Advertisement


Home > Politics - Gossip
బాబు ఏం చేసినా ఆదర్శంగా ఫాలోకావాలా?

చంద్రబాబునాయుడు కొత్తగా తెలుగురాష్ట్రాల్లోని ప్రజలకు ఓ పిలుపు ఇచ్చారు. ఇప్పుడు బతుకు తెరువు కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి.. అక్కడ గడుపుతున్న తెలుగువాళ్లందరూ కూడా సంక్రాంతి పండుగకు తమ తమ సొంత ఊళ్లకు తిరిగి రావాలని.. ఇప్పుడు పట్టణాలన్నీ ఖాళీ అవుతున్నాయని.. దీనివల్ల పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు.

అంటే చంద్రబాబునాయుడు గారు ఇటీవలి కాలంలో సంక్రాంతి పండగ నాటికి తన స్వగ్రామం నారా వారి పల్లె వెళ్లడాన్ని అలవాటుగా మార్చుకున్నారు గనుక.. జాతి మొత్తం దాన్ని ఫాలో కావాలన్నమాట. తాను ఏం చేస్తే అదే తెలుగుజాతికి ఆదర్శం అని చంద్రబాబునాయుడు ఫీలవుతున్నట్లుగా ఈ వ్యవహారం కనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు మరో ట్విస్టు ఇస్తున్నారు. ఇలా ఇతర ఊర్లలో బతుకుతున్న వాళ్లంతా సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు రావడం అలవాటు చేసుకుంటే.. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కూడా మెరుగుపడతాయిట. అదెలా జరుగుతుందో మాత్రం సామాన్యులకు అర్థం కావడం లేదు. కేవలం పండగకు వచ్చి వెళ్లే వారు మూడు రోజులు గడిపినంత మాత్రాన.. ఊరికి శాశ్వతమైన రీతిలో మౌలిక వసతులు ఎలాపెరుగుతాయో తేలడం లేదు.

కాగా, జనం మాత్రం సీఎంకు మరో ప్రశ్న సంధిస్తున్నారు. అందరూ పండగకు ఊరికి రావాలని పిలుపు ఇస్తున్నారు సరే.. వారికోసం ప్రభుత్వ అధినేతగా మీరేం చేస్తున్నారు అనేదే ఆ ప్రశ్న.

ఎందుకంటే.. పండగకు ఊరికి వెళ్లాలని అనుకునే వారికి చాలా రకాలుగా కష్టనష్టాలు ఎదురవుతున్నాయి. ప్రయాణానికి బస్సు రైలు టికెట్ల దగ్గరినుంచి అవస్థలు ప్రారంభం అవుతాయి., హైదరాబాదు నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సు టిక్కెట్టు ఒక్కొక్కటి మూడు వేల రూపాయల వరకు ధర పలుకుతున్నదంటే అతిశయోక్తి కాదు. ఇదే సీజను కదా.. అని ప్రెవేటు బస్సు ఆపరేటర్లు ఎడాపెడా దోచుకుంటున్నారు. మరి ఇలాంటి దోపిడీల్ని అరికట్టడానికి ప్రభుత్వాధినేత ఏం చేస్తున్నారనేది ప్రజల ప్రశ్న.

సంక్రాంతి పండుగ నాటికి అందరూ సొంత ఊర్లకు వచ్చేయండి అని చంద్రబాబు పిలుపు ఇవ్వడం అనేది.. ఏదో ప్రజలు- పండగ సెలబ్రేషన్స్ కోసం చెప్పినట్లుగా లేదని... ప్రెవేటు బస్సు ఆపరేటర్ల బిజినెస్ ను ప్రమోట్ చేయడానికి చెబుతున్నట్లుగా ఉన్నదని కూడా పలువురు సెటైర్లు వేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ అధినేతగా వ్యవస్థను గాడిలో నడపడం గురించి ముందు ఆలోచించాలని.. ప్రెవేటు బస్సు ఆపరేటర్ల దోపిడీని అరికట్టడానికి ఏమీ చేయలేని అచేతన ప్రభుత్వంగా కూచోకుండా చర్యలు తీసుకోవాలని.. ఆ తర్వాతే ఇలాంటి సుద్దులు చెప్పాలని ప్రజలు అంటున్నారు.