Advertisement


Home > Politics - Gossip
అవాస్తవాలు ఎవరివి జగన్‌వా, చంద్రబాబువా!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగిన తీరు, ఆ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన తొమ్మిది హామీలు ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి సహజంగానే ఇబ్బంది కలిగిస్తాయి. దానిని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పార్టీ నేతలను వైసీపీపై దాడి స్పీడ్‌ పెంచాలని ఆదేశించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ దాడి క్రమంలో ఆ పార్టీ నేతలు ఒకటి మర్చిపోతున్నారు.

ప్రజలకు కూడా జ్ఞాపక శక్తి, వారికి సొంత అనుభవం ఉంటాయన్న సంగతిని విస్మరించి విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి వైసీపీ నేతలు కూడా తమవంతు డైలాగులు విసరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూ జగన్‌ ప్లీనరీలో వాస్తవాలు చెప్పలేదని అంటే, వైసీపీ నేత అంబటి రాంబాబు తిప్పికొడుతూ చంద్రబాబు అబద్ధాలు ఆడడంలో ఆధార్‌ కార్డుకు ఉన్నంత గ్యారంటీ కలిగినవాడని ఎద్దేవా చేశారు.

ఇక చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్‌ మరోఅడుగు ముందుకేసి హామీలన్నీ అమలు చేసేశామని చెబుతున్నారు. మరోమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి రైతుల రుణాలన్ని మాఫీ చేసేశామని అంటున్నారు. మరి కొందరు అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని ఎప్పటి మాదిరి ఆవు కథ చెప్పారు. నిజంగానే జగన్‌ అవాస్తవాలు చెప్పారా? లేక చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారా? జగన్‌ చేసినవన్నీ తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు.

ఇందులో అవాస్తవాలకు ఆస్కారంలేదు. ఆయన వాటిని అమలు చేయగలుగుతారా? లేదా అన్నది ఆయన అధికారంలోకి వచ్చాక చర్చనీయాంశం అవుతుంది. మరి అదే చంద్రబాబు విషయంలో అయితే ఆ అవకాశంలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో 600 పైచిలుకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక అబద్ధాలు అనండి, అసత్యాలు అనండి చెప్పడం ద్వారా బయటపడాలని తంటాలు పడుతున్నారు. ఉదాహరణకు రైతుల రుణమాఫీ గురించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి చెప్పారు?

మొత్తం రైతు రుణాలన్నిటిని రద్దు చేస్తామని చెప్పారా? లేదా? తీరా అమలులోకి వచ్చేసరికి ఎన్ని కొర్రీలు వేశారు? అంటే అది అబద్ధం ఆడినట్లు అవుతుందా? కాదా? డ్వాక్రా రుణాల గురించి ఏమి చెప్పారు? దానిని ఎందుకు అమలు చేయలేదు. నిరుద్యోగులకు రెండువేల రూపాయల బృతి ఇస్తామన్నారా? లేదా? అలాగే కాపులకు రిజర్వేషన్‌లపై ఏమిచెప్పారు.. ఆ తర్వాత ఎన్ని పిల్లిగంతులు వేస్తున్నారు.. మహిళలందరికి సెల్‌ఫోన్‌లు ఇస్తామని, ఆయా వర్గాలకు ఏదేదో చేస్తామని చెప్పిన హామీలన్నీ అమలు చేయకుండానే చేసేశామని చెప్పడం అబద్ధం అవుతుందా? లేదా అన్నది ఆలోచించాలి.

మహిళలదరికి సెల్‌ఫోన్‌లు ఇస్తామని చెప్పారా? లేదా? ఇప్పుడు ఎందుకు చేయడంలేదు.. ఆ ఊసే ఎత్తడంలేదే? ఇలాంటివి చెప్పుకుంటూపోతే చంద్రబాబు ప్రభుత్వం డొల్లతనం అడుగడుగునా కనిపిస్తుంది. నిజానికి గత ఎన్నికల సమయంలో జగన్‌ కూడా అసత్యాలు చెప్పగలిగి ఉంటే, ముఖ్యంగా రుణమాఫీ ఎంతైనా చేస్తామని అన్నా ఆయననే ఎక్కువగా విశ్వసించే అవకాశం ఉండేది. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అలాంటి విశ్వసనీయత సంపాదించుకుంటే, చంద్రబాబు అబద్ధాలతో అధికారం సంపాదించుకున్నారన్న అప్రతిష్ఠను మూటకట్టుకున్నారు.

అప్పట్లో వైఎస్‌ ఒకమాట అంటుండేవారు రెప్ప ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని, అది తమవల్ల కాదని అనేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా చంద్రబాబు కాని, టీడీపీ నేతలు కాని అబద్ధాలు చెప్పకుండా, నిజాయితీగా తాము చేసిన తప్పు, ఒప్పుల గురించి ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలకు చెప్పగలిగి ఉంటే గౌరవంగా ఉండేది. కాని ఇప్పటికీ అబద్ధాలతో రాజకీయం చేయాలని ఆలోచిస్తుండడమే విషాదం. మరి ఎల్లవేళలా అబద్ధాలే రాజ్యమేలుతాయా? 

-కొమ్మినేని శ్రీనివాసరావు