cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు రాజకీయం ఓడిపోయింది..!

బాబు రాజకీయం ఓడిపోయింది..!

అసలు ఇలాంటి అవకాశాలను వదులుకునే టైపు కాదు చంద్రబాబు నాయుడు. అసలుకు.. అంతమంది ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసింది ఎందుకోసం? వాళ్లేమీ ప్రజా నేతలు కాదు.. ఏ పార్టీ తరఫున పోటీ చేసినా.. వ్యక్తిగత బలంతోనే నెగ్గేస్తారు... అనేందుకు లేదు. పార్టీ గుర్తు, ఇమేజ్ లేకపోతే.. వెయ్యి ఓట్లు కూడా సంపాదించుకోలేని వాళ్లు వాళ్లంతా. అలాంటి వాళ్లకు చంద్రబాబు కండువాలు వేశాడు.

అవతల తెలంగాణలో ఫిరాయిస్తే వాళ్లు పశువులు అని తిట్టిన బాబు.. ఏపీలో మాత్రం అలాంటి వాళ్లకే పచ్చకండువాలు వేశాడు. అంతజేసీ.. వాళ్లతో ఉపయోగం.. ఒక రాజ్యసభ సీటు అయినా ఉంటుందా? అంటే.. అది కూడా లేకుండా పోయింది. చంద్రబాబు రాజకీయం ఓడిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో మూడో సీటుకు చంద్రబాబు అభ్యర్థినే నిలపలేకపోయాడు.

ఇలాంటి రాజకీయాలు అంటే చంద్రబాబుకు భలే ఇష్టం. ఇప్పుడా? ఎప్పుడో 2000-01 సమయంలో అనంతపురం జడ్పీ చైర్మన్ గిరిని సొంతం చేసుకున్న తీరునే చంద్రబాబు రాజకీయం అంటే ఎలా ఉంటుందో అందరికీ అర్థం అయ్యింది. అప్పటికే ఎన్టీఆర్ కు వెన్నుపోటుతో చంద్రబాబు అధికారాన్ని సంపాదించుకున్న వ్యక్తే. అక్కడే బాబు నైజం బయటపడింది.

ఆ తర్వాత కూడా అలాంటి రాజకీయాల విషయంలో బాబు ఎప్పుడూ భయపడింది లేదు. ప్రజాస్వామ్యం.. దాని గురించిన నీతులు అనునిత్యం చెప్పే చంద్రబాబు.. ప్రజా స్వామ్యాన్ని పాతరేసే పనులే అనునిత్యం చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి అధికారం చేతిలో ఉందంటే.. బాబుకు అదే పని ఇక! అప్పట్లో అనంతపురం జిల్లాలో జడ్పీ ఎన్నికలకు తీవ్రమైన పోటీ నెలకొంటే.. తెలుగుదేశం పార్టీ నెగ్గే పరిస్థితి లేదని తెలిసి.. కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వాళ్ల చేత విత్ డ్రాలు చేయించారు!

పరిటాల రవి రంగంలోకి దిగి.. బెదిరింపులతో, చంపేస్తాం అనే హెచ్చరికలతో.. కాంగ్రెస్ అభ్యర్థుల చేత నామినేషన్లు వెనక్కు తీసుకునేలా చేశారు. అలాంటి విత్ డ్రాల వల్ల తెలుగుదేశం పార్టీ జడ్పీ చైర్మన్ గిరిని సొంతం చేసుకుంటే.. సొంత మీడియాకు మాత్రం ‘చక్రం తిప్పిన చంద్రబాబు అనంత జడ్పీ టీడీపీ వశం’ అని హెడ్డింగులు పెట్టింది.

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతికి రావడమే.. వెన్నుపోటు చరిత్ర. ఆ తర్వాత ఇలాంటి అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. బెదిరింపులు, బుజ్జగింపులు, కొనుగోళ్లు.. ఇవే తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి పార్టుకు సీక్వెల్ పార్టు ఇప్పుడు ఏపీలో నడుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లు.. యథేచ్ఛగా జరిగిపోయాయి. ఫిరాయించిన వాళ్ల చేత రాజీనామాలు చేయించే ధైర్యం లేదు.

పైకి నీతులు చెబుతూ.. మరోవైపు పచ్చకండువాలు వేయడం కొనసాగుతూ వచ్చింది. మరి ఇంత చేసిన బాబుకు.. రాజ్యసభ సీటుకు మూడో అభ్యర్థిని పెట్టడం. మరికొంతమంది వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టుకుని తన అభ్యర్థిని గెలిపించుకోవడం పెద్ద కథేం కాదు! బాబు ట్రాక్ రికార్డు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే.. బాబు రాజకీయం ఈ సారి ఓడింది. దీనికి రీజన్లు చాలానే అగుపిస్తున్నాయి.

ఒకటి ఇప్పుడు రాజ్యసభ సీటు విషయంలో కెళికితే.. కేంద్రం సహకారం లేకపోవడం, ఢిల్లీలోని ఒక బీజేపీ ముఖ్యనేత వారించడం(ఆయన లెక్కలు ఆయనవి), ఆల్రెడీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపితే వాళ్లు కాల్స్ ను రికార్డు చేసి అధిష్టానానికి ఇవ్వడం.. వంటి రీజన్లు.. ముఖ్యంగా టీడీపీ వైపు నుంచి వైకాపా ఎమ్మెల్యేలకు వెళ్లిన ఫోన్ల వాయిస్ రికార్డులే ఈ ఎన్నికల ఏకగ్రీవానికి కారణం అయ్యాయని టాక్. మొత్తాని చంద్రబాబు మార్కు రాజకీయం ఓడింది. ప్రజాస్వామ్యానికి ఇదొక గొప్ప రోజే!