Advertisement


Home > Politics - Gossip
బాబు నయావంచన: నిరసన తీర్మానం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కొత్త నాటకానికి తెర తీశారు. కేంద్రం మీద తెలుగుదేశం తరఫున ఏదో బీభత్సంగా పోరాటం సాగించేస్తున్నట్టుగా.. బిల్డప్ ఇవ్వడానికి.. ప్రజలు తనను ఛీకొట్టకుండా, తన అసమర్థతను వారు గుర్తించేయకుండా.. ముందుజాగ్రత్త పడడానికి నానా పాట్లు అనుభవిస్తున్న చంద్రబాబునాయుడు తాజాగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి నిరసనగా అసెంబ్లీ మంగళవారం నాడు తీర్మానాన్ని ఆమోదించింది.

ప్రధాని ఇచ్చిన హామీలు అన్నిటినీ ఏపీకి అమలు చేసి తీరాల్సిందేనని సదరు తీర్మానంలో ఫత్వా జారీచేసేశారు కూడా. తనకు నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని.. మరోమారు అసెంబ్లీలో గుర్తు చేస్తూ... చంద్రబాబునాయుడు స్వయంగా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడం విశేషం. ఎటూ ప్రతిపక్షం అనేది లేని అసెంబ్లీ నడుస్తున్నది గనుక.. తీర్మనం ఆమోదం పొందింది.

అయితే ఇలాంటి తీర్మానం వల్ల ఏం జరుగుతుంది? ఏం ఒరుగుతుంది? ఇలాంటి తీర్మానాల ద్వారా ప్రజలను మభ్యపుచ్చాలని చంద్రబాబునాయుడు ఎందుకు అనుకుంటున్నారో మాత్రం అర్థం కావడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు కూడా ఇలాంటి ప్రహసనం సుదీర్ఘకాలం పాటు నడిచింది. రాష్ట్ర విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం విరుద్ధంగా ఉంటే.. కేంద్రం ఇక ఏమీ చేయడానికి ఉండదని, చట్టం అలా పేర్కొంటున్నదని, వాజపేయి ప్రభుత్వంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినా.. అన్నీ అసెంబ్లీ తీర్మానాల ప్రకారమే ఏర్పడ్డాయని.. అసెంబ్లీ తీర్మానం అనేదానికి అంత విలువ ఉన్నదని అప్పట్లో.. న్యాయ, రాజ్యాంగ నిపుణులు అందరూ చాలా చాలా పేర్కొన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రయోగించిన ఈ అసెంబ్లీ తీర్మానం.. పార్లమెంటులో విభజన బిల్లును సుదర్శన చక్రంలాగా ఆపేస్తుందని బీరాలు పలికారు.. తీరా ఏం జరిగింది..! అంతా తుస్సుమంది. అసెంబ్లీ తీర్మానాన్ని చెత్తబుట్టలో పడేసి.. యథేచ్ఛగా పార్లమెంటులో విభజన బిల్లును ఆమోదించేశారు.

ఇప్పుడు కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పింది... రైల్వేజోన్ కూడా ఇవ్వబోం అనే తేల్చేసింది. ఇప్పుడిక కేంద్రం వైఖరికి నిరసనగా చంద్రబాబు అసెంబ్లీ తీర్మానించగానే.. కేంద్ర గడగడ వణికిపోయి అవన్నీ ఇచ్చేస్తుందా? ఎలాంటి ప్రత్యక్ష ఆందోళనలకు దిగకుండా నాటకాలు ఆడుతూ.. కేంద్రంలో ఎన్డీయేలోంచి బయటకు రాకుండా.. డ్రామాలు నడిపిస్తున్న చంద్రబాబు.. అసెంబ్లీ తీర్మానం అనే కొత్త సింగిల్ ఎపిసోడ్ డ్రామాను చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రంపై అవిశ్వాసం పెట్టి.. కనీసం కదలిక తీసుకురావడానికి కట్టుబడి ఉంటే.. ఆ ప్రయత్నాన్ని డ్రామాగా అభివర్ణిస్తున్న చంద్రబాబు.. ఎందుకూ ఈ అసెంబ్లీ తీర్మానం అనే దాని ద్వారా ఏ నాటకాలను రక్తి కట్టించదలచుకున్నారో.. ప్రజలను ఎలా బురిడీ కొట్టిస్తారో చూడాలని ప్రజలే పెదవి విరుస్తున్నారు.