Advertisement


Home > Politics - Gossip
రాజమౌళికి గౌరవం... నార్మన్‌ ఫోస్టర్‌కు అవమానం...!

చంద్రబాబు నాయుడివంటి ముఖ్యమంత్రి ప్రస్తుతం దేశంలో ఎవరూ లేరు. గతంలోనూ ఉండకపోవచ్చు. భవిష్యత్తు చెప్పలేం కదా. ఇలా చెప్పడమంటే ఆయనపై ప్రశంసలజల్లు కురిపించడం కాదు. ఎంతటి గొప్ప పాలకుడైనా ఒకటో రెండో పిచ్చిపనులు చేయకుండా పరిపాలన సాగించడు. చరిత్రలో మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ నిజానికి గొప్ప రాజు. కాని ఆయన చేసిన కొన్ని పిచ్చి పనుల కారణంగా అప్రదిష్ట పాలయ్యారు.

చివరకు తుగ్లక్‌ అనే ఆయన పేరు 'పిచ్చివాడు'కు పర్యాయ పదంగా మారింది. చంద్రబాబూ ఇదే టైపని ఇప్పుడు అర్థమవుతోంది.  బేసిగ్గా ఆయన సమర్థుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు.  పాలనలో అనేక లోపాలున్నాయి. తెలియక జరిగేవి కొన్నయితే, తెలిసి జరిగేవి చాలా ఉంటాయి. ఇలా తెలిసి చేసే పిచ్చి పనుల్లో అమరావతి డిజైన్ల వ్యవహారం ప్రధానమైంది.

రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు ఎంత ప్రజాధనం వృథా చేశారో, చేస్తున్నారో అంచనా వేయడం కష్టం. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాధనమంటే లెక్కలేకుండాపోయింది. అమరావతి నిర్మాణానికి స్వదేశీ ఆర్కిటెక్టులు పనికిరాలేదు. వారు పనికిమాలినోళ్లనే అభిప్రాయం వ్యక్తం చేశారు. విదేశాల వెంట పడ్డారు. కోట్లు ఖర్చు పెట్టి దేశాలు తిరిగారు. మంత్రులనూ తిప్పారు. విదేశీ నిర్మాణ సంస్థలను పిలిపించి ప్రజల డబ్బును వారికి ధారాదత్తం చేస్తున్నారు.

కేవలం డిజైన్ల తయారీకి కోట్లు ఖర్చు పెడుతూ, తయారుచేశాక తిరస్కరిస్తున్నారు. ఈ సంస్థలకు ప్రపంచంలో గొప్ప నిర్మాణాలు చేసిన ఘన చరిత్ర ఉంది. అయినా సరే వారి డిజైన్లు బాబు కళ్లకు ఆనడంలేదు. ఆయన నెత్తినెక్కించుకున్న నార్మన్‌ ఫోస్టర్‌ అత్యంత ప్రసిద్ధ సంస్థ. ఈయన వాళ్లకేం చెప్పారో, అది ఎంతవరకు అర్థమైందో తెలియదుగాని వారు చేసిన డిజైన్లు చూసి పెదవి విరిచారు.

చివరకు బాబుకు తృప్తి కలిగించే ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఇంటర్మీడియట్‌ కూడా పూర్తి చేయని నేను ఏవో సినిమాలు తీసుకుంటున్నాను..ఆర్కిటెక్చర్‌ గురించి నాకు తెలియదని దాచుకోకుండా చెప్పిన సినీ దర్శకుడు రాజమౌళి. 'బాహుబలి'లోని ఊహాజనిత నగరం 'మాహిష్మతి' మీద మనసుపడిన చంద్రబాబు దర్శకుడిని వదిలిపెట్టలేదు. మొదటిసారి తిరస్కరించిన రాజమౌళిని ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు.

ఇక తప్పదనుకున్నాడో, ఇది తనకు ఇచ్చిన గౌరవం అనుకున్నాడోగాని మంత్రి నారాయణ తదితరులతో సమావేశమయ్యాడు. లండన్‌ వెళ్లడానికి సిద్ధమయ్యాడని సమాచారం. చంద్రబాబు ఆశలన్నీ రాజమౌళి మీదనే ఉన్నాయి. నార్మన్‌ ఫోస్టర్‌కు ఇంటర్మీడియట్‌ దాటని, ఆర్కిటెక్చర్‌ చదవని సినిమా దర్శకుడు సలహాలు ఇవ్వబోతున్నాడు. దీని ద్వారా రాజమౌళి గౌరవం పెరుగుతుందేమోగాని విదేశీ సంస్థకు మాత్రం అవమానమే.

అసలు బాహుబలి సినిమాకు పనిచేసిన సాంకేతిక బృందానికే కాంట్రాక్టు అప్పగిస్తే సరిపోతుంది. ఖర్చు కూడా ఎక్కువకాదు.   పూర్వకాలంలో రాజులు తాము ఏదైనా చూసి మనసు పారేసుకుంటే దాన్ని సాధించి తీసుకురావాలని అధికారులను ఆదేశించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రూపంలో ఉన్న రాజు చంద్రబాబు నాయుడు బాహుబలి సినిమాలోని మహిష్మతి నగరాన్ని చూసి మనుసు పారేసుకొని  అలాంటి నగరాన్ని (ఐకానిక్‌ భవనాలను) నిర్మించి పూర్వ వైభవం ప్రజలకు చూపించాలనుకుంటున్నారు.

ప్రపంచంలోని పలు దేశాలు తిరిగి నిజమైన, అద్భుతమైన నగరాలను చూసి మనసు పారేసుకొని అమరావతిని  విదేశీ నగరంలా కట్టాలనుకున్నారు. ఏ నగరం చూస్తే దానిలా అమరావతి నిర్మిస్తానన్నారు. కాని చంద్రబాబు రాజుకు ఏదీ నచ్చలేదు. చివరకు అవాస్తమైన గ్రాఫిక్స్‌ నగరం మహిష్మతి ఆయనకు తెగ నచ్చేసింది ఎందుకో అర్థం కావడంలేదు. ఈయన ఆలోచనల స్థాయి చందమామ కథలను దాటలేదా?  మాహిష్మతి రాజమౌళి ఆలోచనల్లోంచి పుట్టిన నగరం కాబట్టి దాన్ని వాస్తవంగా నిర్మించాలంటే ఆయన సహకారం అవసరం.

సినిమాలోని నగరాన్ని చూసి మనసు పారేసుకొని అలాంటి నగరం నిర్మించాలనే ఆలోచన ప్రపంచంలోని ఏ పాలకుడికీ వచ్చివుండదేమో....! ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్టులు రూపొందిస్తున్న డిజైన్లు చంద్రబాబుకు ఎందుకు నచ్చడంలేదు? అసలు అమరావతిని ఆయన ఎలా నిర్మించాలనుకున్నారు? ఆయన భ్రమల్లో జీవిస్తూ ప్రజలను ఊహాలోకాల్లో తేలియాడిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పనికిమాలిన డిజైన్లు ఎందుకు రూపొందిస్తున్నాయి? అలాంటప్పుడు విదేశీయుల కంటే మనోళ్లే గొప్పోళ్లు కదా. బాబుకు పొరుగింటి పుల్లకూర తప్ప దేశవాళీ కూర రుచిగా ఉండదు. విదేశీయులను పట్టుకొని ఇంతకాలం వేలాడి ఇప్పుడు ఒక సినిమా దర్శకుడిని సలహాలు ఇవ్వమన్నారంటే 'గొప్పోడు' అని ఎవరిని అనుకోవాలి? బాబు స్థాయి తగ్గిందా? రాజమౌళి స్థాయి పెరిగిందా?

-మేనా