cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు భ‌య‌ప‌డుతున్నారా? భ‌య‌పెడుతున్నారా?

బాబు భ‌య‌ప‌డుతున్నారా? భ‌య‌పెడుతున్నారా?

టీడీపీ ఎమ్మెల్యేల‌పై నివేదిక‌లు చూసిన సీఎం చంద్రబాబు సీరియ‌స్ అయ్యార‌ని, అంద‌రి జాత‌కాలు త‌న ద‌గ్గరున్నాయ‌ని హెచ్చరిస్తున్నట్టు ఆయ‌న అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేయ‌డం చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థంకాని ప‌రిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేల ప‌నితీరు అధ్వానంగా ఉంద‌ని, వారిపై ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేక‌త ఉంద‌నే విష‌యం స్పష్టమైంది. దీంతో అధికారాన్ని కోల్పోతామ‌నే భ‌యం బాబుకు నిద్రలేని రాత్రుల‌ను మిగుల్చుతోంది. ఇదే స‌మ‌యంలో తీవ్ర అస‌హ‌నానికి లోనైన బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌పై ఆగ్రహం వ్యక్తం చేశార‌ని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం... టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు, వారు చేసిన అభివృద్ధి పనులపై పార్టీ రాష్ట్ర కార్యాలయం నివేదిక సిద్ధంచేసింది. అంత‌టితో టీడీపీ అధిష్టానం ఆగ‌లేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స‌ద‌రు నివేదిక ద‌గ్గర పెట్టుకొని ఒక్కో ఎమ్మెల్యేను పిలిపించుకుని త‌న‌దైన శైలిలో బెదిరింపుల‌కు దిగార‌ని తెలిసింది. అంతేకాదు ఎమ్మెల్యే జాతకాల చిట్టాను వారికే అందజేశారు.  నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, అంతర్గత విబేధాలు, త‌దిత‌ర అంశాలపై నివేదిక‌లో స‌వివ‌రంగా పేర్కొన్నారు.

త‌మ ప‌నితీరుపై గ్రామ‌స్థాయి మొద‌లుకుని త‌యారుచేసిన నివేదిక‌ను జాగ్రత్తగా చ‌దువుకున్న ఎమ్మెల్యేలు ఆశ్చర్యంతో పాటు ఆందోళ‌న‌కు గుర‌య్యార‌ని స‌మాచారం. త‌మ‌పై నిఘాపెట్టిన విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డడంతో ఏంచేయాలో పాలుపోని ప‌రిస్థితి వారిది. పనితీరు మార్చుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేల‌ను సీఎం హెచ్చరిస్తున్నప్పటికీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కద‌నే భ‌యం వారిలో ఉంది.

గెలిచే వారికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుంద‌ని సీఎం స్పష్టం చేస్తుండ‌టంతో, త‌మ‌పై ప్రతికూల నివేదిక ఉన్న ఎమ్మెల్యేలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి మ‌రో వేదిక చూసుకోవ‌డం మంచిద‌నే అభిప్రాయంతో ఉన్నట్టు స‌మాచారం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో స‌గానికి పైగా సీట్లలో అభ్యర్థులను మార్చితే త‌ప్ప వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధికారంలోకి రావ‌డం క‌ష్టమ‌నే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నార‌ని తెలిసింది.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు విచ్చల‌విడిగా అవినీతికి, దౌర్జన్యాల‌కు పాల్పడుతున్నా... ఏనాడూ చంద్రబాబు అడ్డుకునేందుకు ప్రయ‌త్నించ‌లేదు. పైపెచ్చు అలాంటి ఎమ్మెల్యేల‌కు అండ‌గా నిలిచార‌నేందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లను చెప్పుకోవ‌చ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యేల‌పై ప్రజ‌ల్లో వ్యతిరేక‌త ఉంద‌ని నివేదిక‌లు రావ‌డంతో చంద్రబాబు అధికారాన్ని కోల్పోతామ‌ని భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.