Advertisement


Home > Politics - Gossip
'అవసరమైతే'నే కోర్టుకి వెళ్తారు

రాష్ట్రానికి అన్యాయం జరిగితే, 'అవసరమైతే' కోర్ట్ కి వెళ్తానంటూ చంద్రబాబు చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనుకొనే సిద్ధాంతం అది. ఏదో యధాలాపంగా ఆ ప్రకటన చేయలేదు.

నాలుగేళ్ళపాటు కిమ్మనకుండా, కేంద్రాన్ని వెనకేసుకొచ్చారు. తన చాణక్యంతో నిధులు రాబడుతున్నానన్నారు. ప్రత్యేక హోదాను అటకెక్కించి, ప్రత్యేక ప్యాకేజీ వస్తోందని అర్ధరాత్రి సమావేశం పెట్టిమరీ ప్రకటించారు. పైగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దని అంటుందా అని జోకులేసారు. సన్మానాలు చేసారు, చేయించుకున్నారు.

మరి ఇప్పుడు కోర్టుకెందుకు వెళ్తామంటున్నారు? ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. గత ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ ను రక్షించగల అనుభవజ్ఞుడు అని ఊదరగొట్టి, నమ్మించి తటస్థ ఓటర్ల మద్దతు సంపాదించగలిగారు. నాలుగేళ్ళు సమీపిస్తున్నా తన అనుభవంతో కనీసం విభజన చట్టంలో పొందుపరచబడిన హామీలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయారు. సరికదా కేంద్రం విదిల్చిన వాటిని కూడా తన విజయాల ఖాతాలో వేసుకొని ఆ మేరకు ప్రచారం చేసుకున్నారు. కేంద్ర పథకాలకు సంబంధించిన ప్రచారంలో కూడా తన ఫొటో మాత్రమే వేసుకున్నారు.

పైగా రాష్ట్ర వృద్ధి రేటు, జాతీయ వృద్ధి రేటుని మించిపోయిందనీ, లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేసాయని తన అనుకూల మీడియా సహాయంతో ప్రచారం చేసుకున్నారు. ఇవన్నీ స్థానిక బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తూనే ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కు ఏ సహాయం చేసినా తమకు ఎటువంటి లాభమూ లేదని అర్థం చేసుకున్న కేంద్రం బాబుకు ముఖం చాటేయడం మొదలు పెట్టింది.

దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన అతి కష్టపడి చాలా నెలల తరువాత మోడీ అపాయింట్ మెంట్ సంపాదించారు. ఈ భేటీ లో బాబుగారు ఏమేమి అడగబోతున్నారో ఏమేమి సాధించబోతున్నారో మీడియాకు లీకులిచ్చారు. కానీ ప్రధానితో భేటీ అనంతరం ఆయన అసహనం చూస్తే ఎటువంటి హామీని పొందలేదని అర్థం అయ్యింది. తాజాగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బాబుగారి ఎదురుగానే చేసిన వెటకారాలు కూడా ఆయన దీన స్థితికి అద్దం పడుతున్నాయి.

అనుభవజ్ఞుడు అని తన మీద ప్రజలకు ఉన్న ఇమేజ్ పోయి విఫల నాయకుడు అనే ముద్ర పడుతున్న నేపధ్యంలో తాజాగా కోర్టుకు వెళ్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోణం లోనే చూడాలి.

రాష్ట్రం అధోగతికి కారణం తాను కాదని, బీజేపీయేనని ప్రజల్లో ప్రొజెక్ట్ చేయడం, రాష్ట్ర ప్రయోజనల కోసం 'అవసరమైతే' కేంద్రంతోనైనా పోరాడే ధీశాలిగా తన ఇమేజ్ ని కాపాడుకోవడం చంద్రబాబు ముఖ్య వ్యూహం. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జగన్ తో జట్టు కట్టకుండా నిరోధించడం రెండవ వ్యూహం. ఈ విషయంలో ఆయన ఆల్మోస్ట్ విజయం సాధించినట్లే. ఎందుకంటే 2019లో వైసీపీ, బీజేపీలు గనుక పొత్తు పెట్టుకుంటే ఆ రెండూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసాయని సెంటిమెంట్ ని ఎగదోయవచ్చు. దీనికి అనుకూల మీడియా సంపూర్ణ సహకారం ఎలాగూ ఉంటుంది.

ఒక వేళ దీనికి భయపడి వైసీపీ గనుక బీజేపీని దూరం పెడితే త్రిముఖ పోటీ జరిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చవచ్చు. చంద్రబాబుకి తన ఆపద్బాంధవుడు జనసేనాని పవన్ కళ్యాణ్ సహకారం ఎలాగూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చంద్రబాబు అనుకూల మరియు బీజేపీ, జగన్ ల వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టేసారు.

2014ఎన్నికల్లో కూడా బాబు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి విజయం సాధించారు. ముందుగా థర్డ్ ఫ్రంట్ లో కర్చిఫ్ వేసారు. ఆ ఎన్నికల్లో జగన్ మతతత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తుకోవాలని చూస్తున్నాడని, ఈ దెబ్బతో మైనారిటీలు వైసీపీకి దూరం అయిపోతారని విపరీతమైన ప్రచారం చేసారు. దీనికి భయపడిన జగన్ బీజేపీతో కలవనని స్పష్టం చేసేసాడు. దీంతో జగన్ కి ఒంటరిగా పోటీ చేయడం, బీజేపీకి టీడీపీతో కలవడం మినహా వేరే ఆప్షన్ లేకుండా చేసారు.

మతతత్వ పార్టీ అని నిందించిన బాబు తానే మళ్ళీ అభివృద్ధి కోసం అంటూ బీజేపీతో జట్టు కట్టారు. థర్డ్ ఫ్రంట్ ని వదిలేసారు. ఎన్నికల ముందు టీడీపీ వాళ్ళనే కొంతమందిని బీజేపీలోకి పంపించి, వాళ్ళకి టిక్కెట్లు ఇప్పించుకున్నారు. అజ్ఞాతవాసిలో హీరో పాత్రధారిలా చివరి క్షణంలో పవన్ కళ్యాణ్ ను దింపారు. ఇదీ చంద్రబాబు మార్క్ రాజకీయం. అనుకూల మీడియా దీనినే చాణక్యం అని పేరు పెట్టి మురిసిపోతూ ఉంటుంది.

ఇప్పటికైతే కేంద్రంపై కోర్టుకి వెళ్తానని చెప్పడం కొందరికి ఉత్తుత్తి బెదిరింపు గానూ, మరికొందరికి హాస్యాస్పదంగానూ అనిపించవచ్చు. ఆయన కోర్ట్ కి వెళ్ళకపోవచ్చు. ఇప్పటికిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోకపోవచ్చు. కానీ ఇంత సీరియస్ మాటను దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే తీసుకోవాలి.