cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబు తక్షణ కర్తవ్యం ఏమిటి?

బాబు తక్షణ కర్తవ్యం ఏమిటి?

2019 ఎన్నికలు అయిపోయాయి. స్థానిక ఎన్నికలు జరిగిపోయాయి. తిరుపతి ఉపఎన్నిక పూర్తయిపోయింది. అన్నింటా దారుణ ఘోర పరాజయం తప్పలేదు తెలుగుదేశం పార్టీకి. పోనీ అధికార పార్టీ దారుణాలు చేసేసింది. రిగ్గింగ్ లకు పాల్పడింది. జనం ఓట్లేయడానికి రెడీగా వున్నా, అధికారం అడ్డం పడింది అని కాస్సేపు తెలుగుదేశం వాదననే నమ్ముదాం. 

ఇలా చేయడం వల్ల ఎంత శాతం తేడా వస్తుంది. అయిదు, పది? అయితే గెలవడానికి ఇంకా చాలా కావాలే. కరోనా భయాన్ని సైతం పక్కన పెట్టి బాబుగారి రోడ్ షో లకు, సభలకు భయంకరంగా జనం వచ్చినట్లు అనుకుల మీడియా టముకేసింది. మరి వారంతా ఓట్ల కోసం ఎందుకు లైన్ లోకి రాలేదు. ఎక్కడి నుంచో రాని వాళ్ల ఓట్లు దొంగ ఓట్లుగా మారాయి అంటే నమ్ముదాం. కానీ లైన్ లో వుండి వేసేవాళ్లను ఎవ్వరూ అడ్డుకోలేదు కదా?

అధికారంలో వున్నన్నాళ్లు అయాచితంగా స్వంత పనులు చక్క బెట్టుకుని, అందిన మేరకు ఆర్జించుకున్న నేతలు అంతా ఇప్పుడు ఎక్కడ వున్నారు? పార్టీ అనుకూల మీడియాకు మెటీరియల్ సప్లయిర్స్ అన్నట్లు, ఏదో ఒక స్టేట్ మెంట్ ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 

ఓడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరైనా కావచ్చు. తమ తమ నియోజకవర్గ జనాలకు మొహం చూపించి ఎన్నాళ్లయింది? స్థానిక ఎన్నికల్లో గ్రామాల గడప తొక్కిన తెలుగుదేశం మాజీలు, నాయకులు ఎంత మంది? తిరుపతి ఉపఎన్నికను, విజయవాడ, విశాఖ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెడితే చంద్రబాబు జనంలోకి వెళ్లి చేసిన గట్టి ప్రయత్నం ఏమిటి?

జగన్ అధికారంలోకి వచ్చింది లగాయతు అమరావతి మీద, పార్టీ నాయకుల ఆక్రమణలపై జరిగిన దాడుల మీద తప్పిస్తే చంద్రబాబు అండ్ కో నోరు విప్పింది దేనిమీద? ఇంటర్ పరిక్షల విషయంలో చేసిన వర్చ్యువల్ ఫైట్ తప్పిస్తే మరోటి వుందా? ఇలాంటి ఫైట్ పెట్రోలు ధరలు, లేదా పెరిగిపోయిన నిత్యావసరాల ధరల మీద ఎందుకు చేయడం లేదు? సరే ఈ పోరాటాల సంగతి పక్కన పెడదాం

అసలు పార్టీలో కొత్త నాయకత్వ లేమి క్లారిటీగా కనిపిస్తోంది కదా? కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగింది. వృద్దతరం తమకు అవకాశం వున్నన్నాళ్లు మరొకరిని ఎదగకుండా చేసుకుంటూ వచ్చారు. ఢిల్లీలో తమ పలుకుబడి వాడుకుంటూ పార్టీలో మరో తరం నాయకులు ఎదగకుండా చేసారు. దాంతో అలా రాజకీయంగా ఎదగాలనుకున్న వారంతా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీది ఇదే పరిస్థితి. పార్టీ వయసు పెరుగుతోంది. పార్టీలో వున్న లీడర్లంతా 60 ప్లస్ లుగా మారుతున్నారు. యంగ్ జనరేషన్ ను అస్సలు ఎంకరేజ్ చేయలేదు. ఎప్పుడయితే లోకేష్ ను తెరపైకి తెచ్చారో, ఇక బాగోదు అని అందరు సీనియర్లకు వాళ్ల వాళ్ల వారసులను తీసుకువచ్చే అవకాశం ఇచ్చారు. కిమిడి ఫ్యామిలీ, అశోక్ గజపతి, అయ్యన్న, యనమల, పరిటాల ఇలా సీనియర్ల జూనియర్లు అంతా తెరపైకి వచ్చారు. 

దాంతో వారి వారి నియోజకవర్గంలో ఎదగాలనుకున్న వారికి పిక్చర్ క్లారిటీ పిచ్చగా వచ్చేసింది. ఇక ఇలా తరాలకు తరాలు తాము పల్లకీ మోయాల్సిందే అని. అందుకే మెల్లగా ఎవరిదారి వారు చూసుకున్నారు. చూసుకుంటున్నారు. మరోపక్క పార్టీ అధికారం వున్నపుడు రాజకీయాల్లోకి రాకపోయినా, సామాజిక బంధాలతో పార్టీ ద్వారా వ్యాపారాలు సాగించుకుని ప్రయోజనాలు పొందిన వారంతా ఇప్పుడు సైలంట్ అయిపోయారు. ఇప్పుడు పార్టీకి పెట్టుబడులు పెట్టడం, శ్రమించడం అనసరం అన్నట్లుగా వుండిపోయారు.

ఇక ఎవ్వరు పార్టీ పల్లకీని మోసేది? రథాన్ని లాగేది? ఇచ్ఛాపురం నుంచి కడప కర్నూలు వరకు పార్టీకి కొత్త నెత్తురు తేవాల్సి వుంది. యువతరాన్ని వెదికి పట్టుకుని, పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వుంది. వారికి పార్టీ నిర్వహణకు నిధులు అందించాల్సి వుంది. దిశానిర్దేశం చేయాల్సి వుంది. 

కానీ ఆ దిశగా బాబు అస్సలు ఆలోచిస్తున్నట్లు లేదు. ప్రజల వ్యతిరేకతను పెంచి పెద్దది చేస్తే చాలు. అందుకు తమ అనుకుల మీడియా వుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆటోమెటిక్ గా ఓట్లు తమకు పడతాయి. అధికార వ్యతిరేక ఓటు తో సులువుగా గద్దె ఎక్కేయచ్చు. అన్న విధంగానే ఆలోచిస్తున్నారు. కానీ మరో రెండేళ్లు ఇలాగే వదిలేస్తే, పార్టీలో ఎవరు మిగులుతారు. 

క్యాడర్ లేకుండా, రెండో, మూడో స్టేజ్ నాయకులు లేకుండా సీనియర్లు మాత్రం సాధించేదేమిటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటును పోలింగ్ బూత్ కు తీసుకెళ్లేదెవరు? అసలు ఆ మాటకు వస్తే తిరుపతిలో మాదిరిగా పోలింగ్ ఏజెంట్లుగా వుండడానికి కూడా జనం దొరుకుతారా?

బాబు ఆలోచించాలి. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×