Advertisement


Home > Politics - Gossip
బాబు మామూలుగా మాట్లాడలేరా?

చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నార్మల్‌గా ఉండేవారు. బాగానే మాట్లాడేవారు. ఎప్పుడైతే అవశేష ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటినుంచి ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా మూట తీరులో అనూహ్యంగా మార్పు వచ్చింది. ఆత్మస్తుతి, పరనింద బాగా పెరిగిపోయాయి. పరిపాలన విషయం పక్కన పెడితే ప్రధానంగా ఆయన చేసేవి రెండు పనులు. ఒకటి తనను తాను విపరీతంగా పొగుడుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, తనంత మొనగాడు దేశంలోనే లేడని చెప్పుకోవడం, నిప్పులాంటివాడినని ప్రచారం చేసుకోవడం. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ మీద, వ్యక్తిగతంగా జగన్‌ మీద విపరీతమైన అక్కసు వెళ్లగక్కడం. బాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచి కాంగ్రెసును, కమ్యూనిస్టు పార్టీలను పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. ఆ రెండు పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకపోవడమే కాకుండా ప్రజాదరణ శూన్యమైంది కాబట్టి పట్టించుకోవడంలేదు. ఆయన కక్ష పూర్తిగా వైకాపా మీదనే. చంద్రబాబు, జగన్‌ రాజకీయంగా విమర్శలు చేసుకోవడం మానేసి వ్యక్తిగతంగా తిట్టుకోవడం ఏపీ రాజకీయాల్లో దిగజారుగుతనానికి పరాకాష్ట.

చంద్రబాబు అతిశయోక్తులు, ఆత్మస్తుతి ఎప్పుడు తగ్గించుకుంటారో అర్థం కావడంలేదు. అలా మాట్లాడటం బాగా అలవాటైపోయింది కాబట్టి మామూలు మనిషిలా మాట్లాడలేకపోవచ్చు. ఇదో రకమైన సైకలాజికల్‌ ప్రాబ్లెం కావచ్చు. అందరికీ అర్థమయ్యే భాషలో ఉన్న విషయాలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలి. కాని చంద్రబాబు ఆ పని చేయరు. ఆయన గొప్పలకు అంతుపొంతూ ఉండదు. తనను దైవాంశసంభూతుడిగా చిత్రీకరించుకుంటారు. ఆయన మాటలు విని టీడీపీ నాయకులు సంతోషపడతారేమోగాని సామాన్య ప్రజలకు వెగటు కలుగుతుంది. అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణం గురించి అదేపనిగా ఊదరగొట్టారు. గ్రాఫిక్స్‌ చిత్రాలు విడుదల చేసి అరచేతిలో స్వర్గం చూపించారు. ఈ ప్రహసనం కొన్నాళ్లు కొనసాగించాక రాజధాని నిర్మాణం గందరగోళమైంది. క్లారిటీ లేకుండాపోయింది. దీంతో అరచేతి స్వర్గాలు ఆగిపోయాయి.

తాజాగా స్టార్టప్‌ ఏరియాలో నిర్మాణాల కోసం సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఒళ్లు తెలియకుండా మాట్లాడారు. 'రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించమని దేవుడు నన్ను ఆదేశించాడు' అన్నారు. ఇది మత ప్రచారకులు మాట్లాడినట్లుగా ఉందిగాని ముఖ్యమంత్రి మాట్లాడినట్లు లేదు. రాజధాని నిర్మించాలని దేవుడు ఆదేశించినట్లయితే రాష్ట్ర విభజన కోరుకోవాలని కూడా (విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారుకదా) దేవుడు ఆదేశించాడా? రానున్న కాలంలో ప్రపంచంలోని ఐదు టాప్‌ నగరాల్లో అమరావతి కూడా ఉంటుందన్నారు. ఆలూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతలా ఉంది బాబు చెప్పింది. నగర నిర్మాణమే ఇంకా ప్రారంభం కాలేదు. అది పూర్తి కావడానికి కొన్నేళ్లు పడుతుంది. ఆ తరువాత క్రమంగా అభివృద్ధి చెందాలి. ప్రపంచంలోని టాప్‌ నగరాల్లో ఒకటి కావాలనే ఊహ నిజం కావడానికి దశాబ్దాలు పడుతుంది. ఇదంతా పాలకుల పనితీరు, విధానాల మీద ఆధారపడి ఉంటుంది. టాప్‌ నగరంగా మారేంతవరకు చంద్రబాబు అధికారంలో ఉండరు. ఆయన పార్టీయే దశాబ్దాలపాటు పరిపాలించదు.

'అమరావతిని భూతల స్వర్గం చేస్తా. స్వర్గంలో దేవతలు ఉంటారు. వారి రాజధాని అమరావతి. ఆ నగరానికి రాజు దేవేంద్రుడు. అలాంటి భూతల స్వర్గాన్ని మనం నిర్మించుకోబోతున్నందుకు మనం గర్వపడాలి' అన్నారు. ఇది పురాణ ప్రవచనంలా ఉంది తప్ప ముఖ్యమంత్రి ప్రసంగంలా లేదు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు నివసించే సౌకర్యవంతమైన రాజధాని కావాలిగాని దేవతలుండే రాజధాని ఎందుకు? దేవతల రాజధాని అమరావతికి ఇంద్రుడు రాజైతే ఈ రాజధానికి చంద్రబాబు రాజు అవుతారా? దేవతలంతా టీడీపీ నాయకులన్నమాట. దేవేంద్రుడి రాజధాని అమరావతి ఎలా ఉంటుందో బాబుకు తెలియదు. అదో అందమైన ఊహ మాత్రమే. అందుకే సింగపూర్‌ నగరంలా రాజధాని నిర్మిస్తామన్నారు. ఇది కళ్ల ఎదురుగా కనబడేది. సింగపూర్‌ను చూసినవారు అనేకమంది ఉన్నారు. అక్కడి వెళ్లనివారు ఇంటర్నెట్‌లో వీడియోలు, ఫొటోలు చూసుకోవచ్చు. వచ్చే ఎన్నికలనాటికి రెండో మూడో భవనాలు నిర్మించి వాటిని చూపించి ఓట్లు కొల్లగొట్టాలని బాబు అనుకుంటున్నారు. సింగపూర్‌ స్వర్గం నిర్మిస్తుందని బాబు చెబుతుంటే, దాంతో ఒప్పందం ఏపీకి నరకమేనని ప్రధాన ప్రతిపక్షం చెబుతోంది. అమరావతి భవిష్యత్తు ఎలా ఉంటుందో....!