cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబూ లోకేషూ.. మీ టిక్కెట్‌ సంగతేంటి.?

బాబూ లోకేషూ.. మీ టిక్కెట్‌ సంగతేంటి.?

మంత్రి నారాలోకేష్‌, కర్నూలు జిల్లా రాజకీయాల్లో 'కుంపట్లు' రాజేసేశారు. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లను ఖరారు చేసేస్తూ.. తాను ఖరారు చేసిన వ్యక్తుల్ని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించేస్తున్నారు. 'తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది..' అన్నట్టుంది వ్యవహారం. 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయమే వుంది. ఈలోగా లోకేష్‌, అభ్యర్థుల్ని ఖరారు చేయడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌, ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించినప్పుడు ఒకట్రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసిన మాట వాస్తవం. అయితే, ప్రతిపక్షాల పరిస్థితి వేరు.. అధికార పార్టీ పరిస్థితి వేరు. అయినా, పార్టీ అధినేతగా వైఎస్‌ జగన్‌ అభ్యర్థుల్ని ఖరారు చేస్తే ఆ లెక్క ఇంకోలా వుంటుంది. మంత్రిగా లోకేష్‌.. అధికారిక కార్యక్రమంలో చేసిన ప్రకటనకు 'విలువ' ఇంకోలా వుంటుంది.
 
లోకేష్‌ ప్రకటనపై మాజీమంత్రి, ప్రస్తుత ఎంపీ (రాజ్యసభ) టీజీ వెంకటేష్‌ తీవ్రంగా స్పందించారు. 'లోకేష్‌ పార్టీ అధ్యక్షుడే కాదు..' అని తేల్చేశారు టీజీ వెంకటేష్‌. అయినా, టీడీపీ సంప్రదాయం ప్రకారం బి-ఫామ్‌ ఇచ్చాకే అభ్యర్థి ఎవరన్నది తేలుతుందని టీజీ వెంకటేష్‌ సెలవిచ్చారు. చినబాబు నారా లోకేష్‌కి తెలుగుదేశం పార్టీలో వున్న 'విలువ' ఏపాటిదో టీజీ వ్యాఖ్యల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో టీజీ వెంకటేష్‌ విరుచుకుపడినా, పెదబాబు.. అదేనండీ.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెదవి విప్పలేకపోయారు.
 
ఇతరుల టిక్కెట్లు ఖరారు చేయడం సంగతి పక్కనపెడితే, లోకేష్‌ ముందుగా తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నానన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సి వుంది. చిత్తూరుజిల్లా నుంచి అని ఓసారి, కాదు.. అనంతపురం జిల్లా నుంచి అని మరోసారి.. ఇవేవీ కాదు కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గమని మరోసారీ.. టీడీపీ నుంచే లీకులు బయటకు వస్తున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో చినబాబు ఇంకా నిర్ణయించుకోలేదుగానీ.. ఆయనగారు ఇతర నేతల టిక్కెట్లను ఖరారు చేయడమట.. వినడానికే ఎంత కామెడీగా వుందో కదూ.! 

పార్టీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం గనుక.. టిక్కెట్ల ఎంపికలో లోకేష్‌ 'పాత్ర'ని తక్కువగా అంచనా వేయకూడదు. కానీ, ఇలా టిక్కెట్లు ఖరారయ్యాయో లేదో.. అలా వ్యతిరేకత వ్యక్తమవుతోందంటే, చినబాబు నిర్ణయం అభాసుపాలైనట్టే కదా.!