cloudfront

Advertisement


Home > Politics - Gossip

అసెంబ్లీ గురించి బాబు నీతులు వినుకోండి!

అసెంబ్లీ గురించి బాబు నీతులు వినుకోండి!

అసెంబ్లీ గురించి చాలా నీతులే చెబుతున్నారు చంద్రబాబు నాయుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం గురించి చంద్రబాబు ధ్వజమెత్తాడు. రామప్పంతులులా నీతులు చెప్పాడు. అసెంబ్లీకి రాకుండా వైకాపా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని.. బాబు చాలా ఆందోళన వ్యక్తంచేశాడు. మరి చంద్రబాబు నీతిసూక్తముక్తావళిని బయటివాళ్లు ఎవరైనా వింటే.. ఈయనను ప్రజాస్వామ్య పితామహుడు అనుకోక మానరు.

అయితే అదే అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను అవతల నుంచి ఇవతల తెచ్చి పెట్టుకున్నాడని, వేరే పార్టీ తరఫున నెగ్గిన నలుగురికి తన కేబినెట్లో మంత్రి పదవులు ఇచ్చారని తెలియని వాళ్లు చంద్రబాబు సూక్తులు విని పాదాభివందనం చేసేస్తారు. అయితే తను చెప్పినవే విలువలు, తన నోటి నుంచి జాలువారేవే నీతులు. ఇదీ చంద్రబాబు లెక్క.

అంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే.. ఫిరాయింపు చేసినందుకు అనర్హులు కావాల్సిన వాళ్లు.. అసెంబ్లీకి వచ్చి మంత్రులుగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కూర్చుంటే చంద్రబాబుకు చీమైనా కుట్టినట్టుగా లేదు కానీ.. వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండా నిరసన వ్యక్తంచేస్తే మాత్రం ఎక్కడలేని అసహనం పుట్టుకొస్తోంది. ఫిరాయింపు చేసినందుకు అనర్హత ఎదుర్కొనాల్సిన వాళ్లు మంత్రులుగా చలామణి అయిపోతూ చట్టాలు చేస్తుంటే చంద్రబాబుకు సంతోషంగా ఉంది కానీ.. వైకాపా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నందుకు మాత్రం చచ్చేంత సిగ్గుగా ఉంది.

తను నిస్సిగ్గు రాజకీయాన్ని చేస్తూ.. అవతల వాళ్ల మీద బురద జల్లడం చంద్రబాబుకు తెలిసన ఏకైక రాజకీయ నీతి. విషయం ఏదైనా.. వ్యవహారం ఏదైనా చంద్రబాబు నాయుడు ఇదే ఫిలాసఫీని ఫాలో అవుతాడు. తను తప్పు చేస్తూ అవతల వాళ్ల మీద విరుచుకుపడటం బాబు చేసే రొటీన్ పని. ఇప్పుడూ అదే జరుగుతోంది.

ఫిరాయింపు దారులను సమర్థిస్తూ.. తను ‘సంతలో పశువులు’గా కొనుగోలు చేసిన వారి గురించి మాట్లాడకుండా చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలకు మాత్రం నీతులు చెబుతున్నాడు. ఈ నీతులు విని జనాలంతా తనను మంచోడని అనేసుకుంటారని చంద్రబాబు అనుకుంటున్నాడు. అయితే వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం అంటే.. అది ఏడో చేప కథ లాంటిది అని చంద్రబాబు గ్రహించలేకపోతున్నాడు.