ్చింది. గతంలో ఓసారి పార్టీలు అన్నింటినీ కలగలిపి, చేసిన జనతా ప్రయోగం వికటించడంతో, ప్రతిపక్షాలు మళ్లీ అలాంటి ఆలోచన పెద్దగా చేయలేదు. జనతా నుంచి విడివిడి భాజపా గా రూపాంతరం చెందిన జనసంఘ్ మిగిలిన పార్టీలకన్నా కాస్త ముందుకు వెళ్లగలిగింది. ఇలా వెళ్లడం కోసం కాంగ్రెస్ అప్పటి వరకు ఫాలో అవుతున్న ప్రాంతీయ పార్టీలను దగ్గరకు తీయడం అనే వ్యూహాన్నే తానూ అనుసరించింది.
కాలానుగుణంగా కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిందో, లేక అనుకోకుండా జరిగిందో తనతో వున్న ప్రాంతీయ పార్టీలను తానే పలుచన చేసింది. పలు స్కాములను తానే విచారణ జరిపించి, తన మిత్ర పార్టీల నేతలను తానే జైల్లో వేయించి, నానా గత్తర చేసింది. ఆ విధంగా అవి తన చెప్పుచేతల్లో వుంటాయనుకుందో, లేదా తాను పరమ నిజాయతీ అని ప్రూవ్ చేసుకోవాలనుకుందో. కానీ దాని వల్ల ఏమయింది. ఆ పార్టీలు అన్నీ జనాల్లో పలుచన అయ్యాయి.
ఎప్పుడైతే కాంగ్రెస్ పొత్తులో వున్న పార్టీలు పలుచన అయ్యాయో, ప్రత్యామ్నాయ పార్టీలు పుంజుకున్నాయి. ఇది ముందే గమనించిన భాజపా, ఏ రాష్ట్రంలో ఎవరైతే విజయానికి దగ్గరగా వుంటారో, కాంగ్రెస్ కు దూరంగా వుంటారో వాళ్లను చేరదీసింది. కాంగ్రెస్ మాదిరిగా ప్రాంతీయ పార్టీలను ముందుకు నడిపి, వారి సాయంతో విజయం సాధించింది. దీనికి మోడీ చరిష్మా తోడయింది.
సరే ఇంతకీ ఇప్పుడేంటి పరిస్థితి? ప్రాంతీయ పార్టీల సాయంతో పైకి వచ్చిన భాజపా మళ్లీ దేశంలో జాతీయ పార్టీల హవాను తీసుకురావాలనుకుంటోంది. మెలమెల్లగా ప్రాంతీయ పార్టీలను చంపేయాలనుకుంటోంది. కానీ ఇదేమీ కొత్తది కాదు. ఇదే ఉద్దేశంతోనో, మరే ఇతర ఉద్దేశంతోనో గతంలో కాంగ్రెస్ చేసిన పనే. దాని వల్ల ఇప్పుడేమయింది. తమిళనాడును చూస్తే తెలుస్తుంది. తనతో వున్న అన్నాడీఎంకె వ్యవహారాన్ని భాజపా చిన్నా భిన్నం చేసింది. జనాలు డిఎంకె ను నెత్తిన పెట్టుకున్నారు. ఆ విధంగా భాజపా ఓ రాష్ట్రాన్ని కోల్పోయింది. మహరాష్ట్రలో శివసేనను ఇరుకునపెట్టాలని చూసింది. చూస్తోంది. దాంతో అక్కడ మద్దతు కోల్పోయింది.
ఇలా ప్రతి చోటా ప్రాంతీయ పార్టీలను ఇరుకున పెట్టాలని చూస్తోంది భాజపా. బెంగాల్ లో మరో పార్టీ సరైనది లేక మమతను తప్పించేయాలని చూసారు. సాధ్యం కాలేదు. ఆంధ్ర విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లి, ఆ పార్టీనే కూలిపోయేలా వ్యూహాలు రచించారు. అమలు చేసారు. ఇప్పుడు వైకాపా పై వ్యూహాలు రచిస్తున్నారు. సరే, గతం తెలిసి కూడా, తెలుగుదేశం భాజపాతో ముందుకు వెళ్తుంది అనుకుందాం. అధికారం వచ్చిన తరువాత తెలుగుదేశానికి వేరే ట్రీట్ మెంట్ లభిస్తుందా?
ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నీ ఓ తాటిపైకి రావడానికి కారణం ఏమిటి? భాజపా అనుసరిస్తున్న వ్యూహమే. తమ మనుగడనే చంపేస్తుంటే ఇంక లాభం లేక, అందరూ ఒక తాటిపైకి వస్తున్నారు. భాజపా మైనస్ మోడీ చరిష్మా అని లెక్క వేస్తే సున్నానే మిగులుతుంది. మోడీ చరిష్మా కూడా మరో సరైన ప్రత్యామ్నాయం లేక నడుస్తోంది. గతంలో జయప్రకాష్ నారాయణ్ కష్టపడి ప్రతిపక్షాలు అన్నింటిని ఓ తాటిపైకి తెచ్చి, జనతా ప్రయోగం చేసే వరకు ఇందిరాగాంధీకి ప్రత్యామ్నాయం లేదనే అనుకున్నారు. ఇప్పుడు మోడీ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
జనానికి రాహుల్ గాంధీని మరింతగా పరిచయం చేస్తోంది. జనాల్లో రాహుల్ పేరు వినపడేలా చేస్తోంది భాజపా వ్యవహారాలే. మోడీకి ఆల్టర్ నేటివ్ ఎవరు అని జనం ఆలోచించడం ప్రారంభించారు. ఎవ్వరూ లేరు భాజపాదే మళ్లీ హవా అని ఓ సమాధానం..ఎవరైనా వుండాలి..ఎవరినైనా చూడాలి అనే మరో సమాధానం దొరుకుతున్నాయి. రెండో దాని వైపు జనం ఎంత త్వరగా మళ్లితే అప్పుడు భాజపాకు అంతగా కష్టకాలం ప్రారంభం అవుతుంది.
ఢిల్లీ, మహరాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, కేరళ, ఇలా ఒక్కో రాష్ట్రంలో భాజపాకు వ్యతిరేకంగా బలమైన శక్తులు పునాదులు గట్టి చేసుకుంటున్నాయి. మోడీ చరిష్మా చూసుకుని భాజపా కలలు కంటోంది. ఆ చరిష్మా మాయం అయితే పరిస్థితి దారుణంగా వుంటుందని మరిచిపోతోంది. జనతా కొత్తగా కనిపించింది అప్పుడు. అలాగే వాజపాయి, మోడీ. రేపు మమత కొత్తగా కనిపించవచ్చు. జనాలు అదే ఆలోచిస్తారు. మోడీకి బదులు సోనియా రావాలి అని అనుకోకపోవచ్చు. కానీ మమత వస్తే ఎలా వుంటుంది. కేజ్రీవాల్ వస్తే బాగుంటుందేమో అని అనుకునే అవకాశం మాత్రం కచ్చితంగా వుంటుంది.
దక్షిణాన కేరళ, తమిళనాడు చేజారాయి. కర్ణాటకలో పరిస్థితి నీరసించింది. ఇక మిగిలింది తెలంగాణ, ఆంధ్ర. ఇక్కడ రెండు చోట్లా కూడా అధికార పార్టీలను అంతో ఇంతో ఇరుకున పెడుతూనే వస్తున్నారు. ఇప్పుడు అవి సహిస్తున్నాయి. అధికారం పైన వుంది కాబట్టి భరిస్తున్నారు. రేపు భవిష్యత్ లో ఇటా..అటా అనే కీలక సమయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఇటు తెరాస, అటు వైకాపా రెండూ గతంలో జరిగినదంతా కళ్ల ముందుకు తెచ్చుకుంటాయి. అసలు అంత వరకు వెళ్లకుండానే తెలుగుదేశం ముందుగానే తిరుగుబాటు చేసిన సంగతిని భాజపా మరిచిపోతే ఎలా?
మళ్లీ అదే తెలుగుదేశాన్ని నమ్ముకుని, వైకాపాను దూరం చేసుకోవడం తెలివైన చర్య అనిపించుకుంటుందా? కాంగ్రెస్ ను ఢీకొని, కాంగ్రెస్ కారణంగా జైలులో మగ్గి, కాంగ్రెస్ ను ఆంధ్రలో పూర్తిగా మాయం చేసిన జగన్ నమ్మకస్తుడు అవుతాడా? ఇప్పటికి రెండు సార్లు ఏరు దాటాక తెప్ప తగలేసిన చంద్రబాబు నమ్మకస్తుడు అవుతాడో? భాజపా ఆలోచించుకోవాలి.
సరే ఇప్పుడు వైకాపాను చీల్చడం అన్నది భాజపాకు పెద్ద కష్టం కాదు. ఎందుకుంటే జగన్ వైపు నుంచి అన్ని అవకాశాలు వున్నాయి. కానీ రెండేళ్ల తరువాత మళ్లీ ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి? తాను చీల్చి, తాను చేరదీసి సిఎమ్ ను చేసిన తరువాత మళ్లీ ఆ పార్టీతోనే భాజపా ముందుకు వెళ్లాలి. అప్పుడు తెలుగుదేశం ఎటు మొగ్గుతుంది? అసలు జగన్ స్కీములు ఏమవుతాయి అప్పుడు అసలు జనం అప్పుడు ఏం ఆలోచిస్తారు
ఆంధ్రలోని ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మొత్తం ఎటు వుంటుంది? జగన్ స్కీములు అందుకున్నవారు ఎటు వుంటారు. జగన్ అదృష్టం బాగుండి మళ్లీ అధికారం అందుకుంటే అప్పుడు భాజపా మరో నమ్మకస్తుడిని పోగొట్టుకున్నట్లే కదా? భాజపా జాతీయ స్థాయిలో 'పచ్చ' రంగు లోపల దాచుకున్నవారు ఇంకా కాస్త చైతన్యంగానే వున్నారు.
పార్టీ మూలాలైన ఆరెస్సెస్ లో తమకు వున్న పలుకుబడిని ఇంకా వాడుతూనే వున్నారు. ఆ మూలాలున్న నాయకులను, మంత్రులను జగన్ వ్యతిరేక దిశగా నడిపిస్తూనే వున్నారు. ఇది మోడీ, అమిత్ షా గమనించుకున్నారా? లేదా? అన్నది తెలియాల్సి వుంది. లేదూ మోడీ, అమిత్ షా ద్వయం కూడా అదే దిశగా పయనిస్తున్నారు అంటే చేసేదేమీ లేదు.
వారు రాంగ్ డైరక్షన్ లో వెళ్తున్నారు అన్నది వారికి తెలిసే రోజు కోసం వెయిట్ చేయడం తప్ప.
ఆర్వీ