cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబుపై 'వారెంట్‌'.. ఇది 'మహా'నాటకం.!

బాబుపై 'వారెంట్‌'.. ఇది 'మహా'నాటకం.!

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై 'నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌' జారీ అయ్యింది. మామూలుగా అయితే, రాజకీయ నాయకులకు ఇలాంటి కేసులు కొత్తేమీ కాదు. అయితే, ఎన్నికల ముందర ఇలాంటి కేసులు వెలుగులోకి రావడమే కాస్తంత 'రాజకీయ చర్చకు' కారణమవుతుంది. పైగా, కేసులతో కబడ్డీ ఆడుకోవడం చంద్రబాబుకి అలవాటేనని తెలిసీ, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు నానా హంగామా చేసేస్తున్నారు. 

ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రిందటి కేసు ఇది. బాబ్లీ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా టీడీపీ చేసిన ఆందోళన.. అందునా మహారాష్ట్రకి వెళ్ళి చేసిన 'యాగీ'పై నమోదైన కేసులో, ఇప్పుడు హఠాత్తుగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం చిత్ర విచిత్రమైన వ్యవహారమే. 'ఇదేమీ అంత సీరియస్‌ కేసు కాదు..' అంటూ ఆ సమయంలో చంద్రబాబుతోనే వున్న ఒకప్పటి టీడీపీనేత, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ నేత వేణుగోపాలాచారి సెలవిస్తున్నారు. ఆయన పరిస్థితి వేరు. చంద్రబాబుని సమర్థించలేరు.. ఆ కేసును తప్పుపట్టలేరు. అయినాగానీ, అదెంత 'లైట్‌ కేసు' అన్నది ఆయన మాటల్లో స్పష్టమయిపోతోంది. 

దేన్నయినా తమకు అనుకూలంగా మార్చేసుకోవడం 'తెలుగు తమ్ముళ్ళకు' వెన్నతో పెట్టిన విద్య. అందుకే, 'చంద్రబాబుపై జరుగుతున్న కుట్రకు ఇదే నిదర్శనం.. బీజేపీ తాటాకు చప్పుళ్ళకు బెదరం..' అని తెలుగు తమ్ముళ్ళు మీసం మెలేసి, తొడలు కూడా కొట్టేసుకుంటున్నారు కామెడీగా. చంద్రబాబుపై గతంలో అక్రమాస్తుల ఆరోపణలు వచ్చాయి. వాటి నుంచి చంద్రబాబు ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసు. అంతెందుకు, ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అడ్డంగా దొరికిపోతే, ఆ కేసుని బ్రీఫింగ్‌ చేసిన చంద్రబాబు.. ఎలా బయటపడిందీ చూస్తూనే వున్నాం. సో, చంద్రబాబుకి ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలే. 

2019 ఎన్నికల సమయంలో కేవలం సానుభూతితోనే గట్టెక్కెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆయనకు బాబ్లీ అంశం భలేగా కలిసొచ్చేలా వుంది. ఈ బాబ్లీ ఎఫెక్ట్‌, తెలంగాణలో టీడీపీకి ఎంతో కొంత మేలు కలిగిస్తుందని టీడీపీ నేతలే చెబుతుండడం గమనార్హం. అన్నట్టు, ఆ సమయంలో చంద్రబాబు వెనకాలే వుండి, ఆ కేసులో తాజాగా తాఖీదులు అందుకున్న నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో కీలకమైన పదవుల్లో వున్నారండోయ్‌. ఆ టీఆర్‌ఎస్‌కి, మహారాష్ట్ర ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలుండడం మరో విశేషం 

మొత్తమ్మీద, బాబ్లీ వారెంట్‌ పేరుతో.. 'మహా'నాటకం అయితే నడుస్తోంది. దీన్ని నాటకంగా చూడాలే తప్ప.. ఇందులో పొలిటికల్‌ డిజడ్వాంటేజ్‌ అనేది వుండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.