Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబు కనిపెట్టిన కొత్త రాజకీయ సిద్ధాంతం

రాజకీయం అంటే భావం, భాష అనుకుంటాం. రాజకీయం అన్నది ఒక తత్వశాస్త్రంగా భావిస్తాం. రాజకీయాలు ప్రజలకు విలువలు భోదించడానికి, ప్రజాసేవ చేయడానికి అని అంతా అభిప్రాయపడతాం. సమాజానికి విలువలు నేర్పవలసిన రాజకీయ వ్యవస్థ రాను రాను ఎలా దిగజారిపోతోందో తెలుసుకున్న కొద్ది ఆవేదన కలుగుతుంది. ఈ రాజకీయాలను మార్చలేమా అన్న ఆవేశం వస్తుంది. కాని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారే ఇలా మారిపోతే ఏమి చేయగలమన్న నిస్సహాయత ఏర్పడుతుంది. నిరాశ కలుగుతుంది. అది మంచిది కాకపోయినా వాస్తవం అది.

అందుకే కాస్త చదువుకున్న వారు రాజకీయాలలోకి రావాలంటే భయం అవుతోంది. కాస్త విలువగా, నిజాయితీగా ఉందామనుకున్నవారు రాజకీయాలలోకి రావాలంటే వణికే పరిస్థితి వస్తోంది. ఇప్పుడు రాజకీయాలంటే సిద్ధాంతాలు కాదు. రాజకీయాలంటే మేనేజ్‌మెంట్‌. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త సిద్ధాంతం కనిపెట్టారు. అది ఏమిటంటే మూడు పీ.లతో కూడుకున్నది. పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌, పోల్‌ మేనేజ్‌మెంట్‌ అని వాటికి ముద్దుగా పేర్లు పెట్టారు. పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ అంటే సిద్ధాంతాలు, విలువల గురించి చెప్పి ప్రజలను ఒప్పించడం కాదు.

ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను, లేదా నేతలను కొనేయడం అన్నమాట. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను 21మందిని ఎలాంటి భేషజం లేకుండా నిస్సిగ్గుగా తెలుగుదేశంలో చేర్చుకోవడం పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌గా అనుకోవాలన్నమాట. అదే విషయాన్ని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. వయసులో చిన్నవాడైనా విపక్షనేత జగన్‌ తెలుగుదేశం నుంచి వచ్చిన ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డితో వేలాది మంది ప్రజల సమక్షంలో పదవికి రాజీనామా చేయించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి చేర్చుకుని విలువలు పాటిస్తే, ఎంతో సీనియర్‌ అయిన చంద్రబాబు మాత్రం తాను పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నాను కనుక అలాంటి విలువలు అవసరంలేదని భావిస్తున్నారనుకోవాలి. అంతేకాదు.

నంద్యాల ఉపఎన్నికలో జగన్‌ ప్రచారయాత్రలో ఆయన వాహనంపై కనిపించిన గ్రామ, పట్టణ స్థాయి నేతలను కొందరిని సైతం తెలుగుదేశం పార్టీ లక్షలు ఇచ్చి కొనుగోలు చేసిందట. అది కూడా పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ కింద తీసుకోవాలేమో. ఇక పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ప్రజలకు నీతులు, అభివృద్ధి పనులు చెప్పడం అనుకుంటాం. అదికాదని ఇప్పుడు కొత్త సిద్ధాంతం వచ్చింది. అందులోను నంద్యాలలో దానిని అమలుచేసి చూపించారు. ఉపఎన్నిక వస్తోంది కనుక అక్కడ వందలకోట్ల విలువైన పనులకు జీఓలు ఇవ్వడం, తమను గెలిపించకపోతే అవన్ని ఆగిపోతాయని బెదిరించడం, రోడ్లు తవ్వి ఓటు వేయకపోతే అవి అలాగే ఉంటాయని చెప్పడం.

ఒక్కో మండలానికి మామూలుగా అయితే నాలుగైదు ట్రాక్టర్‌లు ఇస్తారు. అలాంటిది ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే 600 ట్రాక్టర్‌లు పంపిణీ చేశారట. ఇక పెన్షన్లు అప్పటికప్పుడు మంజూరు చేయడం, ఏ నియోజకవర్గంలోను లేని విధంగా పదమూడువేల ఇళ్లు కట్టిస్తామని ప్రజలను నమ్మించడం, అవి అబద్దమో, నిజమో తేలేలోపు ఎన్నిక అయిపోతుంది. తమకు అనుకూలంగా ఫలితం వస్తుంది. అది పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌ అంటే కొత్త సిద్ధాంతం వచ్చింది. ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ఓటర్లను ఓటుహక్కు వినియోగించుకోవాలని చెప్పడం అని మనం ఇంతకాలం అనుకున్నాం. కాని ఇప్పుడు అది మారింది.

ఓటర్లకు వేలరూపాయల డబ్బు పంచడం, అందుకు పోలీసుల సాయం తీసుకోవడం, అలాగే ఓటింగ్‌లో కూడా పోలీసులను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీల వారిని బెదిరించడం, ఓట్లు అధికార పారీకి వేయకపోతే మీ అంతు చూస్తామని పోలీసులతో బెదిరించడం, వీలైనంత మేరకు అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం.. ఇవన్ని పోల్‌ మేనేజ్‌మెంట్‌ అనుకోవాలని కొత్త సిద్ధాంతం చెబుతోంది. పోల్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ అన్నారంటేనే అది ఆ పార్టీ ఓటమి చెందినట్లేనని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు సూత్రీకరించినా, అది నైతిక ఓటమికే పరిమితం అవుతుంది.

అంతిమంగా విజయం సాధించిన వ్యక్తే కాలర్‌ ఎగరవేసుకుని తిరిగే పరిస్థితి ప్రస్తుత సిద్ధాంతాల ప్రకారం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రజల పాత్ర ఏమిటి. నేతలు ఏ పార్టీ వారు అయినా ఇచ్చిన డబ్బు తీసుకుని ఓట్లు వేయడమేనా? ఇలా నిజాయితీ లోపించిన నేతలు చెప్పినట్లు చేయడమేనా? సమాజానికి ఇది మంచిదేనా? భవిష్యత్తుకు ఉపయోగమేనా? అని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఇంకారాలేదా? ప్రజల పేదరికాన్ని డబ్బుతో కొనుగోలు చేస్తున్న నేతల వ్యాపారాన్ని చూస్తూ సహించవలసిందేనా.

ఇది తప్పు అని చెప్పే వ్యవస్థ రాదా? ఎన్నికల కమిషన్‌లు ఆదాయపన్ను శాఖ వంటివి కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై దాడులకే తప్ప అధికార పార్టీల జోలికి వెళ్లలేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బకాదా? ఓట్లు కొనుగోలు చేసి మొత్తం ఓటర్లు అంతా చాలా సంతృప్తిగా ఉన్నారని ప్రచారం చేసుకుంటే జనం ఒప్పుకోవలసిందేనా? రాజకీయాలు ఇలా అనైతికంగా సాగిపోతుంటే ఎప్పుడు దీనికి నిష్కతి అని ఎవరికివారు ప్రశ్నించుకోకపోతే, ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనేశామని రాజకీయ నేతలు ఆనంద పడిపోతారు.

ఓటు అన్నది ఆత్మగౌరవం. అభివృద్ధి అన్నది హక్కు అన్న సంగతిని ప్రజలు గుర్తించనంతకాలం, ఓట్లను అమ్ముకోవడానికే ప్రాధాన్యత ఇచ్చినంతకాలం ఇలాంటి పోల్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌దే పైచేయి అవుతుంది. ఎప్పటికీ ఇలాగే ఉంటుందా. అంటే ఉండకపోవచ్చు. ఉండదనే ఆశిద్ధాం. సాధారణ ఎన్నికలలో అయినా ఇలాంటి మనేజ్‌ మెంట్లకు లొంగకుండా ప్రజలు స్వేచ్చగా ఓట్లు వేస్తారని, తమ తీర్పు ఇస్తారని ఆకాంక్షిద్దాం.

-కొమ్మినేని శ్రీనివాసరావు