Advertisement


Home > Politics - Gossip
అనంత టీడీపీలో కమ్మ, రెడ్డి చదరంగం!

అనంతపురం అర్బన్‌ రాజకీయాలు మరింత ఆసక్తిదాయకంగా మారాయి. ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తెలుగుదేశంలో చేరిక అంశం కొత్త రచ్చకు కారణం అవుతుండటమే ఇక్కడ ఆసక్తిదాయకమైన అంశం. గత ఎన్నికల్లో ఓడిపోయింది హద్దు గురునాథరెడ్డి రాజకీయంగా పెద్దగా హడావుడి చేయడంలేదు. అసలుకు గత ఎన్నికల్లో గురునాథరెడ్డి ఓటమి పాలవ్వడమే ఆయన అలసత్వ వైఖరికి నిదర్శనం అని వేరే చెప్పనక్కర్లేదు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో గురునాథరెడ్డి అసహనం ఈనాటిది కాదు.. అనంత వెంకట్రామిరెడ్డి వచ్చి జగన్‌ పార్టీలో చేరినప్పటి నుంచినే ఈయన బాధ మొదలైంది. అప్పట్లో సర్ది చెప్పారు. చివరకు గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి జేసీ దివాకర్‌ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను గెలిపించండి... అనంతవెంకట్రామిరెడ్డిని  ఓడించండి  అన్నట్టుగా సాగింది గురునాథరెడ్డి ప్రచారం. నన్ను గెలిపించండి, మా పార్టీ ఎంపీ అభ్యర్థిని ఓడించండి అని అంటే జనాలైనా నమ్ముతారా?

మొత్తానికి అటు అనంత ఎంపీ సీటును, ఎమ్మెల్యే సీటును రెండింటినీ కోల్పోయింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఇలాంటి నేపథ్యంలో గురునాథరెడ్డి మూడేళ్లుగా కామ్‌గా ఉండి పోయాడు. ఈ నేపథ్యంలో జగన్‌ కూడా ప్రత్యామ్నాయాన్ని చూసుకుని.. ముస్లిం క్యాండిడేట్‌కు అనంతపురం ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే బావుంటుందనే వ్యూహంతో కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చాడు. ఆయనకు అనంత జిల్లాలోని మిగతా వైసీపీ నేతల మద్ధతు కూడా ఉండటంతో.. జగన్‌ ప్రొసీడ్‌ అయ్యాడు.

దీంతో గురునాథరెడ్డిలో అసహనం పెల్లుబుకింది. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి తన అసహనాన్ని అందరికీ తెలియజేశాడు. మరి అంతిమంగా తెలుగుదేశంలో చేరడం... మరి దీనివల్ల సాధించేది ఏమిటనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం.

గురునాథరెడ్డి టీడీపీలో చేరడాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి వ్యతిరేకించాడు. పరోక్షంగా సెటైర్లు కూడా వేశాడు. చంద్రబాబు దగ్గరకు వెళ్లి టికెట్‌ విషయంలో భరోసా తెచ్చుకున్నాడట ఈయన. చంద్రబాబు అయితే ఆమాట చెప్పలేదు కానీ.. గురునాథరెడ్డి చేరినా టికెట్‌ మాత్రం చౌదరికేనట. బాబు ఈ మేరకు హామీని ఇచ్చాడని చౌదరి చెప్పుకున్నాడు. మరి ఇది నిజంగా నిజమేనా? ఇవతల గురునాథరెడ్డికి కూడా బాబు ఇదే హామీని ఇచ్చినా ఇచ్చి ఉండవచ్చు కదా? అనేది సహజమైన సందేహం.

అయితే అనంత టీడీపీలో బలమైన కమ్మ లాబీ ఉంది. ఆ లెక్కన చూస్తే.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చౌదరికే టీడీపీ టికెట్‌ దక్కే అవకాశం ఉంది. అయితే చౌదరి అంటే పడని కమ్మ వాళ్లు ఉన్నారు. వారిలో పరిటాల సునీత ముఖ్యులు. ఇప్పటికే పరిటాల, ప్రభాకర్‌ చౌదరి వర్గాలు అనంత టౌన్లో తలపడ్డాయి. ఎలాగైనా చౌదరి ప్రాధాన్యతను తగ్గించాలనేది సునీత ప్రయత్నం. అందుకోసం.. ఈమె గురునాథరెడ్డికి మద్దతు పలుకుతోంది. ఇప్పుడు కాదు.. చాన్నాళ్లుగానే పరిటాల, గురునాథ రెడ్డి వర్గాలు ములాఖత్‌ అయినట్టుగా లోకల్‌గా టాక్‌.

గురునాథ రెడ్డి కుటుంబానికి చెందిన మిస్సమ్మ ట్రస్టు భూమి వ్యవహారాల్లో భారీగా ముడుపులు తీసుకున్నారని.. చాలామంది టీడీపీ నేతలు ఇప్పుడు ఆ వ్యవహారంపై కామ్‌గా ఉన్నారు, అదంతా ముడుపుల ప్రభావమే అని.. స్థానికులు అంటూ ఉంటారు. ఇదే సమయంలో మంత్రి పరిటాల సునీత గురునాథ్‌ రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్నారని... ఆయనను పార్టీలోకి తీసుకురావడంలో కూడా ఆమెదే ముఖ్యపాత్ర అని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. చౌదరికి చెక్‌ చెప్పడానికి, వైసీపీ నుంచి ఒకరిని తెచ్చిన వ్యక్తిగా చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయడానికి ఆమెకు ఇదే మంచి అవకాశం లాగా ఉంది.

ఇక మరోవైపు టీడీపీలో ఉన్న జేసీ సోదరులకు, గురునాథరెడ్డికి కూడా సత్సంబంధాలే ఉన్నాయి ఆది నుంచి. గురునాథరెడ్డి సోదరులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేసినా.. ఆ తర్వాత జేసీ సోదరులు టీడీపీలోకి వెళ్లిపోయినా.. వీళ్లంతా భాయీభాయీగానే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో... గురునాథరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి మరింత సానుకూల పరిణామాలు ఏర్పడ్డాయి.

మరి ఇంత కథ ఉన్నా.. టికెట్‌ మాత్రం నాదే అని చౌదరి చెప్పుకుంటున్నాడు. అలాగే మిస్సమ్మ ట్రస్టు స్థలం విషయంలో కూడా చంద్రబాబు గురునాథరెడ్డి సోదరులకు ఎలాంటి సాయం చేయరు.. అని చౌదరి అంటున్నారు. మరి ఏ హామీ లేకుండానే గురునాథరెడ్డి చేరాడంటే నమ్మడానికి జనాలు వెర్రివాళ్లు కాదు కదా! అక్కడకూ వైసీపీ అధినేత నుంచి గురునాథరెడ్డికి ఎమ్మెల్సీ హామీ వచ్చింది. అయినప్పటికీ జంప్‌ చేశారంటే.. లోలోన పెద్ద స్కెచ్చే ఉండి ఉండవచ్చు. ఏదేమైనా.. గురునాథరెడ్డి చేరిక చౌదరికి ప్రమాదకరమైనదే! అటు జేసీ, ఇటు పరిటాల సునీత ఇద్దరూ చేతులు కలిపి.. చౌదరిని తొక్కేసేలా ఉన్నారు. అందుకు గురునాథ్‌ రెడ్డి చేరికే నిదర్శనం. ఇక బాబు వాళ్లకు ఏమాత్రం సహకరిస్తారు? అనేదాన్ని బట్టి చౌదరి భవితవ్యం ఆధారపడి ఉంది.