మామూలుగా వెళ్తేనే ప్రమాదాలు ఎదురయ్యే కాలం ఇది. అలాంటిది రాంగ్ రూట్ లో వెళ్తే ఏమవుతుంది? ఆక్సిడెంట్ కావడానికే ఎక్కువ అవకాశం వుంది. ఎవరి మాట విన్నారో? ఏ స్వామీజీ పక్కదారి పట్టించారో? మొత్తం మీద సిఎమ్ జగన్ రాంగ్ రూట్లో వెళ్లారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్ పోస్ట్ విషయంలో తొందర పడ్డారు. ఆ తొందర పడడం కూడా పద్దతిగా తొందరపడి వుంటే వ్యవహారం వేరుగా వుండేదేమో?
మాన్సాస్ చైర్మన్ గా, సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్టు చైర్మన్ గా అశోక్ గజపతిని తప్పించడం వరకు ఒకె. కానీ అది ఎవరికి ఇవ్వాలి అన్నది ముందు క్లారిటీగా చూసుకోవాలి కదా? మాన్సాస్ వ్యవహారాలు ఏం చెబుతున్నాయి? నిబంధనలు ఏమిటి అన్నది చూడాలి. ఆపైన వాటి ప్రకారం అర్హులు ఎవరు అన్నది చూడాలి.
అవేమీ చూడకుండా సింహాచలం ఆలయం మీద పెత్తనం చెలాయించాలనుకునే కొందరి మాట విన్నారేమో, రాంగ్ రూట్లో వెళ్లారు. అశోక్ అన్న ఆనంద్. ఆయన ఇప్పుడు లేరు. ఆయన మొదటి భార్యకు అధికారికంగా విడాకులు ఇచ్చారు. సెటిల్ మెంట్లు చేసారు.ఆమె కు వేరే కుటుంబం వుంది ఇప్పుడు. పైగా ఆనంద్ రెండో పెళ్లి చేసుకున్నారు. భార్య, పిల్లలు వున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడో విడాకులు తీసుకుని సెటిల్ మెంట్ చేసుకున్న మొదటి భార్య కుమార్తెను రంగంలోకి తీసుకురావడం ఏమిటి? ఆపై ఆమె పని తీరు ఏమన్నా బాగుందా. అనేక వివాదాస్పద నిర్ణయాలు. ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు దెబ్బతినేలా పలు నిర్ణయాలు.
పైడితల్లి పండగ సందర్భంగా తన పిన్నమ్మ..సోదరిల పట్ల సంచయిత వ్యవహరించిన తీరు ఉత్తరాంధ్ర వాసుల్లో నెగిటివ్ గా నిలిచిపోయింది. ఇప్పుడు అందుకే జగన్ కు కోర్టులో ఎదురు దెబ్బ అంటే వైకాపా అభిమానులు కూడా హ్యాపీగా వున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం వైకాపా జనాలు కూడా జగన్ చర్యతో ఏకీభవించడం లేదన్నది వాస్తవం.
ఈ నెగిటివిటీ అంతా ఎవరి ఖాతాలో పడుతుంది. జగన్ ఖాతాలోనే కదా? సంచయితను గద్దెనెక్కించి, వెనుక నుంచి ఆదిపత్యం చెలాయించాలనుకునే సాములోర్లు బాగానే వుంటారు. పరువు పోయేది జగన్ దే.
ఇకనైనా దేవాదాయ శాఖ విషయాల్లో తప్పుడు సలహాలు ఇచ్చే సాములోర్లను పక్కన పెట్టడం ఉత్తమం. లేదూ అంటే దేవాదాయ శాఖ లో జరుగుతున్న వ్యవహారాలు మరింత నెగిటివిటీని పెంచి పోషిస్తాయి. అది జగన్ కు ఏమంత మంచిది కాదు.