Advertisement


Home > Politics - Gossip
బాబు ఘనత ఒకవైపు... వైఎస్సార్‌ విజయాలు మరోవైపు...!

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సాధారణ ఎన్నికలకు ప్రచారం అప్పుడే ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయముంది. అప్పుడే ప్రచారమా? అని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఏడాది లేదా ఏడాదిన్నర ముందే ప్రచారం ప్రారంభించడం రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌. టిడిపి ప్రారంభించిన 'ఇంటింటికీ తెలుగుదేశం', వైకాపా మొదలుపెట్టిన 'వైఎస్సార్‌ కుటుంబం' కార్యక్రమాలు ఎన్నికల ప్రచారమనడంలో సందేహం లేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా నాయకులంతా రోడ్డు మీద పడి ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగారంటే ఎన్నికల ప్రచారం కాక మరేమిటి? రెండు పార్టీల కార్యక్రమాలు ఒకేరోజు ప్రారంభం కావడం ఆసక్తికరం. రెండు పార్టీల లక్ష్యం ప్రజలను ఆకట్టుకోవడమే. ఈ కార్యక్రమాల ఫలితం సాధారణ ఎన్నికల కంటే ముందే జరిగే కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడుతుంది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో టిడిపి నాయకులు చేసే పనేమిటి?

చంద్రబాబునాయుడు ఘనతను కీర్తించడం, ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టడం, సంక్షేమ, అభివృద్ధి పథకాలను వల్లె వేయడం. వైకాపాకు ఓట్లు వేయొద్దని, అది అభివృద్ధిని అడ్డుకునే పార్టీ అని జనం బుర్రల్లోకి ఎక్కించడం కూడా ప్రచారంలో భాగం. వైకాపా చేసే పనేమిటి? చంద్రబాబు సర్కారు చేస్తున్న అవినీతిని, అక్రమాలను వివరించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టడం, మోసాలు చేస్తున్నారని చెప్పడం, జగన్‌కు అధికారం కట్టబెడితే మంచి పరిపాలన ఇస్తాడని వారి మైండ్‌సెట్‌ మార్చే ప్రయత్నం చేయడం.

జగన్‌ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తాడని ప్రజలను నమ్మించాలంటే వైకాపాకు ఉన్న మార్గం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పరిపాలనను గుర్తు చేయడం. ఆయన అమలు చేసిన పథకాలను జ్ఞాపకం చేయడం. ఆ పథకాల వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని, అలాంటి మంచి మళ్లీ జరగాలంటే జగన్‌ అధికారంలోకి రావాలని చెప్పడం.

వైఎస్సార్‌ పథకాలు, విజయాలే ప్రధాన అజెండాగా వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమం సాగుతోంది. ఇందులో ఉన్న మరో ప్రధానాంశం ప్రతి కుటుంబం నుంచి ఒకరినైనా వైకాపాలో సభ్యత్వం ఇప్పించడం. నిజానికి జనం మధ్య ఎక్కువగా తిరగాల్సిన అవసరం వైకాపాకే ఉంది. ఈమధ్య జరిగిన రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అంటే ప్రజలు వైకాపాను పూర్తిగా నమ్మలేదని అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో జనాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. అధికారంలో ఉన్న టిడిపి సాధారణ ఎన్నికలకు చాలా ముందుగానే ఇంతటి ప్రయాస పడాల్సిన అవసరం లేదు. నంద్యాల, కాకినాడలో ఘన విజయం సాధించి జోరు మీదున్న టిడిపి పట్ల ప్రజాభిప్రాయం అప్పుడే మారే అవకాశం లేదు. అయినప్పటికీ వైకాపా ఎక్కడ పుంజుకుంటుందోనని చంద్రబాబుకు భయం ఉండొచ్చు. భయం కారణంగా జనంలోకి పోతున్నామని చెప్పుకోలేరు కదా.

టిడిపి నాయకులు చెబుతున్నదాని ప్రకారం... ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు పూర్తిగా తెలియడంలేదు. సంక్షేమ పథకాల పట్ల అవగాహన లేకపోవడంతో వాటిని సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. పథకాలపై అవగాహన కల్పించడానికే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించారట...! ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిల పనితీరును విశ్లేషించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందట...! ఇదిలాఉండగా, గత వారం రోజుల్లో నాలుగు లక్షల మంది వైకాపా సభ్యుత్వం తీసుకున్నారని ఆ పార్టీ నాయకులు మురిసిపోతున్నారు.

వారంలోనే ఇన్ని లక్షలమందైతే కార్యక్రమం ముగిసేలోగా ఎన్ని లక్షలమంది సభ్యులవుతారో...! ఎన్ని లక్షలమంది సభ్యులయ్యారన్నది ముఖ్యం కాదు. ఓట్లు పడటమే ప్రధానం. వైకాపా దీన్ని సాధించగలదా? మూడున్నరేళ్లు చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన ఫలితం మొన్నటి రెండు ఎన్నికల్లో కనబడింది. ఇది శాంపిల్‌ మాత్రమే. ఇదే ఫలితం సాధారణ ఎన్నికల్లో కనబడుతుందా? అంటే చెప్పలేం. నంద్యాల, కాకినాడలో జగన్‌ ప్రచారానికి తండోపతండాలుగా జనం వచ్చారు. ప్రజలు జగన్‌ వెంటే ఉన్నారనే ఫీలింగ్‌ కలిగింది. కాని ఫలితం మరోలా ఉంది. జనం నాడిని పసిగట్టడం సులభం కాదు.